(IMDB సినిమా లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటి సినిమా. ఎందుకో తర్వాత చెప్తా).

దాదాపుగా పాతికేళ్ల నుండి IMDB website లో టాప్ 100 బెస్ట్ మూవీస్ లిస్టు లో ఉన్న చోటు నుండి అంగుళం కూడా కదలకుండా, ఒక్క మెట్టు కూడా దిగకుండా మొదటి స్థానం లోనే ఉంది.

సినిమా విడుదల అయ్యాక వచ్చిన ప్రేమకథల టైటానిక్ లు, టెక్నాలజీ జెయింట్స్ అవతార్ లు, సూపర్ హీరోలు బ్యాట్ మాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లు, ఆ హీరోలూ అందరూ కట్ట గట్టుకు వచ్చిన అవెంజర్ సీరీస్ లు,

ఈ సినిమాకన్నా ముందే వచ్చిన గ్యాంగ్స్టర్ గాడ్ ఫాదర్ లు, హిచ్చుకాకు సైకోలు, బెన్ హర్, గాన్ విత్ ద విండ్ లు,

ముందూ, తర్వాత వచ్చిన జేమ్స్ బాండ్ సాహసాలు, మేకన్నాస్ గోల్డ్, గుడ్, బ్యాడ్ అండ్ ది అగ్లి లాంటి కౌ బాయ్ నిధులు

ఇవేవీ కూడా ఆ సినిమాని అక్కడ ఉన్న స్థానం నుండి కదపలేక నాన్ బాహుబలి రికార్డ్ లా రెండో ప్లేసుకోసం కొట్టుకుంటూ ఉంటాయి.

ఇంతలా జనాలకు నచ్చిన సినిమాలో ఏం ఉందో చూద్దాం.

ఈ ప్రపంచంలో మనిషికి కూడు గూడు గుడ్డ లాంటి అవసరాల తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది గా భావించేది స్వేచ్చ. ఈ పదానికి సరైన ఇంగ్లీష్ పదం దొరకలేదు నాకు.

దీని కోసమే బ్రేవ్ హార్ట్ లో మెల్ గిబ్సన్ లాస్ట్ లో తల నరికేటప్పుడు “ఫ్రీడమ్” అని అరిచినా, సైరా సినిమాలో చిరంజీవి తల నరుక్కున్నా.

ఈ సినిమాలో హీరో కూడా స్వేఛ్చ ని కోరుకున్నాడు. కానీ మరీ వాళ్ళ అంతలా ధైర్యంగా పోయి తల నరుక్కోకుండా బుర్ర వాడి బయటకు వస్తాడు.

ఇంతకీ స్వేచ్ఛ అంటే ఏమీ లేదు చాలా సింపుల్. నచ్చినప్పుడు తినడం, వచ్చినప్పుడు పొయ్యడం.

చాలా మందికి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఫ్రీడమ్ ఉండదు. అలాంటి వాటిలో ముఖ్యమైన వాళ్ళు ఖైదీ లు.

వాళ్ళు నిద్రలేవడం, తినడం, పని చెయ్యడం, పడుకోవడం ఇవన్నీ కూడా ఎవరో అనుమతిస్తే మాత్రమే చెయ్యగలరు. అయితే అలాంటి పరిస్థితుల్లోకి ఏదైనా నేరం చేసి వెళితే పెద్ద బాధ ఉండక పోవచ్చు. కానీ అన్యాయంగా నేరం లో ఇరికించబడి, తన నిర్దోషిత్వాన్ని ఋజువు చేసుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని దూరం చేస్తే.?

నిజానికి ఈ సినిమాని అప్పట్లో అంటే ఒక 25 ఏళ్ల క్రితం ఎలా ప్రమోట్ చేశారో కానీ ఈ సినిమా చూశాక ఇదొక పెర్ఫెక్ట్ రివెంజ్ డ్రామా అనిపించింది.

