Groundhog-Day

మనలో చాలా మంది ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చాలా సార్లు చూసే ఉంటాం. మీ జీవితం కనక ఒక పది సంవత్సరాల వెనక్కి వెళితే మీరు మార్చుకోవాలి అనుకున్న విషయం ఏంటీ అని.

ఉదాహరణకు గతంలో మీరు ఒక తప్పు చేశారు. కానీ కాలాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ మీరు ఆ తప్పుని సరి దిద్దుకునే అవకాశం వస్తే.!

కాలేజీలో మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు. కానీ భయం వల్ల చెప్పలేక ఆగిపోయారు. కానీ ఇవాళ ఆ అమ్మాయి కనబడి అప్పుడు మీరు కనక ప్రపోజ్ చేస్తే ఒప్పుకుని ఉండే దానిని అని అంది. మీకు మళ్లీ మీ కాలేజీ రోజులకు వెళ్ళే అవకాశం ఉంటే.!

పదేళ్ల క్రితం గిటార్, డ్యాన్స్ లాంటి ది ఏదో నేర్చుకుందాం అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు మళ్లీ ఆ పదేళ్ల వెనక్కి వెళ్ళి అవి నేర్చుకునే అవకాశం వస్తె.!

ఇవాళ ఎవరి మీదో అనుకోకుండా మాట తూలారు. కానీ తర్వాత అది తప్పు అని తెలుసు. కానీ మళ్ళీ అవకాశం వస్తె అలాగే మాట తూలకుండా కొంచెం నెమ్మదిగా సమాధానం చెప్పేవారేమో.!

ఒక సాయంత్రం తాగేసి బార్ బయటకు వచ్చి బండి తీశారు. సరిగ్గా నిమిషం తర్వాత ఆ తాగిన మత్తులో ఏక్సిడెంట్ చేశారు. జస్ట్ కేవలం ఆ ఒకే ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి మీ తప్పు సరి దిద్దుకునే అవకాశం వస్తె..!

ఎవరో వాళ్ళ పెద్ద వాళ్ళు పోయారు అని పోస్ట్ పెట్టారు. పొరపాటున లాఫింగ్ ఐకాన్ నొక్కారు. ఈ లోగా నోటిఫికేషన్ వెళ్ళిపోయింది. కానీ ఆ ఒక్క సెకన్ వెనక్కి వెళ్ళే అవకాశం వస్తె.!

ఇలా తను నిద్రలేచిన ప్రతీసారీ ముందు రోజుకు వెళ్ళి తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చిన ఒక జర్నలిస్ట్ కథే ఈ “Groundhog Day”. Groundhog అంటే అదొక రకం ఉడత లా ఉండే జీవి. ప్రతీ ఏడాదీ నార్త్ అమెరికాలో ఒక ఊరిలో ఫిబ్రవరి 2 వ తేదీన ఒక చిన్న తొఱ్ఱ లాంటి దానిలో నుండి బయటకు వచ్చి మళ్లీ దాని నీడ చూసుకుని లోపలకు వెళ్ళిపోతుంది. దాని నీడ కనిపిస్తే వింటర్ ఇంకా ఉంటుంది అని, ఒకవేళ కనబడక పోతే వింటర్ త్వరగా అయిపోతుంది అని అక్కడ జనాలకు ఒక నమ్మకం. దీన్ని ప్రతీ ఏడాదీ ఒక పెద్ద జాతర లా జరుపుతూ ఉంటారు.

దీన్ని కవర్ చెయ్యడానికి టీవీ లో వాతావరణం గురించి చెప్పే హీరో “ఫిల్” తన న్యూస్ టీమ్ లోని హీరోయిన్, ఇంకో కెమెరా మాన్ తో కలిసి ఆ ఊరికి వెళతాడు.

అతనికి ఆ ఊరిలో న్యూస్ కవర్ చెయ్యడం ఇష్టం ఉండదు. అందుకని ఏదో మొక్కబడిగా ఆ ఉడత బయటకు వచ్చిన వెంటనే న్యూస్ చెప్పేసి పోదాం అనుకుంటాడు. కానీ అనుకోకుండా ఏర్పడిన వాతావరణ మార్పులు వల్ల ఆ రాత్రి ఆ ఊరిలో నిద్రపోవాల్సి వస్తుంది.

