కరోనా ప్రభావం రాకుండా తనను తాను మనుషులకు దూరంగా ఒక ద్వీపంలో ఉన్న వ్యక్తి..!

కాకపోతే క్వారంటెన్ మరీ ఎక్కువగా చెయ్యడం వల్ల రెండో ఫోటోలో లా అయిపోయాడు..!

ఈ స్క్రీన్ షాట్స్ “Tom Hanks” నటించిన “Castaway” అనే సినిమాలోవి..!

హీరో ఒక కొరియర్ కంపెనీ లో పని చేస్తునుంటాడు. అనుకోకుండా కొరియర్ తో వెళుతున్న విమానం కూలిపోవడం తో ఒక ద్వీపం లో చిక్కుకొని పోతాడు..! అక్కడ తనతో పాటు కొన్ని పార్సిల్ బాక్సులు కూడా ఒడ్డుకు కొట్టుకుని వస్తాయి. వాటిలో పనికొచ్చేలా ఉన్నవి అంటే బూట్లు, బట్టలు లాంటివి దగ్గర పెట్టుకుని మిగతావి ఓపెన్ చేసి పడేస్తాడు. వాటిలో ఒక హ్యాండ్ బాల్ దొరుకుతుంది. దానికి విల్సన్ అని పేరు పెట్టుకుని దానితోటి అన్ని మాట్లాడుకుంటూ ఉంటాడు..!

మొదట కొన్ని రోజులు పార్సెల్ లో ఉన్న ఫుడ్ తింటాడు. తరవాత ఇంక సొంతంగా వండుకోవాలి అన్న పరిస్థితి వస్తుంది. ఆ టైమ్ లో రెండు పుల్లలు ఉపయోగించి మంట పుట్టించి ఆక్కడ దొరికే వాటితో వండుకుని తినడం, ఆ పైన దొరికే నీళ్ళు తాగి బ్రతకడం అలవాటు చేసుకుంటాడు. ఆ టైమ్ లో అతని చేతిలో పేడు దిగిపోయే సీన్ చూస్తే మీరు ఏ మాత్రం సున్నిత మనస్కులు అయినా వెంటనే వెళ్లి కట్టు కట్టెద్దాం అని అనుకుంటారు..!

రోజూ దొరికేది తినడం, ఆ విల్సన్ తో (బాల్) మాట్లాడుకోవడం పడుకోవడం ఇదే దినచర్య..! మధ్యలో ఏమైనా అవకాశం దొరికితే తప్పించుకోవడానికి ప్రయత్నించడం..!

ఇలా ఒక “నాలుగు సంవత్సరాలు” గడిచి పోయాయి..!

అనుకోకుండా ఒకసారి మంచి ప్లాస్టిక్ రేకులతో ఉన్న ఒక పెద్ద పెట్టె ఒకటి కొట్టుకు వస్తుంది. దాన్ని, అక్కడ దొరికిన ఊడలు, తాళ్ళతో ఒక పడవలా చేసి సముద్రం లో దిగి ఆ ద్వీపం నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాడు..!

అక్కడనుండి మిగతా కథ…! చెప్తే బాగోదు..! సినిమా మీద ఆసక్తి పోతుంది..!

ఏ పాత్రని పట్టుకున్నా దానికోసం ప్రాణం పెట్టే నటుల్లో ముందుండే “టామ్ హంక్స్” ఈ పాత్ర కోసం దాదాపు 9 నెలలు కేవలం సగం తిండి అది కూడా ఒక పూట తిని నాలుగేళ్లు ద్వీపం లో ఉన్న వ్యక్తి లా బక్కగా తయారయ్యాడు..! సినిమా అంతా కనిపించే ఆ ఎముకలు గూడు శరీరం దాని ప్రభావమే..! ఆ గడ్డం, జుట్టు కూడా మేకప్ కాదు original ఏమో అని నా అనుమానం..!

ఒక మనిషికి కేవలం తిండి మాత్రమే సరిపోదు, మిగతా సామాజిక జీవనం కూడా కావాలి అని అనిపించక మానదు ఈ సినిమా చూస్తే..!

ఇతన్ని చాలా సార్లు తన సినిమాల్లో ఆమిర్ ఖాన్ అనుకరించాడు అని అంటారు. నిజం నాకు తెలియదు. ఈ రూమర్ పుట్టడానికి కారణం ఇద్దరు కొన్ని కోణాల్లో దాదాపు ఒకేలా ఉండటమే..! మన హాస్య నటుడు “చలం” ను ఆంధ్రా దిలీప్ కుమార్ అని పిలిచినట్టు..!

అందుకేనేమో Tam Hanks ఎప్పుడో 1994 లో చేసి దాదాపు అన్ని అవార్డులు పట్టుకుపోయిన “Forrest Gump” సినిమాని ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత “లాల్ సింగ్ చద్దా” అని ఆమిర్ ఖాన్ రీమేక్ చేస్తున్నాడు ..!