చాలా రోజులకు తెలుగులో వచ్చిన మంచి థ్రిల్లర్ ఇది.

కొమర్రాజు లంక లో కొత్తగా పెళ్ళైన ఒక జంట ఆ మర్నాడు హత్యకు గురవుతారు. ఆ హంతకుడు నగలు దోచుకుని పారిపోతూ దార్లో ఒక కారు దొంగతనం చేసి వీళ్ళ ఊరి మీదుగా వెళుతూ పెళ్ళి కొడుకు ఇంటి ముందు ఆక్సిడెంట్ అయ్యి పడిపోతాడు.

అయితే అతడే హంతకుడు అని తెలియని కుటుంబం అతడిని బ్రతికించే ప్రయత్నం చేస్తారు. ఈలోగా అతడే ఆ రెండు హత్యలు చేశాడని టీవీ లో చూపించడం తో అతడికి ఫస్ట్ అయిడ్ కూడా చెయ్యకుండా గొడ్ల పాకలో పడేస్తారు.

అక్కడికి పెళ్ళి కూతురు తండ్రి అయిన సాయి కుమార్, అతడి కుటుంబం కూడా వస్తారు. అతడిని పోలీసులకు అప్పగిద్దాం అని ఒకళ్ళు, కాదు అక్కడే చంపేయాలి అని మరొకళ్ళు ఇలా రకరకాల చర్చలు తర్వాత మర్నాడు పొద్దున్న వాడి సంగతి చూద్దాం అని అప్పటికి మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు.

మర్నాడు వెళ్ళి చూసేసరికి ఎవరో అతడి పీక కోసేసి చంపేస్తారు. ఈ విషయం తెలిసింది ఆ రెండు కుటుంబాలకు మాత్రమే.

ఇప్పుడు అతడిని చంపింది “పెళ్ళి కొడుకు” కుటుంబం లో ఉన్న రాధిక, చైతన్య కృష్ణ, చాందినీ చౌదరి యా లేక “పెళ్ళి కూతురు” తరుపు అయిన సాయి కుమార్, అతడి భార్యా లేక అతడి కొడుకా అనేది చూడండి.

ఇది ఒక వైపు కథ అయితే, మరో వైపు ఈ జంట హత్యల కేసు డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ నందినీ రాయ్ ని డ్రగ్స్ కోసం బ్లాక్ మెయిల్ చేసే పడమట లంక నవీన్ ది వేరే కథ.

తను ఫిజియో థెరపీ చేసే పేషెంట్ కీ, చాందినీ చౌదరి కీ మధ్యలో జరిగే కథ.

మొత్తం స్టోరీ రాసేసి థ్రిల్ పోగొట్టడం నాకు ఇష్టం లేదు.

ఈ సినిమాకి మెయిన్ అసెట్ ఆ లోకేషన్స్. ఒక్క ఇల్లు సెటప్ తప్పించి మిగతా అన్ని లోకేషన్లు కూడా గోదారి ఒడ్డున, కొబ్బరి తోటలు, ఆ పొలాలతో గోదారి జిల్లా లోకేషన్స్ చాలా సహజంగా ఉంటాయ్.

ఏడు భాగాలు అయినప్పటికీ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఒక్క క్యారక్టర్ కూడా వేస్ట్ అనిపించదు. ఆఖరికి సాయి కుమార్ ఇంట్లో పని చేసే పాలేరు భార్య తో సహా.

తిమ్మరుసు తర్వాత డైరక్టర్ శరణ్ కొప్పిశెట్టి నుండి వచ్చిన ఇంకో థ్రిల్లర్.

Zee 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. చూడండి.