Hachiko..!
మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించేది ఎవరో తెల్సా.! మనం పెంచుకునే కుక్క.!
“ఒకవేళ ఒక కుక్క కనుక మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆ కుక్క సమస్యల్లో పడినట్లే”.
ఈ పైన చెప్పిన రెండు కొట్స్ కూడా “హచికో” సినిమా చూశాక నమ్మాలి. ఈ సినిమా నిజానికి ఒక కుక్క జీవిత చరిత్ర.
కుక్కల మీద వచ్చిన జీవిత చరిత్రలో ఇప్పటి దాకా రెండు చూసా.
ఒకటి 1925 లో తన ప్రాణాలకు తెగించి మంచుకొండల్లో 600 మైళ్ళు పరిగెత్తి ఒక ప్రాణాలు తీసే భయంకరమైన వైరస్ కి మందు తెచ్చిన “టోగో”.
ఇక రెండోది “హచికో మొనోగటారి”..!
ఈ సినిమా టోక్యో లోని శిబూయ అనే ఊరిలో జరిగిన నిజ జీవిత ఆధారంగా తీశారు.
నవంబర్ 10 1923 లో “యునో” అనే ఒక ప్రొఫెసర్ హచికో అనే ఒక కుక్కని “శిబూయ” (ఊరి పేరు) లోని తన ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటూ ఉంటాడు. రోజూ తాను పని చేసే చోటికి వెళ్ళి వచ్చేటప్పటికి హాచికో అతని కోసం శిబుయా రైల్వే స్టేషన్ ముందు అతని కోసం ఎదురు చూస్తూ ఉండేది. అతను స్టేషన్ బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు.
ఎండా, వానా, చలి ఏ కాలం అయినా సరే హచికొ ప్రొఫెసర్ కోసం స్టేషన్ బయట ఎదురు చూడడం మానదు.
ఇలా దాదాపు 3 సంవత్సరాలు గడుస్తాయి. మే 21, 1925 నాడు లెక్చర్ ఇస్తూ ఇస్తూ “సెరిబ్రల్ హేమారేజ్” తో యునొ క్లాస్ రూం లోనే చచ్చిపోతాడు. అయితే ఈ విషయం తెలియని హాచికొ రోజూలాగే అతని కోసం స్టేషన్ బయట ఎదురు చూస్తూ ఉంటుంది. కొంతసేటికి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అది ఇంటికి వచ్చేసరికి అతని శవాన్ని ఒక పెట్టెలో పెట్టి ఇంటికి తీసుకువచ్చి ఖననానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ తీసుకువెళ్ళే వాహనం వెనక్కాల కొద్ది దూరం ఫాలో అయ్యి ఇంక వెళ్ళలేక ఆగిపోయి ఇంటికి వచ్చేస్తుంది.
అతని భార్యా అంత పెద్ద ఇంటిలో ఒక్కర్తీ ఉండలేక ఇల్లు అమ్మేసి తన కూతురి దగ్గరకు వెళ్ళిపోతుంది. కానీ కూతురు ఒప్పుకోకపోవడంతో హచీకో ను తెలిసిన వాళ్ళకు ఇచ్చెద్దాం అని అనుకుంటే ఎవరూ తీసుకోవడానికి ముందుకు రారు. దానితో హాచ్చికో నీ అక్కడ ఉండే ఒక ఫ్యామిలీ కి వదిలేసి కూతురు దగ్గరకు వెళ్ళిపోతుంది. అయినా కూడా హాచికో స్టేషన్ కి రావడం మానదు. ఒకరోజు హఠాత్తుగా ఆ ఫ్యామిలీ యజమాని చనిపోవడంతో మిగతా ఇంట్లో వాళ్ళకు ఒక పిల్లి అంటే ఇష్టం ఉండడం వల్ల దీన్ని పెంచుకోడానికి ఇష్టం ఉండదు. కాబట్టి దాన్ని బయటకు పంపేస్తారు.
