Erin_Brockovich

అప్పుడప్పుడూ కొన్ని కంపెనీలు ఫ్రీ మెడికల్ క్యాంపులు, హెల్త్ చెకప్ లు పెడతాయి ఎందుకో తెల్సా..! దాన్నే మనం “CSR” కార్పొరేట్ సామాజిక బాధ్యత అని గొప్పగా పిలుచుకుంటూ వాటిని పొగుడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు వాటి వెనక ఉద్దేశ్యాలు వేరే ఉంటాయ్. చాలామంది కేవలం టాక్స్ బెనిఫిట్ కోసం అని అనుకుంటారు. కానీ కాదు.

కొన్ని సార్లు కాలుష్యం వల్ల కొన్ని కంపెనీ లు మూసేయ్యాలి అని పోరాటాలు జరిగి కొన్నాళ్లకు హఠాత్తుగా మాయం అయిపోతాయి. పత్రికల్లో దానికి వార్తలు కూడా రావు. ఎందుకో తెల్సా..!

సోదికి వెళితే పాత విషయాలు అన్నీ బయట పడ్డాయి అని ఒక నాటు సామెత తెల్సా..!

ఈ సినిమా విషయం లో పై రెండూ నిజం అనిపిస్తాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అంతా విశాఖపట్నం LG Polymers విష గాలి దుమారం నడుస్తోంది కాబట్టి ఇలాంటి కథతో సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది.

ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేస్తున్న ఒక చిన్న క్లర్క్ 27 బిలియన్ డాలర్ల విలువైన ఒక గ్యాస్ కంపెనీని ముప్పు తిప్పలు పెట్టి దాదాపు 333 మిలియన్ల నష్టపరిహారం ఇప్పించిన కథ.

“Erin Brockovich” ముగ్గురు పిల్లలు ఉండి రెండు సార్లు విడాకులు ఒంటరిగా బ్రతుకుతున్న ఒక మహిళ. అనుకోని పరిస్థితుల్లో ఒక లా కంపెనీ లో క్లర్క్ గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఆ కంపెనీ రియల్ ఎస్టేట్ లో చిన్న చిన్న అగ్రిమెంట్లు, డాక్యుమెంట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది.

ఒకసారి ఆ కంపెనీ కి కాలిఫోర్నియా లోని “హింక్లీ” ప్రాంతం నుండి తమ ఇంటి అమ్మకానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ తయారు చెయ్యమని ఒక కుటుంబం నుండి వర్క్ వస్తుంది. ఆ కాగితాలు చూస్తున్న హీరోయిన్ ఎరిన్ కి దానిలో మెడికల్ రిపోర్ట్స్ కూడా కనబడతాయి.

రియల్ ఎస్టేట్ లో మెడికల్ రిపోర్ట్స్ ఎందుకు వచ్చాయి అని హీరోయిన్ ఆ ఇంటికి వెళ్లి అడుగుతుంది. ఆ డీల్ కి సంబంధించిన పేపర్స్ అన్ని ఆ ఫోల్డర్ లో ఉన్నాయి.

అసలు విషయం ఏమిటంటే ఆ ఇంటిని “PG & E” అనే ఒక గ్యాస్ కంపెనీ కొంటాం అని ఆఫర్ ఇస్తుంది. అలాగే ఒకసారి ఆ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు ఈ కుటుంబానికి ఏదో అనారోగ్యం ఉంది అని తమ “సామాజిక బాధ్యత” గా తమ కంపెనీ డాక్టర్స్ తో వైద్యం చేయిస్తూ ఉంటుంది.

ఎందుకు అలా చేయిస్తోంది అని డౌట్ వచ్చిన ఎరిన్ ఇంకా ఎంక్వైరీ చెయ్యగా ఆ కంపెనీ ఆ ఏరియాలో సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా అక్కడ నేలలో తమ కంపెనీ నుండి బయటకి వచ్చే “క్రోమియం” అనే ఒక రసాయనాన్ని అలాగే వదిలేస్తోంది. అది అక్కడ నేలలో కలిసి భూగర్భ జలాలు అన్నీ కొద్ది కొద్దిగా విషపూరితం అయిపోతున్నాయి. అందుకే వారికి అనారోగ్యం వస్తోంది.