ఈ కథ 1947 లో జరుగుతుంది. భార్యని, ఆ భార్యతో సంబంధం పెట్టుకున్న ఆమె స్నేహితుడిని హత్య చేశాడు అనే నేరం మీద రెండు యావజ్జీవ శిక్షలు పడిన Andy (హీరో) అనే ఒక బ్యాంకర్ ను Shawshank State Prison కి పంపిస్తారు. అక్కడ ఇతనికి Red అని ఒక తోటి ఖైదీ తో స్నేహం అవుతుంది. ఆ రెడ్ కూడా అప్పటికే ఇరవై ఏళ్ల నుండి అదే జైల్ లో ఉంటాడు. అక్కడ జైల్ లో ఖైదీలకు కావలసిన సరుకులు దొంగతనంగా తెప్పిస్తూ ఉంటాడు.

ఆ జైల్ వార్డెన్ అయిన శామ్యూల్ అక్కడి ఖైదీ లను సమాజ సేవ చేయించే మిష మీద బయట కూలి పనులకు పంపి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. దీనికి అతని కింద పని చేసే అధికారి బైరేన్ సహాయం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఈ బైరెన్ కి తన పూర్వీకుల నుండి ఆస్తి కలిసి వస్తుంది. దానికి టాక్స్ చాలా కట్టాల్సి వస్తుంది. వృత్తి పరంగా బ్యాంకర్ అయిన Andy బైరెన్ కి ఒక సలహా ఇచ్చి ట్యాక్స్ లేకుండా ఆ డబ్బులు మిగిలెలా చేస్తాడు. ఆ దెబ్బకి హీరో పేరు జైల్ లో మారుమోగి అక్కడ ఉన్న అందరు పోలీసులు ట్యాక్స్ కట్టే విషయం లో అతని సలహాల కోసం వస్తారు. ఆ విషయం వార్డెన్ దాకా వెళ్లి తను జైలు కూలీలతో చేయించే శ్రమ దోపిడీకి లెక్కలు రాయడానికి పెట్టుకుంటాడు. అదే సమయంలో Stephens పేరుతో దొంగ ఐడీ ప్రూఫ్ ఒకటి సృష్టించి ఈ డబ్బులన్నీ బ్యాంకులో దాస్తూ ఉంటాడు.

ఇక హీరోకి జైల్ లో స్నేహితుడు అయిన రెడ్ ది వేరే కథ. ఒక దొంగతనం కేసులో పట్టుబడి దాదాపు యావజ్జీవ శిక్ష పడుతుంది. కానీ ప్రతీ అయిదెళ్లకు ఒకసారి పరొల్ మీద బయటకు వెళ్ళే అవకాశం కోసం ఇంటర్వూ చేస్తూ ఉంటారు. కానీ రెడ్ చెప్పే సమాధానాలు నచ్ఛక పరోల్ ఇవ్వరు.

ఇలా జైలులో ఒక 16 యేళ్లు గడిచాక టామీ విలియమ్స్ అనే ఒక కొత్త ఖైదీ ఆ జైలుకి వస్తాడు. అతను కొన్నేళ్ల క్రితం వేరే జైలులో ఉండగా అతని జైల్ మేట్ తాను రెండు హత్యలు చేసా అని ఆ హత్యల మీద ఒక బ్యాంకర్ జైలుకి వెళ్ళాడని చెప్తాడు. ఇక్కడ అతను Andy నీ చూసి హీరో యే ఆ బ్యాంకర్ అని పూర్తిగా తెలియకుండానే, మాటల్లో ఈ విషయం అతనికి కాజువల్ గా చెప్తాడు.

