The Prestige

ఈ సినిమాలో Prestige పదం గురించి చెప్పాలి అంటే సినిమా చూస్తేనే బెటర్.

చదువులో పోటీ గురించి “స్పర్థయా వర్థతే విద్యా” అని ఒక చిన్న వాక్యం ఉంది. దాని అర్థం కొంచెం అటూ ఇటూగా “పోటీ ఉన్నప్పుడే చదువు బావుంటుంది” అని. అలాగే సరైన పోటీ ఉన్నప్పుడే ఏ రంగంలో అయినా ఇంకా పైకి రావడం జరుగుతుంది. అదే పోటీ లేకపోతే మోనోపోలీ పెరిగి ఇక నేర్చుకున్నది చాల్లే మనకు ఎదురు లేదులే ఉన్న చోటనే ఆగిపోవడం లేదా వెనక్కి వెళ్లిపోవడం జరుగుతుంది. అయితే ఆ పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. అది అసూయగా మారినప్పుడు ఆ రంగం లో పోటీ లో ఉన్న మొత్తం అందరినీ ముంచితే గానీ వదలదు. అలా అసూయ తో పోటీ పడి చివరకు నాశనం అయిన ఇద్దరు మేజిషియన్ల కథే ఈ సినిమా.

ప్రతీ కళాకారుడూ కోరుకునేది ముందు తన కళకు గుర్తింపు, అభిమానం, పొగడ్త (చాలా మందికి), ఆఖరుగా డబ్బు.

ఈ కథంతా 1890 ప్రాంతం లో జరుగుతుంది. అంటే తెర వెనక జరిగే మ్యాజిక్ సీక్రెట్స్ అన్నీ ఈ AXN లు, యుట్యూబ్ లు డబ్బు కోసం బయట పెట్టని రోజులు. అలాంటి సమయంలో ప్రతీ మేజిషియన్ కి ఈ ట్రిక్స్ అన్నీ సరిగ్గా ప్రదర్శించడానికి ఒక ఇంజనీర్ సహాయకుడు గా ఉండేవాడు. ఒక్కో మ్యాజిక్ ట్రిక్ లో ఎన్నో భౌతిక రసాయన సూత్రాలు ఇమిడి ఉంటాయి. ఇవన్నీ ఆ ట్రిక్ చేసే సమయంలో సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అనేది నిరంతరం ఇతని పర్యవేక్షణలో ఉంటుంది. అలాగే కొత్త కొత్త ట్రిక్కులు కూడా కనిపెట్టడం లో సాయం చేస్తూ ఉండాలి.

ఇలాంటి ఒక ఇంజినీర్ అయిన జాన్ కట్టర్ అనే అతని దగ్గర అల్ఫ్రెడ్ (క్రిష్టియన్ బెల్), రాబర్ట్ (హ్యు జాక్ మాన్) అనే ఇద్దరు సహాయకులు ఉంటారు. ఒకసారి ఒక మేజిషియన్ కి వాటర్ ట్యాంక్ ట్రిక్ కోసం చెప్తారు. అంటే ఒక మనిషిని తాళ్ళతో కట్టేసి నీళ్ళు నింపిన గాజు తొట్టిలో వేసి తాళం వేసేస్తారు. మనం చూస్తూ వుండగానే ఆ మనిషి తాళ్ళు విప్పుకుని బయటకు వస్తాడు. అయితే వీళ్ళు ఆ ట్రిక్ ని కొంచెం సులభతరం చేసి అమ్మాయిలు కూడా చేసేలా చేస్తారు. ఇలా ఒకసారి రాబర్ట్ భార్య జూలియా ఈ ట్రిక్ చేస్తూ ఉండగా చేతులు కట్టడానికి మాములుగా వాడే కట్లు కాకుండా కొంచెం బలంగా ఉండే కట్లు వాడటం తో కట్లు విప్పుకుని బయటకు రాలేక ట్యాంక్ లోనే చనిపోతుంది. దానికి కారణం ఆల్ఫ్రెడ్ అని కట్టర్, రాబర్ట్ నమ్ముతారు.

