citizen-kane

ముందుగా స్పాయిలర్ అలెర్ట్. ఈ సినిమా కథ, దాన్లో ఉన్న మలుపులు అన్నీ రాసేయబోతున్నా కాబట్టి సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఈ పోస్ట్ కి దూరంగా ఉండండి.

చాలామంది చెప్పే మాట ఏంటంటే ఎవరైనా చనిపోయే ముందు వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ కళ్ళ ముందు ఒకసారి గిర్రున తిరుగుతుంది అని. అలాంటి ఒక మీడియా అధినేత కథే ఈ సినిమా.

సిటిజెన్ కేన్ అంటే – అతను ఒక (సిటిజెన్) నగర పౌరుడు, అతని పేరు కేన్. 

ఈ సినిమా పేరుకి అర్థం అంతే.

కేన్ ఒక వ్యాపార వేత్త, మీడియా అధినేత, బిలియనీర్. మరి ఇన్ని వ్యాపారాలు ఉన్నప్పుడు, వాటిని కాపాడుకోవడానికి రాజకీయాల్లో లేకపోతే ఎలా.? 

కాబట్టి రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. అంటే అతను అడుగు పెట్టని రంగం లేదు. 

అడుగు పెట్టిన అన్ని చోట్లా పోటీ దారులతో తలబడ్డాడు, సక్సెస్ సాధించాడు. నంబర్ వన్ గా నిలబడ్డాడు. 

ఎలాంటి గొప్ప వాడైనా సరే చనిపోక తప్పదు కాబట్టి ఒక రోజు రాత్రి చనిపోయాడు. అయితే చనిపోయే ముందు ఆఖరిగా ఒక స్నో బాల్ పట్టుకుని చనిపోతాడు. అతని నోట్లో నుండి వచ్చిన ఆఖరి పదాలు “రోజ్ బడ్”.

గొప్ప వాళ్ళు ఏం చేసినా, ఏం అన్నా కూడా గొప్పగా ఉంటుంది కాబట్టి అతని నోట్లో నుండి వచ్చిన ఆ ఆఖరి పదాలు ఎవరి కోసమా అని ప్రపంచం అంతా వెతుకుతూ ఉంటుంది.

రోజ్ బడ్ అని ఎందుకు అన్నాడో, ఎవరి కోసం అన్నాడో ఎవరికి నచ్చిన ఊహా గానాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.

ఒకళ్ళు “అతని ప్రస్తుత లవర్ అన్నారు, ఒకళ్ళు అతని చిన్నప్పుడు లవ్ చేసిన అమ్మాయి అన్నారు, మరొకళ్ళు అతని సీక్రెట్ కూతురు అన్నారు, ఇంకోళ్ళు ఇంకేదో అన్నారు”. కానీ ఆ పదాలకి అర్థం ఇదని కచ్చితంగా చెప్పలేక పోయారు. 

దాంతో ఒక న్యూస్ పేపర్ అసలా విషయం ఏంటో కనుక్కోమని ఒక ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ ని పురమాయిస్తుంది. అతని పేరు జెర్రీ థాంప్సన్.

మహానటి సినిమాలో సమంత పాత్ర గుర్తుందా, సావిత్రి రాసిన ఒక ఉత్తరం ఎవరికి రాసిందో కనుక్కోవడం కోసం సావిత్రి బంధువులని, స్నేహితులని అందర్నీ కలిసి ఇన్వెస్టిగేషన్ చెస్తూ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఈ సిటిజెన్ కేన్ సినిమా నుండే లేపారు. 

అదే విధంగా ఈ జెర్రీ థాంప్సన్ కేన్ తో సంబంధం ఉన్న అందర్నీ కలుస్తూ ఉంటాడు.

ఏ మగాడి లైఫ్ లో సీక్రెట్స్ అయినా కచ్చితంగా తెలిసేది వాడి పెళ్ళానికే అనే భ్రమలో ముందుగా అతని రెండో భార్య సుసాన్ ని కలుస్తాడు. ఆ రెండో భార్య ఒక పచ్చి తాగుబోతు. థాంప్సన్ వెళ్ళి అడిగిన వెంటనే “తను ఎవరి కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు” అని పొమ్మంటుంది. 

దాంతో ఇతను ఒక ప్రైవేట్ బ్యాంకర్ అయిన “థాచర్” ఇంటికి వెళతాడు. ఆ థాచర్ చాలా ఏళ్ళ క్రితమే చనిపోయి ఉంటాడు. కానీ అతనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ నుండి కేన్ కోసం కొన్ని విషయాలు తెలుస్తాయి.

కేన్ చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక మారు మూల విలేజ్ లో హాయిగా చడువుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. అతని తండ్రి సరిగ్గా ఉండడు. తల్లి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. తల్లికి తండ్రికి రొజూ గొడవలే.