అది విన్న హీరోకి విషయం అర్థం అవుతుంది. వార్డెన్ ని కలిసి తాను నిర్దోషిగా విడుదల అయ్యే అవకాశం ఉంది అని, తన దగ్గర సాక్షి ఉన్నాడు అనీ చెప్తాడు. కానీ వార్డెన్ అయిన శామ్యూల్ కి అతను విడుదల అవ్వడం నచ్చదు. ఎందుకంటే ఇన్నాళ్లూ అతను సంపాదించిన డబ్బులన్నీ వివిధ బ్యాంకుల్లో Andy మారు పేరు మీదే, ఉన్నాయి. పైగా ఈ జైలులో ఖైదీ లను కూలీలుగా బయటకు పంపే దొంగ లెక్కలు చూసేది కూడా హీరో యే. కానీ ఆ విషయం పైకి చెప్పకుండా ఆ సాక్షిని రాత్రి ఒక చోటికి రమ్మని చెప్పు మాట్లాడతా అని హీరోకి చెప్పి, Tammy ని పిలిచి తప్పించుకో అని చెప్పి, జైలు గోడ దూకుతున్నప్పుడు కాల్చి చంపేస్తాడు. దాంతో హీరో విడుదల అయ్యే అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయి.

ఈ విషయం హీరోకి అర్థం అయినా అర్థం కానట్టే ఉండి ఏమీ ఎరగనట్లు ఇంకో ఏడాది జైల్ లో ఉండి, ప్లాన్ వేసి అక్కడ నుండి తప్పించుకుని పారిపోయి స్వేచ్చా జీవితం గడుపుతాడు. అంటే 1947 లో జైలుకి వెళ్ళిన హీరో 1966 లో బయటకి పారిపోతాడు.

ఆ తప్పించుకొనే ముందు తన మారుపేరుతో క్రియేట్ చేసిన మొత్తం ఐడీ కార్డులతో సహా బినామీగా పెట్టిన డబ్బు మొత్తం బ్యాంకుల నుండి డ్రా చేసుకుని, జైల్ లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు పై అధికారులకు అందించి మరీ పారిపోతాడు. దాంతో పై అధికారులు జైలు మీద ఆకస్మిక తనిఖీ చేసి అవినీతి అధికారులకు తగిన బుద్ధి చెప్పి అరెస్ట్ చేస్తారు.

తర్వాత తను ఎక్కడ ఉన్నదీ జైల్ లో ఉన్న తన స్నేహితుడు రెడ్ కి తెలిసేలా చేసి తను కూడా విడుదల అయ్యాక తనను కూడా అక్కడకు రమ్మని ఇద్దరూ కలిసి హాపీ గా ఉంటారు.

అంతే సినిమా అయిపోయింది. ఎండ్ లో కెమెరా అలా పైనుండి లాంగ్ షాట్ లో సముద్రం చూపిస్తూ ఉంటే సినిమాకు శుభం కార్డు పడుతుంది.

ఇక్కడ దాకా చెప్పిన రివెంజ్ స్టోరీ తో కొంచెం అటూ ఇటూగా దాదాపు ఒక వెయ్యి సినిమాలు వచ్చి ఉంటాయి. ఈ సినిమాలో చేసిన నటులు, దర్శకుల కంటే గొప్ప స్టార్స్ తో ఇంకో వెయ్యి సినిమాలు వచ్చి ఉంటాయి.

అయినా ఇంతలా జనాలు గుర్తుపెట్టకోడానికి ఈ సినిమాలో హీరో ఏమైనా స్టార్ హీరోనా అనుకుంటే ఈ సినిమాలో చేసిన నటుల్లో ఎవరి పేరు కూడా ఇప్పటి సామాన్య జనానికి సరిగ్గా తెలియదు. ఒక “రెడ్” గా వేసిన మోర్గాన్ ఫ్రిమాన్ తప్ప. ఇక హీరో గా చేసిన Tim Robbins నటించిన ఇంకో సినిమా పేరు హఠాత్తుగా అడిగితే చాలా మంది తెల్ల మొహం వేయచ్చు.