కొన్నాళ్లకు ఇద్దరూ వేరే వేరే మ్యాజిక్ క్యాంప్స్ పెట్టుకుని ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. కట్టర్, రాబర్ట్ ఒకటిగా పని చేస్తూ ఉండగా, అల్ఫ్రేడ్ విడిగా పని చేసుకుంటూ ఉంటాడు. కానీ తన భార్య చనిపోయింది ఆల్ఫ్రెడ్ వల్లే అన్న కోపం రాబర్ట్ కి తగ్గదు. అందుకని సమయం కోసం కాచుకుని ఉంటాడు. Alfred కొత్తగా బుల్లెట్ క్యాచ్ అనే ట్రిక్ కనిపెడతాడు. అంటే గన్ లో నుండి వచ్చే బుల్లెట్ ని పట్టుకోవడం. ఏ మాత్రం తేడా వచ్చినా బుల్లెట్ తగిలి ప్రాణాలు పోతాయి. ప్రతీ ప్రదర్శనకు ముందు మేజిషియన్ అసిస్టెంట్ ఒకళ్ళు సీక్రెట్ గా జనం లో కలిసిపోయి ప్రదర్శనకు ముందు ఏమీ తెలియనట్లు వచ్చి గన్ పేలుస్తారు. ఒకవేళ వేరే వాళ్ళు కనక పెలిస్తే బుల్లెట్ తగిలి ప్రాణాలు పోతాయ్. కానీ ఒక ప్రదర్శనలో ఆ అసిస్టెంట్ ని దాటేసి రాబర్ట్ వచ్చి గన్ పేలుస్తాడు. దాంతో Alfred ఎడం చేతి రెండు వేళ్ళు పోతాయి.

కొన్నాళ్లకు Alfred ట్రాన్స్పోర్ట్ మాన్ అని ఇంకో కొత్త ట్రిక్ తో ముందుకు వస్తాడు. అంటే ఒక చోట బాక్స్ లో మాయం అయ్యి క్షణం లో ఇంకో చోట నుండి బయటకు రావడం. ఈ ట్రిక్ తో Alfred బాగా పాపులర్ అవుతాడు. రాబర్ట్ ఈ ట్రిక్ కనిపెట్టమని కట్టర్ తో గొడవ పెట్టుకుంటాడు. కట్టర్ ఒక సలహా ఇస్తాడు. తనలాంటి డూప్ ని వెతికి కనిపెట్టి ఒక వైపు ఇతను లోపలకు వెళితే ఇంకోవైపు నుండి డూప్ బయటకు వస్తాడు. సరిగ్గా సరిపోయే డూప్ దొరకడంతో, ఈ ట్రిక్ తో రాబర్ట్ కూడా బాగా పాపులర్ అవుతాడు. కానీ ఒక సమస్య వస్తుంది. స్టేజ్ మీద జనం చప్పట్లు కొట్టే సమయానికి డూప్ ఉంటాడు. అది రాబర్ట్ కి నచ్చదు. ఆ చప్పట్లు అన్నీ తనకు మాత్రమే కావాలి అంటాడు. కానీ కుదరదు ఎందుకంటే ఆ ట్రిక్ చెయ్యడానికి ముందు కొంచెం దాని కోసం ప్రేక్షకులకు చెప్పాల్సి ఉంటుంది. అది డూప్ వల్ల కుదరదు. కానీ ఇలా ప్రతీ సారీ స్టేజ్ కింద నుండి ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడం రాబర్ట్ కి నచ్చదు.

చివరకు ఒక లాస్ట్ షో ఇచ్చి మానెద్దాం అనుకుంటారు. కానీ ఆ షో టైమ్ లో Alfred వచ్చి ట్రిక్ అందరికీ బయటకు చెప్పేస్తాడు. దాంతో రాబర్ట్ పరువు పోతుంది.ఎలాగైనా తన ప్రత్యర్థి మీద పై చెయ్యి సాధించాలి అని నికోలస్ టెస్లా అనే ఒక సైంటిస్ట్ ని కలుస్తాడు. అతను కష్టపడి ఒక మెషిన్ ని కనిపెట్టి రాబర్ట్ కి ఇస్తాడు. దాని ద్వారా డూప్ అవసరం లేకుండా ట్రాన్స్పోర్ట్ మ్యాన్ ట్రిక్ చెయ్యచ్చు. దానిద్వారా వచ్చే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని హెచ్చరించి వెళ్ళిపోతాడు.

