Stalker

మాయాబజార్ మొదట్లో ఒక సన్నివేశం ఉంటుంది.కృష్ణుడి ఫ్యామిలీ అంతా “ప్రియదర్శిని” అనే ఒక పెట్టెలో చూసినప్పుడు వాళ్ళకి దేనిమీద అత్యంత ఇష్టముందో అది మాత్రమే కనిపిస్తుంది కదా. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి.

ఈ సినిమా అంతా కూడా ఎక్కడ జరిగిందో, ఏ కాలంలో జరిగిందో సినిమాలో ప్రత్యేకంగా మెన్షన్ చెయ్యరు. ఈ సినిమాలో హీరో స్టాకర్ గా పని చేస్తూ ఉంటాడు. అతనికి భార్యా, కూతురు ఉంటారు.స్టాకర్ అంటే ఏమీ లేదు. డబ్బులు తీసుకుని ఎంట్రీ నిషేదింప బడిన ప్రదేశాలకు దొంగతనం గా జనాన్ని తీసుకు వెళుతూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా హీరో “జోన్” అనే నిషేధిత ప్రాంతానికి జనాన్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ ప్రదేశంలో ఒక “గది” ఉంటుంది. ఆ గదిలో నిలబడి ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది అని కొంతమంది నమ్మకం.

అయితే ఆ ప్రదేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు ఒక్క హీరో లా అక్కడకి తీసుకు వెళ్ళే వాళ్ళకి తప్ప. కొన్ని కారణాల వల్ల అక్కడకి వెళ్ళే దారిని ప్రభుత్వం మూసేసింది. అందువల్ల ఎవరూ వెళ్ళ కూడదు.స్టాకర్ భార్య అతన్ని ఆ పని మానేయమని వేరే ఏదైనా చూసుకో మని తిడుతూ ఉంటుంది. కానీ అతనికి వేరే పని చేయడం ఇష్టం ఉండదు.ఒకరోజు ఆ జోన్ లాంటి ప్రదేశానికి తీసుకువెళ్లడానికి ఒక రచయిత, ఒక ప్రొఫెసర్ ఈ స్టాకర్ కి డబ్బులిస్తారు. స్టాకర్ అక్కడకి తీసుకు వెళ్ళాడానికి ఒప్పుకుంటాడు.

ఆ జోన్ కి వెళ్ళాలి అంటే ముందుగా అక్కడ కాపలా ఉన్న మిలటరీ ని దాటాలి, తర్వాత ఎవరూ పట్టించుకొని ఒక ట్రైన్ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ మీద ఒక చిన్న ట్రాలీ లాంటిది ఉంటుంది. అది ఎక్కి అక్కడ నుండి జోన్ దగ్గరకి వెళ్ళాలి.

వెళ్ళే ముందు స్టాకర్ ఈ ప్రొఫెసర్ కీ, ఆ రచయితకీ ఒక ముఖ్య విషయం చెప్తాడు. అది తాను చెప్పినట్టు చేసి, తాను తీసుకు వెళ్లిన దారిలోనే తన కూడా రావడం.

ఆ రచయిత మాత్రం స్టాకర్ చెప్పినట్టు వినడానికి ఇష్ట పడడు. కానీ ప్రొఫెసర్ మాత్రం స్టాకర్ ఏం చెప్పినా చేస్తూ ఉంటాడు.

ఆ జోన్ కి వెళ్ళే దారి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఆ దారి తిన్నగా ఉండదు. అటూ ఇటూ చూసుకుంటూ తిరిగి వెళ్ళాలి. ఇతను ఆ దారి సరిగ్గా ఉందో లేదో చూడటం కోసం ఒక తెల్ల రుమాలు గుడ్డలో రాయిని కట్టి దూరంగా విసురుతాడు. ఆ రాయి కింద పడి మునిగి పోకుండా కనబడితే ఆ దారి గట్టిగా నడవడానికి అనుకూలంగా ఉన్నట్టు, ఆ దార్లో అక్కడ దాకా వెళ్లచ్చు. లేదా వేరే దారి చూసుకోవాలి.

వెళ్ళే దారిలో ఇతని కన్నా ముందు స్టాకర్ గా పని చేసిన వ్యక్తి గురించి చెప్తాడు. అతని పేరు “ప్రోక్యుపైన్”. ఈ ప్రోక్యుపైన్, అతని తమ్ముడు కలిసి ఒకసారి జోన్ కి వెళతారు. వెళ్ళే దారిలో అతని తమ్ముడు చనిపోతాడు. కానీ ప్రోక్యుపైన్ మాత్రం పెద్ద మొత్తం తో జోన్ నుండి బయటికి వస్తాడు. కానీ బయటికి వచ్చిన వెంటనే ఆత్మహత్య చేసుకుంటాడు.

అలా వెళ్ళే దారిలో ముగ్గురూ ఆ జోన్ చూడటానికి గల కారణాలు మాట్లాడుకుంటూ ఉంటారు. స్టాకర్ కి జోన్ చూపించడం అనేది వృత్తి కాబట్టి వచ్చాననీ అంతే తప్ప తనకు ప్రత్యేకమైన కోరికలు ఏమీ లేవనీ అంటాడు.

రచయితకి తాను రాయాలనే ఆసక్తి చచ్చి పోయిందనీ, జోన్ చూడటం వల్ల ఏమైనా కొత్తగా మళ్ళీ రాయాలని ఆలోచనలు వస్తాయని జోన్ కి వచ్చినట్టు చెప్తాడు.