మర్నాడు నిద్ర లేచేసరికి క్యాలెండర్ ఫిబ్రవరి 2 వ తారీఖు, గడియారం ఉదయం ఆరుగంటలు చూపిస్తూ ఉంటుంది. అతను రెడీ అయ్యి బయటకు వచ్చిన వెంటనే నిన్న కనబడిన మనుషులే, నిన్న పలకిరించినట్టే పలకరిస్తారు. నిన్న జరిగిన సంఘటనలే మళ్ళీ ఎదురుగా జరుగుతూ ఉంటాయి.ఈలోగా కెమెరామన్, హీరోయిన్ వచ్చి ఫెస్టివల్ స్టార్ట్ అయింది అని, న్యూస్ కవర్ చెయ్యాలి అని పిలుస్తారు.

ఇవన్నీ చూసి అతనికి కొంతసేపు బుర్ర పని చెయ్యదు. ఇతను అక్కడకు వెళ్లి న్యూస్ నిన్న చెప్పినట్టే మొక్కుబడిగా చెప్పేసి ఊరంతా తిరుగుతూ ఉంటే అన్నీ నిన్నటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. రాత్రి అవుతుంది. నిద్రపోతాడు.

మళ్లీ నిద్ర లేచేసరికి మళ్లీ రెండవ తారీకు ఉదయం ఆరుగంటల సమయం మళ్ళీ అదే మనుషులు, అవే పలకరింపులు, మళ్ళీ అదే రిపోర్టింగ్ చెయ్యాల్సి వస్తుంది. ఇది అతను తన టీమ్ కి చెప్తాడు. వాళ్ళు ఇదంతా జస్ట్ నీ భ్రమ అని కొట్టి పడేస్తారు. ఇతను మళ్ళీ మళ్ళీ ఎదో అవుతోంది అనేసరికి ఇతన్ని ఒక సైకాలజిస్ట్ కి చూపిస్తారు. అతను కూడా ఏమీ చెప్పలేక మర్నాడు రమ్మంటాడు.

మళ్లీ నిద్రలేచేసరికి అవే సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇతనికి తను ఒక “టైమ్ లూప్” లో చిక్కుకున్నాను అని అర్థం అవుతుంది. ఈసారి కంగారు పడకుండా అక్కడ జరిగేవన్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు.ముందు రోజు సరిగ్గా ఎదైతే గోతిలో పడ్డాడో అక్కడ పక్కకి తప్పుకుని వెళతాడు. న్యూస్ చెప్పేటప్పుడు నిన్నటి కన్నా బాగా చెప్తాడు. తను తాగాలి అనుకుని తాగుతాడు. తను ఏం చేసినా ఇవాళే దాని ఫలితం, మర్నాడు దాని విషయం ఎవరికీ తెలియదు అన్న ధైర్యంతో దొంగతనం చేస్తాడు, ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుని డేటింగ్ కి వెళతాడు.

ఆఖరికి కొండ మీద నుండి దూకి ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. కానీ మర్నాడు తన హొటెల్ రూం లో అదే ఫిబ్రవరి రెండో తారీఖు న నిద్ర లేస్తూ ఉంటాడు.

మెల్లిగా అలా అదే రోజు నిద్రలేవడం తనకు ఒక వరం అని, ఫిబ్రవరి రెండో తారీఖు న చేయాలి అని చెయ్యలేక పోయిన పనులు తనకు చేసే అవకాశం రావడం ఒక వరం అనుకుని మెల్లిగా తను మారడానికి, తన చుట్టూ ఉన్న వాళ్ళకు మంచి చెయ్యడానికి అంటే ఏక్సిడెంట్ లు అవీ అవుతుంటే ముందే హెచ్చరించి కాపాడడం లాంటివి చేస్తూ ఉంటాడు. అలాగే ప్రతీ రోజూ తన జేబులో మిగిలి ఉన్న వెయ్యి డాలర్లు పెట్టీ ఒక పియానో నేర్చుకుంటూ ఉంటాడు.