పోనీ ఇదేమైనా బ్యాట్ మాన్, స్పైడర్ మ్యాన్, జురాసిక్ పార్క్, అవెంజర్లాంటి సిరీస్ కాదు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేసి గుర్తు చెయ్యడానికి. ఈ సినిమాలో పని చేసిన వాళ్ళ రెండో సినిమా ఇప్పటిదాకా నాకు సరిగ్గా తెలియదు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రాలేదని టాక్.

పోనీ అవతార్ లాంటి గ్రాఫిక్స్, lord of the rings లాంటి లోకేషన్స్ ఉన్నాయా అంటే సినిమా అంతా దాదాపుగా ఉన్నది ఒకటే లొకేషన్ “జైలు”, జైలు గోడలు. సినిమా అంతా సింగిల్ కాస్ట్యూమ్. అదే జైలు యూనిఫాం.

పోనీ టైటానిక్ లాంటి ప్రేమ కథా చిత్రం, మాంఛి రొమాంటిక్ సీన్లు అనుకుంటే సినిమా మొత్తం మీసాలు, గడ్డాలు. ఏదో షాపింగ్ మాల్లో ఒక సీన్లో తిరిగే జూనియర్ ఆర్టిస్టులు తప్ప ఒక్క జడ కూడా కనబడదు.

పోనీ హీరో ఏమైనా ఐరన్ మ్యాన్ లా సూపర్ హీరో నా అనుకుంటే విలన్, వాడి అసిస్టెంట్ కూడా హీరోకి బూట్లు పాలిష్ చెయ్యమని ఆర్డర్ వేసి, చెప్పిన పని చెయ్యక పోతే చీకటి గదిలో వేసి చితక తంతూ ఉంటారు. పైగా అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నాలు ఏమీ చేయకపోగా నోరు ముసుకుని రాళ్ళు కొట్టే కన్నా లెక్కలు రాయడం అని మాట్లాడడు.

ఈ సినిమా డైరెక్టర్ ఎవరో మొన్నటి దాకా చూడలేదు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్, క్రిస్టోఫర్ నోలాన్ లు, ఫామ్ లో ఉన్న మార్టిన్ సోర్శీ వీళ్ళను సినిమాలను దాటుకుని ఆ సినిమా ఇంకా మొదటి స్థానంలో నిలబడింది అంటే ఏదో ఉండాలి.

ఆ ఏదో ఎంటో ఎలాగైనా కనిపెట్టాలి అని కనీసం ఏడాదికి ఒక అయిదారు సార్లు ఈ సినిమా చూస్తూ ఉంటా. కానీ అసలు విషయం మర్చిపోయి సినిమాలో పడిపోయి, సినిమా అయ్యాక బయటికి వచ్చి మళ్ళీ మొదలు పెట్టి, మళ్ళీ మర్చిపోయి, మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతూ ఉండటం తో ఇక ఆ కనిపెట్టడం అనే ప్రయత్నం మానేసి సినిమా చూడటం అలవాటు చేసుకున్నా.

కానీ ఒకటి మాత్రం అర్థం అయింది. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశంలో ఉండేది “హోప్”. 1947 లో జైలుకి వెళ్ళిన హీరో ఎక్కడా కూడా నిరాశగా నిస్పృహ గా కనబడడు. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నట్టే కనబడుతుంది నాకు. చివరకు ఆ అద్భుతం జరిగి, తను నిర్దోషి అని నిరూపించుకునే సమయానికి అదృష్టం చేజారి పోవడంతో తనే ఒక అద్భుతమయిన భవిష్యత్తుని క్రియేట్ చేసుకుంటాడు.

అతడు జైలుకి వచ్చిన మొదటి రోజు అతని ఆకారం చూసి, పిరికివాడిలా ఉన్నప్పుడు ఈరోజు రాత్రి ఏడుస్తాడు అని తోటి ఖైదీలు ఎదురు చూస్తూ, పందాలు కాస్తూ ఉంటారు. కానీ అతను ఎడవడు. అతని మీద పందెం కాసిన రెడ్ ఓడిపోతాడు.