ఆ జోన్ మీద పరిశోధనలు చేసి, అనాలిసిస్ చేసి దాని వెనక రహస్యం ఏముందో చెప్తే నోబుల్ బహుమతి వస్తుంది అనే ఆలోచనతో ప్రొఫెసర్ ఉన్నట్టు చెప్తాడు. ఆ ప్రొఫెసర్ మొదటి నుండీ ఒక వెనకాల తగిలించుకునే బ్యాగ్ ఒకటి కూడా తెచ్చుకుంటూ ఉంటాడు. దాన్లో ఏముందో ఎవరడిగినా చెప్పడు.

మొత్తానికి కష్టపడి ముగ్గురూ జోన్ లో ఉన్న రూం దగ్గరికి వస్తారు.

అసలు ఆ రూం లో ఏముంది.?

ఆ ప్రొఫెసర్ బ్యాగ్ లో ఏముంది.?

అంతకు ముందు స్టాకర్ గా పని చేసిన అతను ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నాడు.?

ఆ జోన్ అడిగినవన్నీ ఇచ్చేటప్పుడు ఇతను ఇంకా కష్టపడుతూ స్టాకర్ గా ఎందుకు పని చేస్తున్నాడు.?

అక్కడ దాకా వెళ్లిన ముగ్గురూ మళ్ళీ వెనక్కి ఎలా వచ్చారు.?

ఇవన్నీ సినిమాలో చూడండి.

ఈ సినిమా డైరెక్టర్ “ఆండ్రి టర్కోవ్ స్కీ”. రష్యన్ పేరు కాబట్టి కొంచెం పలకడం కష్టమే. ఈయన సినిమాలన్నీ ఒక రకంగా నార్మల్ గా చూసే కమర్షియల్ సినిమాల కన్నా డిఫరెంట్ గా ఉంటాయ్. మన వైపు వంశీ పాటల్లా ఎక్కడికో తీసుకు పోతాయ్.

ఈయన సినిమాల్లో ఎక్కువ లాంగ్ షాట్స్ పెడతాడు. కారణం ఒకటే మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అని. ఈ సినిమాలో కూడా చాలా లాంగ్ షాట్స్ ఉంటాయ్. ఒక ఒక షాట్ మాత్రం దాదాపు ఏడు నిమిషాలు ఉంటుంది. (1hr 54m – 2h 02m) ఆ టైమ్ లో కెమెరా అలాగే ఫిక్స్ చేసి ఉంచేస్తారు. సినిమా రెండు గంటలు ఉంటే 143 షాట్ లు మాత్రమే ఉంటాయ్.

ఇప్పటి డిజిటల్ లో అయితే ఏమాత్రం తేడా వచ్చినా డిలీట్ చేసి పడేసి మళ్ళీ తీసుకోవచ్చు. కానీ ఫిల్మ్ తో తీసే టైమ్ లో అలాంటి ప్రయోగాలు చాలా ఖర్చు.

సినిమాటోగ్రఫీ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి ఈ సినిమా లో అరగంటకో సారి మారే రంగుల కోసం బాగా అర్ధమయ్యి ఇంకా బాగా నచ్చుతుంది.

పైగా సినిమా అంతా కూడా ఏదో abstract పెయింట్ లా అర్థం అయ్యీ కాకుండా ఉంటుంది. కానీ బావుంటుంది.

సౌండ్ కోసం అయితే మొదటి 10 నిమిషాలు ఒక్క డైలాగ్ కూడా ఉండదు. సినిమా అంతా కూడా అదో రకం సైలెన్స్ ఉంటుంది. ఆ ట్రైన్ ట్రాక్ నుండి ఆ రూం ఉన్న బిల్డింగ్ దాకా జరిగే సీన్స్ అయితే చూడ్డానికి ఆ లోకేషన్స్ భలే ఉంటాయ్ దాంతో పాటే ఆ వెనక్కాల సౌండ్స్ కూడా.

టొరంటినో సినిమాల్లో క్యారక్టర్ లు అలా వాగుతూ ఉంటే ఈయన సినిమాల్లో అలా నోరు మూసుకుని వాళ్ళ పని అవి చేసుకుంటూ ఉంటాయి.

అసలు “Andrei Tarkovsky” దర్శకత్వం కోసం ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు.

ఈ సినిమా 1979 లో రిలీజ్ అయింది. అంతకు 22 ఏళ్ల ముందు అంటే 1957 ప్రాంతాల్లో రష్యాలో “Chelyabinsk” అనే చోట ఒక Nuclear plant లో ఆక్సిడెంట్ అయ్యి ఆ ప్రాంతం మొత్తం నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశాడు అంటారు. ఈ సినిమా విడుదల అయిన ఎనిమిదేళ్లకి అంటే 1986 లో సోవియట్ యూనియన్ లో “Chernobyl” అనే ప్లేస్ లోని ఇంకో Nuclear plant లో ఆక్సిడెంట్ జరిగింది. సోవియట్ యూనియన్ విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చాలా మంది అంటారు. ఆ ప్లాంట్ ఉన్న ఏరియా ని చాలామంది దొంగతనంగా చూడటానికి వెళ్ళేవాళ్ళు.

అక్కడికి తీసుకు వెళ్ళే వాళ్ళు తమని “స్టాకర్” గా చెప్పుకునే వారట.

సినిమా మొత్తం రష్యన్ భాషలో ఉంటుంది. కాబట్టి సబ్ టైటిల్స్ చూసుకుంటూ, ఆ విజువల్స్ చూసుకుంటూ, ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటూ అష్టావధానం చేయగలిగితేనే ఈ సినిమా చూడండి.

ఫోటో లో స్టాకర్ ఉపయోగించే రైల్వే ట్రాలీ, రూం ఉన్న బిల్డింగ్, క్లైమాక్స్ లో ముగ్గురూ కూర్చునే రూమ్ ఉన్న ప్లేస్.