12 Angry Men

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఒక మాటన్నాడు గుర్తుందా.?

“ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టా”

ఈ మాట గుర్తు పెట్టుకోండి. తర్వాత మాట్లాడుకుందాం. 

స్పాయిలర్స్ ఉంటాయ్. సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు పూర్తిగా చదవకండి.

సినిమా కథలోకొస్తే 

ఒక మురికి వాడలో ఉండే ఒకబ్బాయిని తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు అనే ఆరోపణ మీద అరెస్ట్ చేసి కోర్ట్ కి తీసుకువస్తారు. సాక్ష్యాలన్నీ ఆ అబ్బాయే హత్య చేసినట్టు చూపిస్తూ ఉంటాయ్.

వాదోపవాదాలన్నీ పూర్తయ్యాక జడ్జ్ ఒక పన్నెండు మందితో ఒక జ్యూరీ వేసి అతనికి శిక్ష వేయాలా వద్దా అని “ఏక వాక్య నిర్ణయం తో” రమ్మంటాడు. 

ఏక వాక్య నిర్ణయం అంటే 

జ్యూరీ కనక “శిక్ష వేయాలి” అంటే జడ్జ్ శిక్ష వేయాలని తీర్పు ఇస్తాడు..

జ్యూరీ కనక “శిక్ష వద్దు” అంటే జడ్జ్ అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తాడు.

అంతే. ఇక మిగతా వాదోపవాదాలు పరిగణలోకి తీసుకోబడవు. అయితే పన్నెండు మంది ఏకాభిప్రాయం తో ఉండాలి. ఏ ఒక్కళ్ళు కాదన్నా అతను నిర్దోషిగా బయటికి వస్తాడు లేదా జడ్జ్ శిక్ష వేస్తాడు. 

అంటే వీళ్ళు ఎటూ తేల్చకపోతే నిర్ణయం జడ్జ్ చేతుల్లో ఉంటుంది.

ఇలాంటి జ్యూరీ ఎందుకు వేస్తారంటే కొన్ని సున్నితమైన కేసుల్లో తమ వైపు నుండి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో మరో సారి సరి చూసుకోవడం కోసం. ఒకసారి ఉరి తీసేసాక ఎన్ని అనుకుని ఏం లాభం. అందుకే ముందు జాగ్రత్తగా ఈ జ్యూరీ అన్నమాట.

ఆ జ్యూరీ లో పన్నెండు మంది సభ్యులు ఉంటారు. అందరూ గొప్ప గొప్ప హోదాల్లో ఉన్నవాళ్ళే. డబ్బు, పలుకుబడి, అధికారం లాంటి విషయాల్లో సమానంగా ఉన్న వాళ్ళే. కాకపొతే ఒకటే తేడా.

వాళ్ళ గతం. అంటే ఒక్కోళ్ళు ఒక్కో బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారు. ఉదాహరణకి ఒక సభ్యుడు తరతరాలుగా ధనవంతులైన కుటుంబం నుండి వస్తే, మరో సభ్యుడు పేదరికం నుండి మొదలు పెట్టి కోటీశ్వరుడు అయ్యాడన్న మాట.

ఒక సభ్యుడు ఉమ్మడి కుటుంబం లో ఉంటే మరో సభ్యుడు కొడుకు కు దూరంగా ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాడు.

ఇలాంటి వివిధ రకాలైన సభ్యులతో ఉన్న జ్యూరీ ని ఒక మీటింగ్ రూమ్ లో పెట్టి అప్పటిదాకా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ వాళ్ళకిచ్చి సాయంత్రం నిర్ణయం చెప్పమంటారు.

ఇంతకీ కేసు ఏంటంటే “ఒక 18 ఏళ్ళ కుర్రాడు తన తండ్రితో సాయంత్రం పోట్లాట పెట్టుకుని, “నిన్ను చంపేస్తా” అని వార్నింగ్ ఇచ్చి అర్థరాత్రి పన్నెండు గంటలకి కత్తితో పొడిచి చంపాడు. ఆ హత్య చూసిన ముగ్గురు మనుషులు ఉన్నారు. 

చూసిన మనుషులు అనేది ఒక మెయిన్ పాయింట్ దీనికోసం ఆఖర్లో రాస్తా. 

మొదటి సాక్షి గా తండ్రి కి వార్నింగ్ ఇచ్చాడు అని ఒక ముసలాయన విన్నా అంటాడు.

రెండో సాక్షి ఒక మహిళ. రైలు పట్టాల అవతల ఆమె ఇల్లు. అటు వైపు నుండి పొడుస్తూ ఉండగా చూసాను అని చెప్తుంది. 

మూడో ఆధారం హత్యాయుధం. దాని మీద ఇతని వేలు ముద్రలు ఉంటాయ్. పైగా అదో ప్రత్యేకమైన కత్తి. అలాంటిది మరొకటి లేదు. హతుడి ఒంటి మీద ఆ కత్తితో చేసిన గాయాలున్నాయి.

ఇంత క్లియర్ గా ఉన్న కేసు కాబట్టి ఆ రూమ్ లో ఉన్న జ్యూరీ లో వాళ్ళు అతనికి శిక్ష వేయాలి అని నిర్ణయిస్తారు. ఒక్క సభ్యుడు తప్ప. అంటే వోటింగ్ 11 – 1. 

కాబట్టి ఏకాభిప్రాయం లేదు. అంటే మళ్ళీ అన్ని సాక్ష్యాలు ఈ జ్యూరీ ఒకసారి పరీశీలించాలి. 

