The-Truman-show

ప్రతీ మనిషికీ సహజంగా తన గురించి పక్కోళ్లు ఏమనుకుంటున్నారు అనే ఎంతో కొంత కుతూహలం ఉంటుంది. దాని ఆధారంగా మన్మథుడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఒక సీక్రెట్ మైక్ కనిపెడతారు..!

అలాగే ప్రతి మనిషికి తన పక్క వారి జీవితాల్లో తొంగి చూడాలని ఎంతో కొంత కాదు చాలానే కుతూహలం ఉంటుంది..! ఆ కుతూహలాన్ని ఆధారం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఒక టీవీ షో చాలా బీభత్సంగా హిట్టయింది అదే “బిగ్బాస్” రియాలిటీ షో..!

అయితే ఈ షో కన్నా ముందే ఈ కాన్సెప్ట్ ని ఆధారం చేసుకుని ఒక సినిమా వచ్చింది అదే “The Truman Show”..!

తల్లి కడుపులో ఉండగానే ఒక ప్రాణి యొక్క కదలికల నుండి, అతను పుట్టి పెరిగే క్రమం మొత్తం 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటే..!

తను చేసే ప్రతీ పనీ, తను పలికే ప్రతీ మాట కొన్ని లక్షల మంది గమనిస్తూ, అనుసరిస్తూ, కోట్ల డాలర్లకి అమ్మేస్తూ ఉంటే..! ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందో అదే “ట్రూమాన్” లైఫ్..!

ఈ సినిమాలో హీరోని కడుపులో ఉన్నప్పటి నుండీ “కొన్ని వేల కిలమీటర్లకు విస్తరించిన ఒక దీవి” లో పెంచుతూ ఉంటారు. ఆ దీవిలో ఇతనితో పాటు ఇంకా కొన్ని వందల మంది మనుషులు ఉంటారు. కానీ వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. ఆ షో డైరెక్టర్ అనుమతి లేకుండా కనీసం హీరో కేసి చూడటం కూడా చూడకూడదు. అతని ప్రతీ కదలికను దాదాపు కొన్ని వేల కెమెరాలు అమర్చి షూట్ చేస్తూ ఉంటారు.
(5000 కెమెరా లు అని సినిమాలో జరిగే ఇంటర్వ్యూ సీన్ లో చెప్తాడు).

ఆ దీవిలో హీరో ఒక్కడే నిజం. మిగతా పాత్రలు అన్నీ స్క్రిప్టు ప్రకారం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మాట్లాడి వెళ్లిపోతాయి..! అంటే పొద్దున్నే పనిమనిషి, తర్వాత ఇతను పని చేసే డమ్మీ బాంక్ లో ఉద్యోగులు, సాయత్రం కలిసి మందు కొట్టే ఫ్రెండ్, వారానికి ఒకసారి కలిసి మళ్లీ ఉద్యోగానికి వెళ్లిపోయే గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి పాత్రలు అన్నమాట..!

అతని తల్లి, తండ్రి, స్నేహితులు, లవర్, టీచర్లు, ఉద్యోగులు, వార్తా పత్రికలూ, ఆఖరికి “సూర్యుడు, చంద్రుడు, సముద్రం, ఆకాశం, భూమి, చెట్లు, గడ్డి, ఎండా, వానా, చలి” ఇలా ప్రకృతి కూడా ఆ షో లో అందరూ డమ్మీ యే.!

ఆ దీవిలో ఒక 20 అంతస్తుల హోటల్ ఉంటుంది. కానీ హీరో హోటల్ కి వెళితే కేవలం గ్రౌండ్ ఫ్లోర్ కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది..! ఎందుకు అని హీరో అడిగితే ఏదో కారణం చెప్తూ ఉంటారు ఎందుకంటే మిగతా ఫ్లోర్ లు అన్ని సెట్ వేస్తారు కాబట్టి..!

అలాగే అక్కడ ఒక నది ఉంటుంది. కానీ ఆ నది మీద ఉన్న వంతెన ఎప్పుడూ రిపేర్ లోనే ఉంటూ ఉంటుంది..! ఎందుకంటే ఆ వంతెన అవతల నిజమైన ప్రపంచం ఉంటుంది..!