ఇతని చిన్నతనం ఇలా ఉండగా కేన్ కి ఎనిమిదేళ్ళ వయసులో అతని తల్లికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిసోస్తుంది. దాంతో కేన్ ని బాగా పెంచాలి, చదివించాలి అని నిర్ణయించుకుంటుంది. అయితే కలిసొచ్చిన కోట్ల ఆస్తి వదిలేసి ఆ పల్లెటూరు నుండి బయటికి రాలేదు. దాంతో తన కొడుకుని నగరానికి తీసుకువెళ్ళి బాగా చదివించమని ఈ ప్రైవేట్ బ్యాంకర్ అయిన థాచర్ కి అప్పగిస్తుంది. 

కానీ కేన్ తన తల్లి దండ్రులని వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు. గింజుకుంటాడు. చేతిలో ఉన్న చెక్క ముక్కతో ఆ థాచర్ మొహం పగలకొట్టి పారిపోతాడు. కానీ పట్టుకుని బలవంతంగా పంపిస్తారు.

కొన్నేళ్ళు గడుస్తాయి. అతనికి పాతికేళ్ళు వచ్చేసరికి అతని తల్లి నుండి సంక్రమించిన బంగారు గనుల ద్వారా, స్వతహాగా అబ్బిన తెలివి తేటల ద్వారా కొన్ని వేల కోట్లకి అధిపతి అయిపోతాడు. ఎంతలా అంటే తన మీద నెగటివ్ గా న్యూస్ రాస్తున్న ఒక న్యూస్ పేపర్ని కొని పడేస్తాడు.

ఆ న్యూస్ పేపర్ తో తనకి నచ్చని వాళ్ళ మీద బురద జల్లడం మొదలు పెడతాడు. తన మీదకి ఎవరైనా వస్తే పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని ఎదురు దాడి చేస్తాడు. అందుకోసం అద్భుతమైన, మంచి పేరున్న జర్నలిస్ట్ లని తన పేపర్లో పెట్టుకుంటాడు. పబ్లిక్ ఒపినియన్ ని తనకి నచ్చినట్టు మార్చడం మొదలు పెడతాడు. దాంతో అవతలి పార్టీ రాజకీయ నాయకులు భయపడటం మొదలు పెడతారు.

అలా ఎదుగుతూ ఎదుగుతూ తనకున్న పరిచయాల ద్వారా, డబ్బు ద్వారా ప్రెసిడెంట్ మేన కోడల్ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఒకమ్మయితో అఫైర్ పెట్టుకుంటాడు. అనుకోకుండా ఆ విషయం బయట పడటంతో  ఇతని మొదటి భార్య వదిలేసి పోతుంది, రాజకీయంగా కూడా చాలా నష్టం జరుగుతుంది.

రెండో భార్యని ఎలాగైనా మంచి సింగర్ గా జనానికి చూపించాలి అని ఆమెని బలవంతంగా సింగర్ ని చేస్తాడు. ఎందుకంటే ఎవరో ముక్కూ మొహం తెలియని అనామకురాలి కోసం భార్యని వదిలేసాడు అనే కన్నా కూడా ఒక సింగర్ కోసం మొదటి భార్య ని వదిలేసాడు అని జనానికి చూపించడం కోసం. 

ఆమె ప్రోగ్రామ్స్ కోసం ఒక పెద్ద ఒపేరా హౌస్ కడతాడు. కానీ జనానికి ఆమె పాటలు నచ్చవు. దాంతో మిగతా పత్రికల్లో నెగటివ్ రివ్యూలు వస్తూ ఉంటాయ్. చివరకి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో పాటలు పాడటం మానేయడానికి ఒప్పుకుంటాడు. కానీ అసంతృప్తిగా ఆమెతో బ్రతుకుతూ ఉంటాడు. 

అలా కొన్నేళ్ళు పోయాక ఒక రోజు రాత్రి ఇద్దరూ గొడవ పడటం తో ఆమె కూడా ఇల్లు వదిలేసి పోతుంది. దాంతో చేతికి అందిన వస్తువులు విసిరి పడేస్తూ చేతికి అందిన స్నో బాల్ చూసి ఎమోషన్ అయ్యి కుప్పకూలి పడిపోతూ “రోజ్ బడ్” అని చనిపోతాడు.

ఇదే కథ. 

ఇలా అందర్నీ కలిసి విషయాలు సేకరించిన థాంప్సన్ కి అసలు ఆ రోజ్ బడ్ అంటే ఏంటో అర్థం కాదు. చివరికి ఆ విషయం తన బాస్ కి చెప్పి రోజ్ బడ్ కోసం ఇక కనుక్కోవడం అసాధ్యం. ఆ రహస్యం కేన్ తోటే అంతమయిపోయింది అని చెప్తాడు.

దాంతో అందరూ ఆ విషయం వదిలేస్తారు.