రాబర్ట్ దాని ద్వారా చాలా పాపులర్ అవుతాడు. కానీ ఒక ప్రదర్శన చేసే సమయంలో రాబర్ట్ ప్రాణాలు పోతాయి. అవును రాబర్ట్ నిజంగానే చనిపోతాడు. ఆ సమయంలో ఆ ట్రిక్ కనిపెట్టడానికి వచ్చిన Alfred అక్కడ ఉండటం తో అతనే రాబర్ట్ ని హత్య చేశాడు అని ఉరి తీసేస్తారు.

కానీ తర్వాత రాబర్ట్ బ్రతికే ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే చనిపోయింది ఎవరు, ఇద్దరిలో ఎవరు ఎవరి మీద పై చేయి సాధించారు అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. చెప్పిన మరుక్షణం ఇక చూడటానికి ఏమీ ఉండదు. చెప్పినా కూడా అర్థం కాదు.

ఈ సినిమాలో Alfred గా బ్యాట్ మాన్ క్రిష్టియన్ బెల్ చెయ్యగా, రాబర్ట్ గా X Men లో లోగన్ లాగా నటించిన హ్యూ జాక్మన్ చేశాడు.

ఇద్దరికీ అసిస్టెంట్ గా స్కార్లెట్ జాన్సన్ చేసింది. అదే అవెంజర్స్ లో బ్లాక్ విడో గా చేసినావిడ.

అసూయ అనేది పెరిగితే మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో చాలా క్లియర్ గా చూపించాడు. దీనిమీద అయినా obsession ఎక్కువ అయితే అది మనిషిని మాములుగా ఉండనివ్వదు. ఈ సినిమాలో కూడా రాబర్ట్ కి తన జీవితం లో గెలుపు కన్నా ఎలాగైనా తన ప్రత్యర్థి మీద పై చెయ్యి సాధించాలి అని కలిగిన కోరిక చివరకు ఎక్కడకో తీసుకెళ్ళింది.

మ్యాజిక్ ట్రిక్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే పదం “Abrakadabra”. ఈ పదం లో మొదటి నాలుగు అక్షరాలు AB అంటే Alfted Bordan, RA అంటే Robert Angier.

ఈ సినిమా అంతా కూడా ఒక నిమిషం ముందుకు వెళితే, ఇంకో రెండు నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ కి వెళుతూ ఉంటుంది. ఇలా ముందుకి వెనక్కి వెళుతున్నా కూడా ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ ఉండదు.

ఈ సినిమా విడుదల అయిన 2006 లో దీంతో పాటు “The illusionist”, “Scoop”. ఇవి రెండూ కూడా మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలే. ఈ రెండు సినిమాల్లోనూ హ్యూ జాక్మాన్, స్కార్లెట్ జాన్సన్ ఉన్నారు.

బ్యాట్ మాన్ బిగిన్స్ తర్వాత క్రిష్టియన్ బెల్, క్రిస్టోఫర్ నొలాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. వీళ్ళ ఇద్దరి కాంబో లో వచ్చిన సినిమాల్లో అతి తక్కువ బడ్జెట్, అతి తక్కువ కలెక్షన్స్ వచ్చింది కూడా ఈ సినిమాకే.

మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ అన్న వెంటనే సినిమా అంతా మాయలు మంత్రాలు, ట్రిక్స్ మాత్రమే ఉంటాయి అనుకుంటే తప్పు. ఈ సినిమా నిండా వాటికన్నా హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి.ఇలా మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి బాగా నచ్చిన సినిమా మార్క్ రఫెల్లో (హల్క్) హీరోగా 2013 లో వచ్చిన “Now You See Me”. దీని గురించి తర్వాత రాస్తా.