తండ్రికి వార్నింగ్ ఇస్తుండగా విన్నా అని చెప్పిన ముసలాయన ఒక అవిటి మనిషి. ఒక కాలే ఉంటుంది. దాంతో అతను గొడవ జరుగుతూ ఉండగా త్వరగా తన రూమ్ నుండి ఆ గొడవ జరిగే ప్లేస్ కి వచ్చి ఆ వార్నింగ్ వినడం అసాధ్యం అని మరో సభ్యుడు సందేహం లేవనెత్తుతాడు.

దాంతో వోటింగ్ 10 – 2 కి మారుతుంది.

ఆ కుర్రాడు కత్తి తో పొడుస్తూ ఉండగా పట్టాల అవతలి నుండి చూశానని చెప్పిన మహిళ ఆ సమయంలో ఒక రైలు ఆ పట్టాల మీదుగా వెళుతోంది అని కూడా చెప్తుంది. అంటే బోగీ కి బోగీ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో ఆ హత్య చూసానని  చెప్పిందన్నమాట. 

ఆ సాక్ష్యం మీద కూడా మరొకళ్ళు సందేహం వ్యక్తం చేస్తారు.

దాంతో వోటింగ్ 9 – 3 కి మారుతుంది.

మరో సభ్యుడు ఆ కుర్రాడు మురికి వాడల నుండి వచ్చాడు కాబట్టి హత్య చేసి ఉండచ్చు అంటాడు.

కానీ మరో సభ్యుడు దానికి ఆభ్యంతరం చెప్పి తానూ అక్కడ నుండే వచ్చానని, మురికి వాడలో పెరిగినంత మాత్రాన హత్య చేసే మనస్తత్వం రాదనీ కాబట్టి ఆ కారణం చేత ఆ కుర్రాడు హత్య చేసి ఉండచ్చు అంటే ఒప్పుకోనని కాబట్టి ఆ కుర్రాడు హత్య చేసి ఉండక పోవచ్చు అని తన వోట్ మారుస్తాడు. 

దాంతో వోటింగ్ 8 – 4 కి మారుతుంది.

అంటే మెల్లి మెల్లిగా ఒక్కో సభ్యుడు తము ఆల్రెడీ ఫిక్స్ అయిన అభిప్రాయాల ఆధారంగా కాకుండా ఈసారి అసలు ఏం జరిగి ఉంటుంది అనే కోణం లో నుండి ఆలోచంచడం మొదలు పెడతారు.

ఇక మిగిలిన ఆఖరి ఆధారం ఆ ప్రత్యేకమైన కత్తి.

దాని మీద కూడా ఒక సభ్యుడు అనుమానం వ్యక్తం చేస్తాడు. అదేమీ అంత ప్రత్యేకమైనది కాదని, ఒక షాపులో ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతాయనినిరూపిస్తాడు..

దాంతో ఆ ఆధారం కూడా నమ్మదగినది కాదని అనిపిస్తుంది.

మరో రెండు వాదనల తరవాత ఒక్కోళ్ళు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా మాత్రమే ఆ కుర్రాడు ఆ హత్య చేసాడని నమ్మామని అర్థం చేసుకుని తమ నిర్ణయం వెనక్కి తీసుకుంటారు.

చివరికి అందరూ కూడా ఆ కుర్రాడు “శిక్షార్హుడు కాదు” అని ఏకాభిప్రాయానికి రావడంతో సినిమా ముగుస్తుంది. 

పోస్ట్ మొదట్లో ఒక మాట గుర్తు పెట్టుకోమన్నా కదా “ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టా” 

ఒక ప్రశ్న వేయాలి అంటే ఎంతో ధైర్యం కావాలి. ఎంతో ఆలోచించాలి. ఎందుకంటే 

  1. ఈ చిన్న విషయం కూడా తెలియదా అని అవతలి వ్యక్తి అనుకోవచ్చు.
  2. ఇలా సంభంధం లేని విషయం అడుగుతున్నాడు అనుకోవచ్చు.
  3. నన్నే ప్రశ్నిస్తాడా అని మనసులో పెట్టుకుని ఏదైనా చేయచ్చు.
  4.  అసలు ఈ అడిగే వాడికి సమాధానం తెలుసా అనుకునే సందర్భం రావచ్చు.
  5. అసలు ఇదో ప్రశ్నా, దానికో జవాబు అని అందరూ అనుకోవచ్చు.

అయినా కూడా పదకొండు మంది “ఒప్పు” అన్నదాన్ని ఒక్క సభ్యుడు “అది నిజంగా ఒప్పేనా” అని ప్రశ్నించడం తో ఒక జీవితం నిలబడింది.

ఇక మిగతా విషయాలకి వస్తే ఈ సినిమా దర్శకుడు “Sidney Lumet” కి ఇది మొదటి సినిమా. అయినా కూడా అద్భుతంగా తీసాడు. 

ఈ సినిమా “రియల్ టైం” లో జరుగుతుంది. అంటే వాళ్ళ చర్చ నిజ జీవితంలో ఎంత సేపు జరుగుతుందో సినిమా  టైం కూడా అంతే ఉంటుంది. పైగా సినిమాలో 99 శాతం సింగిల్ లొకేషన్ లో అది కూడా ఒక చిన్న గదిలో జరుగుతుంది.

ఈ సినిమాలో సభ్యులు ఎవరికీ పేర్లు ఉండవు. ఆఖర్లో మాత్రం రెండు పాత్రలు పరస్పరం పరిచయం చేసుకుని పేర్లు చెప్పుకుంటాయి.

మిగతా మాస్టర్ పీస్, కల్ట్ క్లాసిక్ సినిమాల్లాగే ఈ సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఫ్లాప్ అయింది.

error: Content is protected !!