ఆస్తుల పంపకాలన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పనివాళ్ళు మిగిలిన పాత సామాన్లు, పాడై పోయన సామాన్లు అన్నీ మంటల్లో వేసి కాల్చి పడేస్తూ ఉండగా ఒక చెక్క ముక్క మీద “రోజ్ బడ్” అనే పదాలు ప్రేక్షకులకి కనిపిస్తూ ఉంటాయ్. దాంతో సినిమా ముగుస్తుంది.

అయితే ఆ చెక్క ముక్కకి, స్నో బాల్ కి, ఇతని చావుకి మధ్య సంబంధం ఏంటంటే ఇతని తల్లికి ఆస్తి వచ్చినప్పుడు ఇతన్ని ఒక థాచర్ అనే బ్యాంకర్ తో బలవంతంగా నగరానికి పంపింది అని చెప్పుకున్నాం కదా. 

అలా బలవంతంగా పంపే టైం లో ఇతను “తమ ఇంటి దగ్గరున్న మంచు లో ఆ చెక్క ముక్కతో ఆడుకుంటూ ఉంటాడు. దాంతోనే థాచర్ ని కొట్టి పారిపోతాడు. అతన్నుండి ఆ చెక్క ముక్క లాగి అవతల పడేసి ఆ మంచు ప్రాంతం నుండి బలవంతంగా నగరానికి పంపేస్తారు.

అంటే ఇతని అమాయకమైన బాల్యం అక్కడితో అంతమైపోయింది. కొన్నేళ్ళ తర్వాత భార్యతో గొడవపడి కోపంతో ఒక్కో వస్తువు విసిరేస్తూ ఉన్నప్పుడు ఆ స్నో బాల్ చేతికి రావడంతో ఇతనికి ఆ బాల్య జ్ఞాపకాలు, ఆ మంచు లో ఆడుకున్న ఆటలు, ఆ చెక్క ముక్క అన్నీగుర్తొచ్చి ఎమోషనల్ అయ్యి చనిపోతాడు.

ఆ రోజ్ బడ్ అంటే అతను చిన్నప్పుడు ఆడుకున్న ఆ చెక్క ముక్క అన్నమాట. చెక్క ముక్క అంటే చెక్క ముక్క కాదు. అది మంచులో ఆడుకునే స్లెడ్ బండి.

రోజ్ బడ్ అనేది ఆ స్లెడ్ బండి బ్రాండ్

కథ కోసం పక్కన పెడితే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో నడిచినా కూడా ఎక్కడా తడబాటు లేకుండా సాఫేగా సాగిపోతుంది. ఇలాంటి నాన్ లీనియర్, తప్పి పోయిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళే ఫార్మాట్ లో మహానటి, సీతారామం లాంటి సినిమాలు వచ్చేయడంతో మనకి పాతగా ఉండచ్చు కానీ 1941 అంటే దాదాపు 83 ఏళ్ళ క్రితం ఇలాంటి ఫార్మాట్ లో ఒక సినిమా వచ్చింది అంటే గ్రేట్ కదా.

పైగా ఈ సినిమా తీసే సమయానికి డైరెక్టర్ “Orson Welles” వయసు కేవలం పాతికేళ్ళు మాత్రమే.

పాతికేళ్ళ వయసులో ఇలాంటి సినిమాకి “దర్సకత్వం” వహించడం మాత్రమే కాకుండా “స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, పైగా హీరో గా (లీడ్ యాక్టర్ గా)” బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడు.

ఒక సీన్ లో మెట్ల మీద నుండి జారిపడి కాళ్ళు విరగ్గొట్టుకుని చక్రాల కుర్చీలో కూర్చుని డైరెక్ట్ చేసాడు. 

అంత కష్ట పడినా కూడా సామాన్య జనాలు ఎప్పటి లాగే అలవాటు ప్రకారం ఈ సినిమాని థియేటర్స్ లో ఫ్లాప్ చేసి తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ ఇచ్చి ప్రపంచ సినిమాల్లో టాప్ 10 లో పెట్టారు. కొన్ని వందల సినిమాలు ఈ సినిమా ఫార్మాట్ ని ఫాలో అయ్యాయి మొన్నోచ్చిన “దేవర” సినిమాతో సహా.

మాములుగా సస్పెన్సు సినిమా అంటే ఒక మర్డర్ మిస్టరీ అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక ఎమోషనల్ డ్రామా సినిమాని ఒక సస్పెన్స్ సినిమాగా తియ్యడం దీనితోనే మొదలు అనుకుంటా.

ఈ సినిమా కోసం ఎన్ని పేజీలు  అయినా రాయచ్చు. కానీ ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం.

చూడాలి అనుకునే వాళ్ళు ప్రస్తుతం అమెజాన్ ప్రైం లో చూడచ్చు.

ఈ సినిమాలో ఒక చోట కేన్ పాత్ర “Don’t believe everything you hear on the radio” అని అంటుంది. దాన్నే మనం ప్రస్తుతం TV, YouTube అని మార్చుకోవచ్చేమో.

error: Content is protected !!