మధ్య మధ్యలో కొన్ని పాత్రలు వచ్చి “హేయ్ ట్రూమాన్ నువ్వు వాడే టూత్ పేస్టు ఎంటి కొల్గెట్ యేనా, ఆ టేబుల్ ఎక్కడ కోన్నావ్ ఐకియా లోనేనా, ఇవాళ “అహా యాప్” లో కొత్త సినిమా విడుదల అవుతోంది చూడాలి..! డీ మార్ట్ లో ఉగాదికి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు నువ్వుకూడా వస్తావా..?, ఇప్పుడే ఓలా యాప్ లో ఫ్రీ రైడ్ బుక్ చేస్తా బయటికి వెళదాం, ఈ పిజ్జా తిను సుబ్బయ్య హోటల్ నుండి తెచ్చా” ఇలా హీరో తో మాట్లాడి వెళ్లిపోతూ ఉంటాయి..!

అప్పుడప్పుడూ ఫేస్ బుక్ లో థాంక్స్ టు ఫలానా దిజైనర్స్ అని చెప్తూ ఉంటారు కదా కొన్ని పోస్ట్ ల్లో అలాగ..!

అంటే పరోక్షంగా గా కొన్ని ప్రొడక్ట్స్ గురించి ప్రకటనలు ఇస్తూ ఉంటారు..! ఇలా ఇతని పేరు మీద బయట కొన్ని మిలియన్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది..!

కానీ ఒకరోజు అనుకోకండా హీరో కి అనుమానం వస్తుంది. తను తప్ప మిగతా వారంతా తేడాగా బిహేవ్ చేస్తున్నారు అని..! కనబడిన మనుషులే మళ్లీ మళ్ళీ అలాగే చేతిలో అవే వస్తువులతో కనబడడం, తను వెళ్ళే రోడ్డు తప్ప మిగతా రోడ్లు అన్ని ఖాళీగా ఉండటం, ఒకసారి కేవలం హీరో మీదే వాన పడటం ఇవన్నీ చూసి హీరో కి అనుమానం వస్తుంది..!

ఇక అక్కడినుండి అతను చేసే ప్రయత్నాలు, చివరకు ఎలా బయటకు వచ్చాడు, వచ్చి ఎలా బ్రతికాడు అన్నది మిగతా సినిమా..!

ఈ సినిమా చూసాక కొంత మందికి తాము కూడా అలాంటి “సెట్” లో బ్రతుకుతున్నామేమో అని ఒక సైకలాజికల్ డిసార్డర్ వచ్చిందిట..!

ఒరిజినల్ గా హీరో క్యారక్టర్ ని ఒక టీనేజర్ గా చూపించి సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ “Jim Carrey” హీరోగా చేస్తా అని ఒప్పుకోవడంతో హీరో వయసుని 30 యేళ్లు చేసి దానికి తగినట్లు కథ మార్చుకున్నారు..!

మనం ఎక్కడ అయితే బ్రతుకుతున్నా మో అదే నిజం అని ఈ షో డైరెక్టర్ అంటాడు..! కానీ బావిలో కప్పలా కాకుండా మనకు తెలిసిందే ప్రపంచం కాదు ఇంకా ఉంది అని ట్రూ మాన్ నమ్ముతాడు..!

ఈ సినిమా లో “రియాలిటీ షో” ముప్పై ఏళ్ళు సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. అంటే 1966 నుండి 1996 దాకా. ఈ సినిమా వచ్చి దాదాపు 23 యేళ్లు (1998) అవుతోంది. ఇప్పటికీ కూడా ఇలాంటి బిగ్ బాస్ “రియాలిటీ షో” ఇంకా చాలా విజయవంతంగా నడుస్తున్నాయి అంటే పక్కోళ్ళ జీవితాల మీద మనుషులకు ఇంకా కుతూహలం పోలేదు అని అర్థం..!

ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ కోసం నామినేట్ అయినప్పటికీ అవార్డ్ కూడా రాలేదు. ఆ ఏడాది అవార్డ్ స్టీవెన్ స్పీల్ బర్గ్ పట్టుకుపోయాడు..!