ఈ విషయం బయటకి రాకుండా అక్కడ ఉన్న ఇళ్ళు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా కొనేసి అక్కడ వాళ్ళను ఖాళీ చేయిస్తోంది. చాలా మందికి యిది మంచి పనిగా కనబడచ్చు. కానీ అక్కడ నుండి వెళ్ళిపోయాక వాళ్ళకు ఆల్రెడీ కంపెనీ వల్ల వచ్చిన రోగాలకు చికిత్స ఇవ్వదు. ఆ వైద్యం చాలా ఖరీదైన వ్యవహారం.

ఆ ఏరియాలో ఇంకా ఎంక్వైరీ చేసిన ఎరిన్ ఈ విషయాలు అన్నీ జాగ్రత్తగా సేకరించి అక్కడ ఉన్న అందరి చేత తమ లా కంపెనీ చేత కేసు ఫైల్ చేయిస్తుంది.

ఒక సమయంలో అసలు “PG & E” కి ఈ ఏరియా లో ఉన్న ప్లాంట్ కి సంబంధం ఉన్నట్టు ఆధారాలు కూడా మాయం చేస్తారు.

మొదట ఈ విషయాన్ని చిన్నగా తీసుకుని కేసును కోర్టులో ఏళ్ల తరబడి సాగదీద్దాం అనుకున్న “PG & E” తర్వాత కేసు ముదురుతోంది అని గ్రహించి దాదాపు 333 మిలియన్ల నష్టపరిహారం అక్కడ ఉన్న, ఇది వరకు ఉండి ఖాళీ చేసిన నిర్వాసితులు అందరికీ చెల్లించింది.

ఆ కేసు కి సంబంధించిన ఆధారాలు కోసం హీరోయిన్ చేసిన పోరాటం ఈ సినిమా..!

జూలియా రాబర్ట్ కి ఈ సినిమా కి గాను ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది.

ఈ సినిమా డైరెక్టర్ స్టీవెన్ సొడెన్ బర్గ్ నామినేట్ అయినప్పటికీ అవార్డ్ రాలేదు.

ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలు.

ఈ కేసులో 634 బాధితులకు వచ్చిన నష్టపరిహారం లో దాదాపు 5 మిలియన్ డాలర్లు కేసు వేసిన లా కంపెనీ ఫీజుగా తీసుకుంది. అప్పటికి అమెరికా చరిత్రలో ఇదే అత్యధిక నష్ట పరిహారం.

ఈ కేసు నెగ్గిన తర్వాత ఎరిన్ కి లా కంపెనీ 2 మిలియన్ డాలర్ల బోనస్ ఇచ్చింది.

ఈ సినిమా లో జూలియా రాబర్ట్ లైఫ్ స్టైల్ చూసిన అసలు “ఎరిన్” దాదాపు 99 శాతం తన జీవితం అలాగే ఉంది అని చెప్పింది. తన స్టోరీ నీ లక్ష డాలర్ల కు అమ్మేసింది.

ఈ కేసు కోసం ఆ ఏరియాలో ఎంక్వైరీ కోసం తిరిగిన తర్వాత రియల్ ఎరిన్ కాలుష్యం వల్ల హాస్పిటల్ పాలైంది.

“PG & E” దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ. ఈ కంపెనీ కి 1966 లో ఒకసారి సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా భూగర్భ జలాలు కలుషితం చేస్తున్నందుకు నోటీసు ఇచ్చారు.

ఈ కేసు తర్వాత కొన్నాళ్లకు ఆ ఏరియా అంతా ఖాళీ అయిపోయి ఘోస్ట్ సిటీ గా మారిపోయింది.

వంద సంవ్సరాల చరిత్ర ఉన్న ఈ కంపెనీ జనవరి 2019 లో దివాలా తీసింది.