Bridge Of Spies

ఈ కథలో కి వెళ్ళే ముందు రెండు విషయాలు చెప్పాలి.

మొదటిది ఒక దేశ దేశ భక్తుడు మరో దేశానికి ఉగ్రవాది అని ఒక నానుడి. అంటే ఒకడు తన దేశాన్ని శత్రు దేశం నుండి కాపాడు కోవడం కోసం ఆ శత్రు దేశానికి నష్టం చేకూర్చక తప్పదు.

రెండోది ఒక దేశంలో ఉన్న ఎవరికైనా సరే ఆ దేశ రాజ్యాంగం ప్రకారం చట్ట పరంగా లభించే అన్ని హక్కులూ వాడుకుని తను నిర్దోషి గా బయట పడే హక్కు ఉంది.

అప్పటికీ నేరం రుజువు అయితే శిక్ష పడుతుంది.

అంతే కాకుండా ఈ సినిమాలో “అందరి ప్రాణాలు ఓకే రకం విలువ కలిగి ఉంటాయా లేదా” అన్నది కూడా చర్చించారు.

సినిమా కథంతా 1957 నుండి 1961 కాలంలో నడుస్తుంది.

1957 లో అమెరికన్ FBI రష్యన్ KGB కి చెందిన రుడాల్ఫ్ ఏబెల్ అనే 60 ఏళ్ల వయసున్న ఒక సోవియట్ యూనియన్ గూఢచారిని పట్టుకోవడం తో సినిమా మొదలవుతుంది.

అతను పైకి ఒక పెయింటర్ గా నటిస్తూ, సోవియట్ యూనియన్ తరపున గూఢచారి గా పని చేస్తూ ఉంటాడు.

అయితే అతడు శత్రు దేశానికి చెందిన వాడు అయినప్పటికీ కూడా మా దేశంలో ఎవరికైనా సరే న్యాయ సహాయం పొందే అవకాశం ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పాలి అని అమెరికా భావిస్తుంది.

అందుకోసం James Donovan అనే ఒక లాయర్ ని రుడాల్ఫ్ కేసు వాదించమని అడుగుతుంది. అతను క్రిమినల్ లాయర్ కాదు. ఇన్సూరెన్స్ కేసులు వాదించే లాయర్.

గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఓడిపోయే కేసు ఎవరు వాదిస్తే ఏముంది అనే ఉద్దేశ్యంతోనే తనకి ఈ కేసు అంటగట్టారు అని అర్థం అవుతుంది.

ముందు ఒప్పుకోక పోయినా తర్వాత ఇక తప్పక ఒప్పుకుంటాడు.

ఇంటికి వచ్చాక భార్య, పిల్లలు ఇలాంటి దేశ ద్రోహి తరపున ఎందుకు ఒప్పుకున్నావని అడుగుతారు.

ఎందుకంటే అతను తన దేశం కోసం ఉద్యోగం పరంగా గూఢచర్యం చేశాడు తప్ప దేశ ద్రోహి కాదని అంటాడు. పైగా అందరికీ చట్ట పరంగా రక్షణ పొందే హక్కు ఉంది అనీ, కేవలం తాను ఆ హక్కును నిలబెట్టడం కోసం మాత్రమే అతని తరపున వాదించడానికి ఒప్పుకున్నా అని చెప్తాడు.

రుడాల్ఫ్ ని ఉంచిన జైలుకి వెళ్ళి అతనితో మాట్లాడతాడు. తను రుడాల్ఫ్ తరపున లాయర్ గా వాదించడానికి వచ్చానని, మీకు సమ్మతమేనా అని అడుగుతాడు.

మెల్లిగా ఇద్దరి మధ్యా మాటలు మొదలవుతాయి.

ఆ మాటల్లో మీకు అమెరికా ప్రభుత్వం ఏమన్నా ఆఫర్స్ ఇచ్చిందా అని అడుగుతాడు.

తాను కనక సోవియట్ యూనియన్ కోసం తనకి తెలిసిన రహస్యాలు చెప్తే తనని నిర్దోషిగా విడుదల చేసి, అమెరికా లో ఉద్యోగం తో బాటూ, చాలా డబ్బు ఇస్తా అన్నారని కానీ తాను ఒప్పుకోలేదని చెప్తాడు.

మొత్తానికి James Donovan తన లాయర్ గా ఉండటానికి రుడాల్ఫ్ ఒప్పుకుంటాడు.

తర్వాత తాను డ్రాయింగ్ వేసుకోవడం కోసం పెన్సిల్స్, పేపర్స్, సిగరెట్స్ కావాలని అడుగుతాడు. అవన్నీ కుదరవు అని చెప్పిన Donovin తో,

నాలాగా మీ దేశం కోసం పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనక దొరికితే ఇలాగే ట్రీట్ చేయాలని కోరుకుంటారా అని అడుగుతాడు.

దాంతో Donovin ఆలోచనలో పడతాడు.