హచీకొ అవేమీ పట్టించుకోకుండా రోజూలాగే సాయంత్రం ప్రొఫెసర్ కోసం స్టేషన్ దగ్గర ఎదురు చూడటం మాత్రం మానదు. కొన్నాళ్లకు సరైన తిండి లేక బక్కచిక్కి పోతుంది. కానీ ఎదురు చూడటం మాత్రం మానదు. ఆ స్టేషన్ దగ్గర ఉండే ఒక చిన్న దుకాణం అతను రోజూ కొంచెం తిండి పెడుతూ ఉంటాడు. మిగతా జనం మాత్రం దాన్ని కసురుతూ, కొడుతూ ఉంటారు.
ఇలా దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తాయి. 1932 లో ఒకసారి రిపోర్టర్ అయిన ప్రొఫెసర్ మాజీ స్టూడెంట్ ఒకళ్ళు దాని గురించి తెలిసి పేపర్లో వెయ్యడం తో ఒకసారిగా జపాన్ జనాల దృష్టిలో పడుతుంది. దానికోసం వివిధ పేపర్లలో చాలా ఆర్టికల్స్ వస్తాయి.
ఈ విషయం ప్రొఫెసర్ భార్య దాని కోసం మళ్ళీ “షిబుయా” కి వస్తుంది. హాచికొ నీ తీసుకు వెళ్ళిపోవడానికి వచ్చింది అని కనిపెట్టిన హచికో ఆమే నుండి పారిపోయి స్టేషన్ దగ్గర దాక్కుని ప్రొఫెసర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
విషయం అర్థం అయిన ప్రొఫెసర్ భార్య తనను అక్కడే వదిలేసి తిరిగి కూతురు దగ్గరకు వెళ్ళిపోతుంది.
ఇలా దాదాపు తొమ్మిదేళ్లు రోజూ క్రమం తప్పకుండా ప్రొఫెసర్ కోసం ఎదురు చూసిన హచికో మార్చ్ 8 1935 న 12 ఏళ్ల వయసులో స్టేషన్ ముందే చనిపోయింది.
ఈ సినిమా చూసాక నిజంగా ఒక కుక్క ను పెంచుకోవాలి అనిపించడం ఖాయం.
ఈ సినిమా లో చూపించిన సంఘటనలు దాదాపు నిజం. హచికో ని అందరూ వదిలేసి వెళ్లిపోవడం. స్టేషన్ దగ్గర ఎదురు చూస్తుంటే కసురుకోడం, చీదరించుకోవడం.
హచికో చనిపోయాక ప్రొఫెసర్ పక్కనే దాని “బొచ్చు” కూడా సమాధి చేశారు. నిజంగా దాని “బొచ్చునే”.
దాని శరీరాన్ని పాడైపోకుండా రసాయనాలతో శుద్ధి చేసి, లోపల మైనం లాంటి పదార్థాలు కూరి నిజంగా బ్రతికి ఉన్నట్టు కనపడేలా చేసి “నేషనల్ సైన్స్ మ్యూజియం ఆఫ్ జపాన్” లో భద్రపరిచారు.
అది రోజూ ఎదురు చూసిన “శిబూయా రైల్వే స్టేషన్” ముందు దానికి ఒక కంచు విగ్రహం పెట్టారు. ఆ ఎంట్రీ పేరు కూడా “హచికో ఎంట్రీ” అని అర్థం వచ్చేలా “హాచికో గుచి” అని పెట్టారు. ఈ విగ్రహం కూడా అదిపోయాక కాదు 1934 లో హచి బ్రతికి ఉన్నప్పుడే పెట్టారు.
“హచికో” ని జపాన్ సంస్కృతి లో విశ్వాసానికి మారుపేరుగా చూస్తారు.
1987 లో విడుదల అయిన ఈ సినిమా ఆ ఏడాది అన్నిటికన్నా ఎక్కువ సక్సెస్స్ అయిన సినిమాగా నిలిచింది.
మళ్ళీ ఇదే స్టోరీ తో 2009 రిచర్డ్ గేర్ హీరోగా “Hachi: A dog’s tale” అనే పేరుతో హాలీవుడ్ లో వచ్చింది..!
ఇదే సినిమాని తెలుగులో రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో “టామీ” అని తీశారు.