ఈ సినిమా “కథ” కోసం చెప్పాలి అంటే ముందుగా కొన్ని విషయాలు చెప్పాలి.
మరీ వివరంగా కాకుండా సింపుల్ గా చెప్తా.
రెండో ప్రపంచ యుద్ధం భీభత్సం గా జరుగుతున్నప్పుడు శత్రు దేశాల మీద పై చేయి సాధించడం కోసం అమెరికా ఒక బాంబ్ తయారు చేయాలనుకుంది.
దాని కోసం 1942 లో “Los Alamas” అనే ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. దాన్నే “Manhattan Project” అంటారు.
ఈ ప్రాజెక్ట్ లో అమెరికా తో పాటూ “UK, Canada” లు కూడా భాగస్వామ్యం అయ్యాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి మూడు నాలుగేళ్లు పట్టింది. అంటే 1942 లో మొదలు పెడితే 1945 కి బాంబ్ చేతికి వచ్చింది.
కానీ బాంబ్ చేతికి అందే సరికి జర్మనీ లొంగిపోయి, హిట్లర్ చచ్చి పోయి బాంబ్ జర్మనీ మీద వేయాల్సిన అవసరం లేకుండానే రెండో ప్రపంచ యుద్ధం 1945 లోనే ముగిసి పోయే స్థితికి వచ్చేసింది. ఈలోగా తయారు చేసిన బాంబ్ ఏం చేయాలి.
సింపుల్ గా “హిరోషిమా, నాగసాకి” మీద పట్టుకెళ్ళి పడేసింది.
ఈ అణు బాంబు తయారీ మొత్తానికి అధ్యక్షత వహించిన వ్యక్తి “J. Robert Oppenheimer”.
ఇదేమీ “శివ, ఠాగూర్, చెన్న కేశవ రెడ్డి” లా “Oppenheimer” అనే పేరున్న హీరో కథ కాదు. లేదా “ఇద్దరు, మహానటి, NTR కథానాయకుడు, మహానాయకుడు” లా పూర్తి జీవిత చరిత్ర కూడా కాదు. అతను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాక, రావడానికి ముందు జరిగిన కొన్ని సంఘటనల సమాహారమే ఈ సినిమా.
హోమ్ సిక్ తో బాధపడుతున్న Oppenheimer ని చూపించడం తో సినిమా మొదలవుతుంది. అతను జర్మనీ లోని ఒక యూనివర్సిటీ నుండి P.HD పూర్తి చేసి అమెరికా వస్తాడు. అక్కడే ఒక యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా జాయిన్ అవుతాడు.
అక్కడ అతనికి చాలామంది శాస్ర్తవేత్తలు, మేధావులతో పరిచయాలు అవుతాయి. అక్కడే అతనికి “Jean Tatlock” అనే లేడీ సైంటిస్ట్ తో అఫైర్ స్టార్ట్ అవుతుంది. ఆమె ఒక కమ్యూనిస్ట్ పార్టీ లో సభ్యురాలు.
Oppenheimer కి తర్వాత Katherin అనే అమ్మాయితో పెళ్ళవుతుంది. ఈమె కూడా కమ్యునిస్ట్ పార్టీలో సభ్యురాలు.
ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు టైప్ లో అలా హాయిగా సాగిపోతున్న ఇతని దగ్గరకి ఒక ఆర్మీ అధికారి వచ్చి ఒక బాంబు తయారు చేయాలని కోరతాడు. Oppenheimer ఒక Jewish community కి చెందిన వ్యక్తి.
హిట్లర్ జ్యూయిష్ పీపుల్ ని వరస పెట్టి, వెతికి మరీ చంపుతూ ఉండటం తో అతన్ని అపడంలో తాను కూడా ఒక చెయ్యి వేయాలని ఒక సైంటిస్ట్ ల టీమ్ ను వేసుకుని బాంబు తయారీ కోసం Los Alamas అనే ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒక చిన్న సైజ్ టౌన్ రెడీ చేసి, కుటుంబాలతో సహా అక్కడే మకాం పెట్టి మొత్తానికి బాంబు తయారు చేస్తాడు.
అయితే తాను కత్తి తయారు చేసింది కేకు కట్ చేయడానికి తప్ప పీకలు కోయడానికి కాదని భావించినట్టు తాను అణు బాంబు తయారు చేసింది ప్రపంచ శాంతి కోసం అనుకుంటాడు.
“Trinity Test” పూర్తవుతుంది. అణుబాంబు విజయవంతంగా పని చేస్తుంది. కానీ ఈ లోగా జర్మనీ లొంగిపోయింది. బాంబు పట్టుకెళ్ళి జపాన్ మీద పడేశారు.
దాదాపు 70 వేల మంది చనిపోయారు. మరో యాభై వేల మంది రెండు వారాల తర్వాత అనారోగ్యంతో చాలా దారుణంగా చనిపోయారు. అక్కడ జరిగిన విధ్వంసాన్ని అమెరికా సాధించిన గొప్ప విజయంగా అమెరికా పేపర్లు చూపిస్తూ ఉంటాయి.
ఇదంతా చూసిన Oppenheimer కి మొదటిసారిగా తాను చేసిన తప్పు ఏంటో తెలుస్తుంది. కానీ అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. అమెరికా అధ్యక్షుడి ని కలిసి అంత మంది చావుకి కారణం అయ్యానని బాధ పడతాడు. దానిలో నీ తప్పు ఏమీ లేదని, ఇదంతా యుద్ధాల్లో సైనికులతో బాటూ సామాన్య ప్రజలు కూడా చనిపోతూ ఉండటం సహజం అని అమెరికా ప్రెసిడెంట్ సర్ది చెప్తాడు. కానీ Oppenheimer కి మనశ్శాంతి దొరకదు.