కేసు కోర్టుకు వస్తుంది. Donovin జడ్జ్ ను కలిసి వాయిదా అడుగుతాడు. అతను రష్యన్ గూఢచారి అనీ కాబట్టి వాయిదా కుదరదు అని జడ్జ్ ఘాటుగా సమాధానం చెప్తాడు.

కోర్టు నుండి బయటకి వచ్చిన Donovin ని CIA ఏజెంట్ ఒకతను కలిసి రుడాల్ఫ్ ఏమైనా సీక్రెట్స్ చెప్పాడా అని అడుగుతాడు. ఒకవేళ ఏమైనా చెప్తే తనకి చెప్పమని చెప్తాడు.

తన క్లయింట్ తనతో మాట్లాడిన విషయాలు బయటకి చెప్పడం కుదరదు అని Donovin సమాధానం చెప్తాడు.

ఇది దేశ రక్షణకు చెందిన వ్యవహారం కాబట్టి రూల్స్ పక్కన పెట్టి వెళ్లాలని చెప్పిన CIA ఏజెంట్ తో Donovin ఈ సందర్భంలో చెప్పిన సమాధానమే ఈ సినిమాకి ప్రాణం.

అదేంటంటే తాను ఐరిష్ అనీ, తనని కలిసిన CIA ఏజెంట్ జర్మన్ అనీ కానీ ఇద్దరూ అమెరికన్లు గా గుర్తింపు పొందుతూ అన్ని సౌకర్యాలు, హక్కులు అనుభవిస్తున్నాం అంటే దానికి కారణం రూల్ బుక్ అనీ, దాన్నే రాజ్యాంగం అని పిలుస్తున్నాం అని సమాధానం చెప్తాడు.

ఇక ఆ CIA ఏజెంట్ ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోతాడు.

రుడాల్ఫ్ మీద పెట్టిన కేసులు, దొరికిన సాక్ష్యాలు అన్నీ బలంగా ఉండటం తో రుడాల్ఫ్ కి మరణ శిక్ష తప్పదు అని అందరూ అనుకుంటారు. జడ్జి తీర్పును తర్వాత చెప్తా అని వాయిదా వేస్తాడు.

అయితే Donovin జడ్జి ని విడిగా ఇంటి దగ్గర కలిసి అతనికి గనక మరణ శిక్ష వేయకుండా ప్రాణాలతో ఉండనిస్తే ఒక లాభం ఉంది అని చెప్తాడు.

ఏంటి అని అడిగిన జడ్జి తో భవిష్యత్ లో మన గూఢచారులు ఎవరైనా పట్టుబడితే ఇతన్ని చూపించి వాళ్ళని విడుదల చేసుకోవచ్చు అని చెప్తాడు.

అంటే యుద్ధ ఖైదీల మార్పిడి అన్నమాట.

పైగా అతను పని చేసింది తన ఉద్యోగ ధర్మం కోసం తప్ప వేరే ఏమీ కాదు అని చెప్తాడు. జడ్జి కన్విన్స్ అవుతాడు.

మర్నాడు కోర్టు లో రుడాల్ఫ్ కి మరణ శిక్ష కి బదులుగా ముప్పై ఏళ్ళు జైలు శిక్ష, కొంత జరిమానా విధిస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు.

బయట ప్రెస్ వాళ్ళతో ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని చెప్పిన Donovin ని జనాలు దేశ ద్రోహిగా చూడటం మొదలు పెడతారు. దాంతో అతని ఇంటి మీద దాడి కూడా జరుగుతుంది.

జనాల్లో అతని మీద నెగటివ్ ఇంప్రెషన్ పడుతుంది.

తర్వాత కేసు పై కోర్టుకి వెళుతుంది. అక్కడ కూడా తాను అమెరికా క్షేమం కోసమే రుడాల్ఫ్ తరపున వాదిస్తున్నా అని చెప్తాడు.

అంతే కాకుండా అతను శత్రు దేశం తరఫున పని చేస్తున్నాడు తప్ప శత్రువు కాదనీ, ఒక మంచి సైనికుడు అనీ అందుకే ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత భయ పెట్టినా కూడా తన దేశ రహస్యాలు బయట పెట్ట లేదనీ, అలాంటి వాడిని చంపడం కన్నా కూడా ఇలా ప్రాణాలతో ఉంచి మన దేశం ఔన్నత్యం ఏంటో తెలిసేలా చేయాలని చెప్తాడు.

దాంతో పై కోర్టు కూడా కన్విన్స్ అయ్యి కింది కోర్టు విధించిన శిక్ష ఖరారు చేస్తుంది.

ఇదిలా ఉంటే మరో పక్క రష్యా మీద గూఢచర్య కార్యకలాపాల కోసం అమెరికా ఒక అత్యాధునిక విమానాలకి కేమెరాలని అమర్చి సోవియట్ యూనియన్ భూభాగం లోకి ఫోటోలను తీయడం కోసం పంపిస్తుంది.

