Nanpakal Nerathu Mayakkam

స్పాయిలర్ అలెర్ట్.

PS: సినిమా కథ మొత్తం రాసేశా. సినిమా చూసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లు ఇక చదవకండి.

James, అతని భార్యా, కొడుకు కేరళ నుండి చిన్న టూరిస్ట్ బస్ లో వేళాంగని చర్చ్ కి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. దారిలో ఒక హోటల్ దగ్గర ఆగి లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతారు. మధ్యాహ్నం కావడంతో బస్సులో అందరూ నిద్రపోతూ ఉంటారు.

మధ్యలో ఒక చిన్న పల్లెటూరు వస్తుంది.

జేమ్స్ బస్సు ఆమపని డ్రైవర్ కి చెప్తాడు. ఏ టాయిలెట్ కో వెళ్ళాలి అని అనుకుని డ్రైవర్ బస్సు ఆపుతాడు. జేమ్స్ ఆ బస్సు దిగి అలా ఊళ్ళోకి నడుచుకుంటూ వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళి అన్నీ తెలిసిన వాడిలా డ్రెస్ మార్చుకుని, లుంగీ కట్టుకుని అక్కడే ఉన్న ఒక స్కూటర్ వేసుకుని ఊళ్ళోకి షికారుకు వెళ్ళిపోతాడు.

హఠాత్తుగా ఎవరో ఒక అపరిచితుడు లోపలకి వచ్చి డ్రెస్ మార్చుకుని బయటికి వెళ్లిపోవడం చూసిన ఆ ఇంట్లో వాళ్ళకి సడెన్ గా ఏం చేయాలో తోచదు.

కారణం అతని మాట, నడక, చేతలు అన్నీ కూడా ఆ ఇంట్లో నుండి రెండేళ్ల క్రితం వెళ్ళిపోయిన సుందరం అనే ఒకతని లా ఉంటాయ్.

స్కూటర్ వేసుకుని బయటికి వెళ్ళిపోయిన జేమ్స్ ఊళ్ళో అందర్నీ తెలిసినట్టుగానే పలకరిస్తూ, రచ్చబండ దగ్గర కబుర్లు చెప్తూ, పక్కనే ఉన్న హొటల్ కి వెళ్ళి టీ తాగి, తన తాగుబోతు ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళి రాత్రికి మళ్ళీ అదే ఇంటికి వచ్చేస్తాడు.

అయితే బస్సు ఆపమని హఠాత్తుగా దిగి వెళ్ళిపోయాడు కదా. అక్కడ అందరూ అతను వెంటనే తిరిగి రాకపోవడంతో కంగారు పడి ఏం జరిగిందో అని వెతుక్కుంటూ ఊళ్ళోకి రావడంతో జేమ్స్ చేసిన ఘనకార్యం తెలుస్తుంది. వాళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కాదు.

రాత్రి ఇంటికి వచ్చిన జేమ్స్ నీ నువ్వు ఇక్కడి వాడివి కాదు, ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతారు. కానీ అతను నేను ఇక్కడి వాడినే అని అందరితో గొడవ పడి ఊళ్ళో ఉన్న అందర్నీ పేరు పేరునా పలకరించి కొన్ని సంఘటనలు చెప్పేసరికి బిత్తరపోయి ఏం చేయాలో అర్థం కాక ఒక మత్తు టాబ్లెట్ ఇచ్చి అతన్ని మత్తులోకి పంపి బస్సులో అతని సొంత ఊరు అయిన కేరళ కి పంపించేస్తే బెటర్ అని ఫిక్స్ అవుతారు.

ఇక ఏమీ చేయలేక ఆవేళ రాత్రి ఆ టూరిస్ట్ లు అందరూ అక్కడే నిద్రపోవాలని నిర్ణయించుకుని అక్కడే అరుగుల మీదా, సావిట్లో నిద్రపోతారు.

ఆవేళ రాత్రి భోజనం పెట్టేసాక మత్తు టాబ్లెట్ ఇవ్వాలి అని అనుకుంటారు. అయితే ఆ టాబ్లెట్ దేనిలోనూ కలపకుండా డైరక్ట్ గా ఇవ్వాలి అని నర్స్ చెప్పడంతో భోజనం చేశాక జాగ్రతగా మంచి మాటల్లో పెట్టి అతని చేత మింగించాలి అని అనుకుంటారు.

ఆ ఇంట్లో ఉన్న వల్లి అనే అమ్మాయిని భార్య అని, ఆమె కూతుర్ని తన కూతురు అనుకుంటాడు. తన కూతుర్ని సాంబారు వడ్డించమని అడిగి తినేసి అక్కడే నిద్ర పోతాడు. ఇక టాబ్లెట్ ఇవ్వడం కుదరదు.

జేమ్స్ భోజనం చేసి నిద్రపోయి పొద్దున లేచేసరికి తన వంటిమీద ఉన్న బట్టలు, తాను ఉన్న ప్రదేశం చూసుకుని ఏం జరిగిందో అర్థం కాక ఎదురుగా ఉన్న భార్య, కొడుకు దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఆమె ఏమీ చెప్పకుండా బట్టలు మార్చి ఆ ఊళ్ళో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి తమ టూరిస్ట్ బస్సు దగ్గరకి తీసుకుపోవడం, బస్సు కదలడంతో సినిమా ముగుస్తుంది.

ఎందుకు అలా ప్రవర్తించాడు అనే విషయం చాలామంది ఊహించే ఉంటారు. అందుకే చెప్పడం లేదు. కానీ ఈ సినిమా నచ్చడానికి కారణం ఆ సినిమా తీసిన లోకేషన్స్.

ఈ సినిమా ఏ జోనర్ లోకి వస్తుందా అని ఆలోచించడం మానేసి హాయిగా సినిమా చూస్ ఎంజాయ్ చేశా. అంటే కారణం ఆ ఊరు.

ఆ చిన్న ఊరు భలే ఉంటుంది.

ఇల్లు, అరుగులు, అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకునే ఒక రచ్చబండ. పాత సినిమా హాల్, వాటి దగ్గర లైట్స్ తో పెట్టిన కటౌట్లు.

సినిమా కథ ప్రకారం రెండు రాష్ట్రాలలో జరుగుతుంది. కేరళ మనుషులు తమిళనాడు లో చిక్కుకు పోవడం.

అందువల్ల రెండు భాషల్లో మాట్లాడి ఉంటారు.

ఉంటారు అని ఎందుకన్నానంటే తమిళం – మలయాళం, ఉర్దూ – హిందీ వీటి మధ్య తేడాలు కనిపెట్టడం నాకు కొంచెం కష్టం.

ఈ సినిమా నిడివి కేవలం గంటా నలభై నిమిషాలు. కేవలం నెల రోజుల్లో తీసేసారు.

హీరో, దర్శకుడు నిర్మాతలుగా మారి ఈ సినిమా తీశారు. బహుశా ఇదొక ప్రయోగాత్మక చిత్రం అవడం వలన కావచ్చు.

ఇక ఈ సినిమా దర్శకుడు లిజో జోస్ సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

అంగామలై డైరీస్ , జల్లికట్టు, ఈ.మ.యు, చురులి ఇలా దేనికవే డిఫరెంట్ జోనర్.

ఈ సినిమాలో ఒక ఫ్రేమ్ భలే నచ్చింది. అందుకే కింద ఫోటోలో పెట్టా.

పైన కిటికీ లో ఇతను పల్లెటూరిలో నా భార్య, కూతురు అని చెప్పుకునే వాళ్ళు అయితే, అరుగు మీద జేమ్స్ అసలైన భార్య, కొడుకు ఉంటారు.