ఇలా మెల్లిమెల్లిగా ఒక్కో విషయంలోనూ తనను తాను మార్చుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుని హీరోయిన్ ని ఇంప్రెస్స్ చేసి చివరకు ఒక ఫిబ్రవరి రెండవ తేదీన ఆమెని ప్రేమలో పడేస్తాడు. మర్నాడు లేచేసరికి రేడియోలో ఇవాళ ఫిబ్రవరి 3వ తారీఖు అని వస్తుంది.

చివరకు తాను ఆమెతో కలిసి అక్కడే ఉండాలి అని నిర్ణయం తీసుకోవడంతో సినిమా అయిపోతుంది.

కథా ప్రకారం చూస్తే ఇదొక ఫాంటసీ ఫిల్మ్ అయినా కూడా మెయిన్ పాయింట్ అంతా కూడా మనుషుల గురించి మాత్రమే ఉంటుంది. ఈ సినిమాని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పది ఫాంటసీ సినిమాల్లో ఒకటిగా ఎంపిక చేసింది. అంతే కాకుండా ఈ సినిమాని బిబిసి 10 ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కామెడీ ఫిల్మ్స్ లో ఒకటిగా గుర్తించింది.

ఈ సినిమాని నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ లో భద్రపరిచారు.ఈ సినిమాకి మొదట టామ్ హ్యంక్స్ ని తీసుకుందాం అనుకున్నారు. కానీ జస్ట్ “Bill Murray” ని తీసుకున్నారుట. ఈ సినిమా చూసాక అతను ఈ సినిమాకి ఎంత యాప్ట్ అయ్యాడో తెలుస్తుంది.

ఈ సినిమా విడుదల అయ్యాక ఈ కథ జరిగే ప్రాంతం అయిన “Punxsutawney” కి జనాల తాకిడి పెరిగి పెద్ద టూరిస్ట్ స్పాట్ గా మారింది.

అంతే కాకుండా ఈ సినిమాకి వేసిన Tip Top కాఫీ షాప్ సెట్ నిజంగా తర్వాత రెస్టారెంట్ గా మారిపోయింది.ఈ సినిమా కోసం చాలా Groundhog లను పెంచారు. ఒక సీన్ లో హీరో దాన్ని ఎత్తుకుని పారిపోతూ ఉంటాడు. అప్పుడు అది నిజంగానే హీరో చేతిని కొరికి పారేస్తే రాబీస్ ఇంజిక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.

ఈ సినిమాకి పని చేసిన నటీనటులు గానీ దర్శకులు గానీ ఎవరి సినిమాలూ ఇంతకు ముందు చూడలేదు. కానీ సినిమా చూస్తుంటే ఆ హీరో మనమే అనిపిస్తుంది. ఒక కామెడీ సినిమా చూస్తూ అక్కడ మనమే ఉన్నాం అని ఫీల్ అవ్వడం చాలా తక్కువ సార్లు జరగచ్చు.

జస్ట్ ముప్పై మిలియన్స్ తో తీసిన సినిమా దాదాపు 70 మిలియన్స్ వసూలు చేసి 1993 లో మాంఛి హిట్ గా నిలిచింది.సినిమా చూస్తున్నంతసేపు మనం అదేదో ఫాంటసీ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ రాదు. ఒక సగటు మనిషి తన జీవితంలో చేసే తప్పులు, వదిలేసిన అవకాశాలు, చేయాలి అనుకుని ఆర్థిక ఇబ్బందులతో మర్చిపోయిన కలలు ఇవే ఉంటాయి. “మాట్ డామన్” హీరోగా చేసిన “Down sizing” సినిమా కూడా ఒకరకంగా సైన్స్ ఫిక్షన్ సినిమా అయినా కూడా సినిమా మొదలయ్యాక human relations మీదకు పోతుంది. ఆ రివ్యూ కూడా పోస్ట్ చేసా.

ఇంతకీ ఈ సినిమా దర్శకుడు “Harold Ramis”.

Please watch “Rope” movie review here.