ఈ సినిమాలో హీరో జైలు నుండి దాదాపు ఒక కిలో మీటర్ దూరం ఒక సెప్టిక్ ట్యాంక్ గొట్టం లో నుండి పాకుంతూ బయటకు వచ్చి వర్షంలో జైలు యూనిఫాం విప్పి అవతల పడేసే సన్నివేశం అయితే నిజంగా మనకు అప్పటిదాకా ఆగిపోయి ఉన్న ఊపిరి తిరిగి కొట్టుకున్నట్టు ఉంటుంది. ఈ ఒక్క సీన్ చాలు. హీరో ఎలివేషన్ కోసం.

దానికన్నా ముందు సీన్ లో జైలు వార్డెన్ గోడకేసి గులక రాయి విసిరిన షాట్ చూసినప్పుడు “ఈ సీన్ గానీ చూస్తే మీరు షాక్ కి గురవుతారు” అనే YouTube thumbnail గుర్తుకు రావడం ఖాయం.

మాములుగా సినిమా అంటే దృశ్య మాధ్యమం. కానీ దాదాపు సినిమా అంతా మొదటి సన్నివేశం నుండి రెడ్ పాత్ర వెనక నుండి వాయిస్ ఓవర్ లో దాదాపు అన్నీ చెప్తూనే ఉంటుంది. అదే సన్నివేశం మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు బోర్ కొట్టదు.

జైలు నుండి విడుదల అయిన రెడ్ ఒక స్టోర్ లో పని చేస్తూ, ఫ్లోర్ తుడుస్తూ మేనేజర్ కేసి చిటికిన వేలు చూపించునప్ప్పుడు అనిపిస్తుంది. మనం ఎంత ఫ్రీడమ్ తో బ్రతుకుతున్నామో.

ఇక దాదాపు యాభై ఏళ్లు జైలు జీవితం గడిపిన ఒక ముసలాయన విడుదల అయ్యి బయట బ్రతకడం తెలియక ఆత్మహత్య, చేసుకునే సీన్, తనకు కూడా సరిగ్గా అదే సమస్య వచ్చినప్పుడు “రెడ్” తీసుకునే నిర్ణయం.

అసలు ఒకటి కాదు. ఈ సినిమాలో ఏ సీన్ చెప్పాలో తెలియక ఇన్నాళ్లూ రాయలేదు. ఒకవేళ అన్నీ రాయడం మొదలు పెడితే నవల అవుతుంది.

అసలు ఇవన్నీ కాదు ఒకసారి ఈ సినిమా చూసి ఈ ఆర్టికల్ అప్పుడు చదవండి. వీడెంటి ఈ సినిమా కోసం ఇంకా చాలా రాయాల్సి ఉండగా చాలానే వదిలేశాడు, సర్లే మిగిలినవి మనం రాద్దాం అనిపించక పోతే..!

ఈ సినిమాకి వచ్చిన అవార్డులు, రివార్డులు అన్నీ నెట్ లో వెతుక్కొండి ప్లీజ్. ఎందుకంటే ఇక్కడితో రాయడం అపి నేను మళ్ళీ ఈ సినిమా ఇంకోసారి చూడాలి.

ఇక పోస్ట్ మొదట్లో టైటిల్ కింద పెట్టినట్టు మెగాస్టార్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత కూడా దాదాపు పదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడడానికి ఎవరూ ధైర్యం చెయ్యలేదు. ఆయన తర్వాత ఉన్నవి ఒకసారి వాళ్ళూ, ఇంకోసారి వీళ్ళు పంచుకున్నారు. అలాగే ఈ సినిమా వచ్చి పాతికేళ్లు అవుతున్నా కూడా దాని పొజిషన్ కూడా ఎవరూ కదలలేక పోయారు. అంతే.

#TheShawshankRedemption, #TimRobbins, #MorganFreeman, #StephenKing, #FrankDarabont