The-Cremator

కులం, మతం అనే కాదు. ఏ విషయం మీదైనా దురభిమానం ఎక్కువయితే జరిగే పర్యవసానాలు ఎంటో క్లియర్ గా చూపించారు.

ఈ మూవీ జరిగే కాలం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ ప్రభ వెలుగుతున్న సమయం. ఆ టైమ్ లో హిట్లర్ మాట్లాడే ప్రతీ మాటా ఆడా, మగా తేడా లేకుండా కొన్ని మిలియన్ మందిని ప్రభావితం చేశాయి.

సినిమాలో హీరో “ప్రేగ్” నగరంలో ఒక కాటికాపరి గా పని చేస్తూ ఉంటాడు. కాటి కాపరి అంటే అదేదో హరిశ్చంద్రుడు లా ఒక కర్ర పట్టుకుని కాదు.

అదొక ఆధునిక స్మశానం. కొన్ని ఎకరాల్లో విస్తరించి, పెద్ద పెద్ద భవనాలు ఉన్న స్మశానం.

అక్కడ పెద్ద పెద్దోళ్ల శవాలు దాచి, నివాళులు అర్పించి, దండలు, దణ్ణాలు పెట్టిన తర్వాత జాగ్రత్తగా తగలబెడతారు. ఇది అతని బిజినెస్. తన స్మశానాన్ని అతను “Temple of Death” అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు.

అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాలేజీ ల వాళ్లూ, కార్లు అమ్మే వాళ్లూ స్టాల్స్ పెట్టినట్టు ఇతను కూడా పెద్ద పెద్ద వాళ్ళతో ఇలా గేదరింగ్ పెట్టి అక్కడ చావు, శవ దహనం దాని ప్రాముఖ్యత ఒక శవాన్ని ఎందుకు దహనం చెయ్యాలి, పుట్టుక, చావు, ఆత్మ, పునర్జన్మ లాంటివి చెప్తూ తన బిజినెస్ పెంచుకుంటూ ఉంటాడు.

అక్కడ ఇతనికి ఒక మాజీ సైనికుడు పరిచయం అవుతాడు. అతను ఒకప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం లో పని చేసి ఇప్పుడు హిట్లర్ మీద అభిమానం తో నాజీ పార్టీ కి సపోర్టు గా ఉంటాడు.

మెల్లి మెల్లిగా ఇతనికి బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెడతాడు. జ్యూయిష్ వాళ్ళు మనకి శత్రువులు అనీ, వాళ్ళని చంపేయడం కోసం హిట్లర్ గ్యాస్ ఛాంబర్ లాంటివి కనిపెడుతున్నాడు అనీ, ఇక్కడ స్మశానం లో ఒక్కోళ్లని తగల బెట్టడం కాకుండా వందల్లో మనుషుల్ని తగలబెట్టడం మన జాతికి ఋణం తీర్చుకోవడం అనీ ఇలా నానా మాటలు చెప్తాడు. పైగా ఇలా ఒక్కో శవాన్ని ఎన్నాళ్ళు తగలెడతావ్. చిన్న సైజ్ గ్యాస్ ఛాంబర్ ఒకటి కాంట్రాక్ట్ ఇప్పిస్తా. ఒకేసారి పదుల సంఖ్యలో శవాలు తగలేసి బిజినెస్ పెంచుకో అని సలహా ఇస్తాడు.

ఎక్కడో కొంచెం వెనకడుగు వేస్తున్నాడు అన్నప్పుడు ఇక అమ్మాయిల్ని దింపి, అతని బలహీనత మీద ఆడుకుంటాడు. అంటే ఒకళ్ళని గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ఏదైనా చేస్తారు అని చూపిస్తాడు.

అయితే మాటల మధ్యలో గతంలో ఒకేసారి హీరో భార్య తాను ఎక్కడో ఒక మూల జ్యూయిష్ మూలాలు ఉన్న వ్యక్తి అని చెప్తుంది. ఆ విషయం ఈ సైనికుడికి తెలుస్తుంది.

మెల్లిగా మన హీరోకి మరో విధంగా బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెడతాడు. కలుపు మొక్క అనేది ఎంత చిన్న మోతాదులో ఉన్నా కూడా పీకేసి పడేయాలి అనీ, అంతే కాకుండా మన ఒంట్లో నే అని కొన్ని రకాల వ్యాధుల్ని వదిలేస్తే మెల్లిగా మనల్ని పూర్తిగా నాశనం చేస్తాయని, కాబట్టి మన వాళ్ళు అయినా సరే జ్యూయిష్ వాళ్ళు అని తెలిస్తే చంపేయాలని బ్రెయిన్ వాష్ చేస్తాడు.

దాంతో హీరో తన కొడుక్కి తమ బిజినెస్ చూపిస్తా అని చెప్పి లోపలకి తీసుకెళ్ళి బుర్ర మీద రాడ్డుతో కొట్టి చంపేస్తాడు. తర్వాత ఆ శవాన్ని దహనానికి రెడీ గా ఉన్న ఒక సైనికుడి శవ పేటిక లో పెట్టి మేకులు కొట్టేసాడు. అంటే ఇక అది ఎవరూ ఓపెన్ చెయ్యరు అన్నమాట.

తర్వాత కూతుర్ని కూడా అలాగే మాయమాటలు చెప్పి తన భవనానికి తీసుకుని వస్తాడు. చంపాడా లేదా అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా.

ఈ సినిమా 1969 “చెకోస్లోవేకియా” లో తీశారు . అక్కడ వచ్చిన సినిమాల్లో కెల్లా అత్యంత పాపులర్ సినిమాగా దీన్ని చెప్తారు. దాదాపు అన్ని అవార్డ్స్ పట్టుకుపోయింది.

కొన్ని సన్నివేశాల్లో దహనానికి రెడీ గా ఉన్న నిజమైన శవాలు పెట్టి షూటింగు చేశారు.

తెలుగు సినిమాని “శివ” కి ముందూ, తర్వాత,

“బాహుబలి” ముందూ తర్వాతా అని ఎలా చెప్తారో అలాగే అక్కడ సినిమా చరిత్రను ఈ సినిమాకి ముందూ తర్వాతా అని చెప్పుకుంటారు.

PS: మంచి కుటుంబ కథ చెప్పా కదా.!

ఫోటోలో ఒక పక్క పడి చచ్చిపోయి ఉన్నాడే వాడే హీరో కొడుకు. వాడి బుర్ర మీదే హీరో కొట్టి ఆ పక్కనే ఉన్న పేటిక లో పెట్టి మేకులు కొట్టేస్తాడు.