మెల్లిగా మిగతా బాంబు తయారీ ప్రాజెక్ట్ ల నుండి బయటికి వస్తాడు. అతని ప్లేస్ లో వేరే అతను వస్తాడు.
ఇతనికి, ఇతని తమ్ముడికి గతంలో ఉన్న కమ్యూనిస్ట్ సానుభూతి పరులు అనే ఇమేజ్, Jean Tatlock తో ఉన్న సాన్నిహిత్యం, మిగతా కొన్ని సంఘటనలు అన్నీ కలిపి ఇతను “సోవియట్ యూనియన్” కి సాయం చేస్తున్నాడు అనే అనుమానం అమెరికా ప్రభుత్వానికి కలుగుతుంది.
దాంతో ఒక కమిటీ వేసి ఇతన్ని విచారించడం మొదలు పెడతారు. అయితే ఈ కమిటీ, దాని విచారణ వెనక మరో ఉప కథ ఉంటుంది.
అదేంటంటే ఈ Oppneheimer గతంలో ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ని కలిసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దూరంగా ఉండి ఆ సంభాషణ చూస్తున్న “Lewis Strauss” అనే ఒక సైంటిస్ట్ కి ఇద్దరూ కలిసి తన మీద జోకులు వేసుకుంటున్నారు అని అనుమానం వస్తుంది. పైగా అందరి ముందరా ఒకసారి “Isotopes” మీద అతడి సిద్ధాంతాలను Oppenheimer నవ్వుతూ కొట్టి పడేస్తాడు. ఇవి రెండూ తనకి అవమానం గా Strauss భావిస్తాడు.
దాంతో ఈ Lewis Strauss కి Oppneheimer మీద పగ ఉంటుంది. తన పరపతి, అధికారం ఉపయోగించి ఆ కమిటీ మెంబర్ లని మ్యానేజ్ చేసి Oppenheimer కి ఉన్న కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్ ని తప్పిస్తాడు, కమ్యునిస్ట్ లతో గతంలో ఉన్న సంబంధాలు చూపించి పబ్లిక్ లో అతని ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తాడు.
అయితే కొన్నాళ్ళకి Strauss దగ్గర పని చేసిన ఒక అసిస్టెంట్ Strauss కి Oppenheimer మీద ఉన్న అసూయను, పగ ను బయట పెట్టడం తో అందరికీ నిజాలు తెలుస్తాయి.
చివరికి Oppenheimer కి అమెరికన్ గవర్నమెంట్ నుండి ఒక ప్రతిష్టాత్మక అవార్డ్ వస్తుంది.
సినిమా ఆఖర్లో Oppenheimer, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం మాట్లాడుకున్నారు అనేది రివీల్ చేయడంతో సినిమా ముగుస్తుంది.
సింపుల్ గా చెప్పాలంటే గతంలో వచ్చిన నోలాన్ సినిమాల్లో లాగా సామాన్య ప్రేక్షకుడికి డార్క్ నైట్ సిరీస్ లో కనబడే “విజువల్ వండర్” లు, TENET లా బుర్రకి పదును పెట్టే లాజిక్ లు ఏమీ ఉండవు.
కానీ ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది”సౌండ్ డిజైన్”. ఇంటర్వెల్ తర్వాత వచ్చే “Trinity Test” అనే అణు బాంబు ని పరీక్షించే “షాట్” కోసం చాలా జాగ్రత్తగా సౌండ్ తో నే జనాన్ని ప్రిపేర్ చేస్తూ, డ్రామా నడిపిస్తూ తీసుకు వెళతాడు.
ఇక ఈ సీన్ లో షాట్ లు అయితే వేరే లెవెల్ లో ఉంటాయ్.
అదొక్కటే ఈ సినిమాలో విజువల్ గా సామాన్య ప్రేక్షకుడికి అద్భుతం అనిపించేది. మిగతా “ఐమాక్స్ ఫార్మాట్” ఇవన్నీ మనకి అర్థం కానివి, అవసరం లేనివి.
ఈ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సీన్స్ కోసం కోడాక్ ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మాట్ లో ఫిల్మ్ తయారు చేసిందిట.
Oppenheimer గా చేసిన “Cillian Murphy” అయితే సరిగ్గా అలా అచ్చు గుద్దినట్టు సరిపోయాడు.
ఇక ఈ సినిమాలో “విలన్” రాజనాల లా నెగెటివ్ పాత్రలో చేసింది మన “ఐరన్ మ్యాన్” Robert Downey Jr.
గుమ్మడి లా మరో సహాయక పాత్ర లో చేసింది “Matt Damon”.
తాము సూపర్ స్టార్స్ అయినా కూడా ఇలా నెగెటివ్ రోల్ చేయడం గ్రేట్ ………. ఏమీ కాదు. హాలీవుడ్ లో ఇలాంటివన్నీ మామూలే.
నోలాన్ గత సినిమాలతో పోలిస్తే సింపుల్ గా అర్ధం అయ్యే సినిమా, బావుండి, మరీ అద్భుతం అనిపించని సినిమా ఈ “Oppenheimer”.
PS: చిన్నప్పటి నుండీ తెలుగు మీడియం లో చదివిన నాలాంటి వాళ్ళు సబ్ టైటిల్స్ సరిగ్గా పడుతున్నాయో లేదో తెలుసుకుని వెళ్ళండి. కొన్ని స్క్రీన్స్ లో సగం కట్ అయిపోయి, కొన్ని చోట్ల వేరే సినిమావి పడుతున్నాయి.
#Oppenheimer #oppenheimermovie #glnsandilya #telugumoviereview #moviereview