Sully

Sully..! (సల్లీ)

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ హాస్పిటల్ లో చెప్పే డైలాగ్ గుర్తు ఉందా..?

అంటే కాపాడేటప్పుడు షేక్ భార్యల మొహాలు చూసాను అని పనిలోనుండి తీసేసారు అన్నమాట. అంటే కాపాడడం కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం జరగాలి. లేకపోతే ఉద్యోగాలు పోతాయ్.

ఈ “సల్లీ” సినిమా కూడా ఆ పాయింట్ మీదే నడుస్తుంది.

2009 జనవరి 15 న సలెన్ బర్గర్, అతని కో పైలట్ జెఫ్ స్కిల్స్ ఇద్దరూ US Airways flight 1549 విమానాన్ని టేక్ ఆఫ్ అయిన మూడు నిమిషాల తర్వాత 2800 అడుగుల ఎత్తులో ఉండగా పక్షులు అడ్డం వచ్చి రెండు ఇంజన్లు పని చేయకపోవడం వల్ల న్యూయార్క్ లోని హడ్సన్ నది మీద ఎమర్జెన్సీ లాండింగ్ చేస్తారు.

అలా లాండ్ చేసిన తర్వాత ఆ నదిలో ఉండే బోట్లు వెంటనే ఆ విమానం దగ్గరకు వచ్చి అది మునిగిపోయే లోగా దానిలో ఉన్న 155 మంది ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు చేరుస్తారు.

155 మంది ప్రాణాలు కాపాడినందుకు మీడియా, జనం అతన్ని హీరో గా చూస్తారు. కానీ జాతీయ ప్రయాణికుల భద్రతా మండలి ఆ సంఘటన మీద అతన్ని, అతని కో పైలట్ నీ విచారణకు పిలుస్తుంది. ఈ విచారణకు వెనక ఉన్న కారణం ప్రమాదం కనక పైలట్ తప్పిదం అని చూపిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ప్రమాదానికి జరిగిన నష్టం భర్తీ చేయాల్సిన అవసరం లేదు.

నిజానికి విమానం మళ్ళీ వెనక్కి వచ్చి ఎయిర్ పోర్ట్ రన్వే మీద లాండ్ చెయ్యడానికి కావల్సినంత టైమ్ ఉంది అనీ, అయితే కెప్టెన్ అయిన సల్లీ సరిగ్గా, సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, అతని అసమర్థత వల్లే నదిలో లాండ్ అవాల్సి వచ్చింది అనీ, దానివల్ల 155 మంది ప్రాణాలు పోయేవి అనీ అతని పై అధికారులు అతన్ని విచారణకు పిలుస్తారు.

ఒకవేళ ఈ విచారణలో, అతనిది తప్పు అని తెల్చితే అతని పైలట్ కెరీర్ ముగిసిపోవడమే కాదు, అప్పటిదాకా ఉన్న పేరు కూడా పోతుంది.

ఈ విచారణ జరిగే కార్యక్రమంలో ఉపయోగించే “సిమ్యులేటర్” లు, అంటే సరిగ్గా విమానం ఎగిరేటప్పుడు ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో, మళ్ళీ అలాంటివే ఒక రూం లో కృత్రిమం గా క్రియేట్ చేసి అతనిదే తప్పు అని చూపిస్తారు.

కానీ చివరలో అతను ఒక చిన్న పాయింట్ ద్వారా తన తప్పు లేదని, తను చేసిందే సరైన పని అని నిరూపించుకుని నిర్దోషిగా బయటకు వస్తాడు.

ఈ సినిమా “Chesley Sullenberger” అనే పైలట్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీశారు.

“Cow Boy” అనగానే గుర్తుకొచ్చే సినిమా “The Good, The Bad, and The Ugly” సినిమాలో “The Good” గా నటించిన “క్లైంట్ ఈస్ట్ వుడ్” ఈ సినిమా డైరెక్టర్.

ఈ సినిమా ఆధారం గానే 1971 లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా “మోసగాళ్లకు మోసగాడు” అని తెలుగులో మొట్టమొదటి “Cow boy” సినిమా తీశాడు.

ఈ సినిమా తీసే సమయానికి క్లైంట్ ఈస్ట్ వుడ్ కి 86 యేళ్లు.

ఆ పైలట్ బాడీ లాంగ్వేజ్ కోసం, అలాగే నిజ జీవితంలో సల్లీ ఎలా ఉంటాడో తెలియడం కోసం Tom Hanks ఒరిజినల్ సల్లీ తో కలిసి షూటింగ్ కి కొద్దికాలం ముందు ఒక రోజంతా అతనితో అతని ఇంట్లో ఉండి గమనించాడు.

ఈ సినిమా కోసం స్టూడియో లో ఒక పెద్ద నది సెట్ వేశారు. అలాగే ఒక రెండు పాత A320 విమానాలు కొని వాడారు.

సినిమా సాగదీయకుండా, థ్రిల్ పోకుండా ఉండటం కోసం జస్ట్ 1గంటా 36 నిమిషాలు మాత్రమే ఉంటుంది.

ఫోటోల్లో Chesley Sullenburger and Clint Eastwood