ఆ విమానాలు దాదాపు 70 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తూ, భూమి మీద చాలా క్లారిటీ తో ఫోటోలు తీయడం కోసం కెమెరాలు అమర్చ బడి ఉంటాయి.

ఆ పైలట్లుకి కూడా చాలా సీక్రెట్ గా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు.

అయితే ట్రైనింగ్ చివర్లో ఒక్కో పైలట్ కీ ఒక్కో డాలర్ కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ లో ఒక పిన్ ఉంటుంది. ఒకవేళ రష్యాకు దొరికితే గనక వాళ్ళు పెట్టే చిత్ర హింసలు పడే బదులు సైనైడ్ పూసిన ఆ పిన్ తో శరీరం మీద టచ్ చేసుకుని ఆత్మ హత్య చేసుకోమని ఇస్తారు.

నాలుగు విమానాలు రష్యా భూభాగం లోకి వెళతాయి. అయితే అనుకోకుండా ఒక విమానాన్ని రష్యా కనిపెట్టి కూల్చేస్తుంది. ఆ పైలెట్ ప్రాణాలతో దొరికిపోతాడు.

అతని పేరు పవర్. అతను దొరికే ముందే చనిపోయే వాడే. కానీ అనుకోకుండా కాయిన్ చేతికి అందక పోవడం తో విమానంతో సహా కింద పడి రష్యా వాళ్ళకి దొరికి పోతాడు. వాళ్ళు అతడికి పదేళ్ల శిక్ష విధించి, అమెరికా సైనిక రహస్యాలు చెప్పమని చిత్ర హింసలు పెడుతూ ఉంటారు.

ఇక ఈ రెండు కథలతో బాటూ మరో కథ ఉంటుంది.

అది “ప్రియర్” అనే ఒక ఎకనామిక్ స్టూడెంట్ ది. అతను అమెరికా పౌరుడు. కానీ జర్మనీ వెళ్ళి పశ్చిమ బెర్లిన్ లో ఒక యునివర్సిటీ లో చదువుతూ ఉంటాడు.

సరిగ్గా అప్పుడే జర్మనీ ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని రెండు భాగాలుగా విడి పోతుంది. వెస్ట్ జర్మనీ అమెరికా అధీనంలో ఉంటే, ఈస్ట్ జర్మనీ రష్యా అధీనంలో ఉంటుంది.

అమెరికా అధీనంలో ఉన్న వెస్ట్ జర్మనీ అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంటుంది. కానీ సోవియట్ యూనియన్ అధీనంలో ఉన్న ఈస్ట్ జర్మనీ లో అభివృద్ధి ఉండదు. దాంతో చాలామంది వెస్ట్ జర్మనీ కి వలస వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఆపడం కోసం సోవియట్ యూనియన్ బెర్లిన్ చుట్టూ 1961 ప్రాంతాల్లో ఒక గోడ కట్టింది. దాన్నే “బెర్లిన్ వాల్” అంటారు.

ఎవరైనా తమ పౌరులు ఆ గోడ దాటడం కోసం ప్రయత్నం చేసినా, లేదా అటువైపు వాళ్ళు ఇటువైపుకి వచ్చినా కాల్చి పడేయడం లేదా జైల్లో పెట్టడం జరుగుతుంది.

అనుకోకుండా ఒకసారి ఈ ప్రియర్ ఆ బెర్లిన్ వాల్ దాటి తమ అమెరికా భూభాగం నుండి రష్యా భూభాగం లోకి అడుగు పెడతాడు.

దాంతో అతన్ని రష్యా దళాలు గూఢచారి అని అరెస్ట్ చేస్తాయి.

ఇప్పుడు ఈ ప్రియర్ ని అడ్డం పెట్టుకొని అతన్ని వదలాలి అంటే రుడాల్ఫ్ ని వదలాలి అని బేరం పెడతారు. కానీ అమెరికా అందుకు ఒప్పుకోకుండా ఈ స్టూడెంట్ కన్నా కూడా ఆ పైలట్ ముఖ్యం అని భావించి పవర్ ని వదిలితే రుడాల్ఫ్ ని వదులుతామని చెప్పమని Donovin ని రాయబారం కోసం అనధికారికంగా బెర్లిన్ పంపిస్తుంది. అతనికి తోడుగా CIA నుండి ఒక ఏజెంట్ నీ పంపిస్తుంది.

బెర్లిన్ వెళ్ళే దాకా Donovin కి ప్రియర్ అనే కుర్రాడు కూడా అరెస్ట్ కాబడ్డాడు అనీ, అతన్ని రుడాల్ఫ్ కోసం బేరం పెట్టారు అనీ తెలియదు. అతను బెర్లిన్ వచ్చింది కేవలం రుడాల్ఫ్ ని రష్యాకు ఇచ్చేసి పవర్ ని అమెరికా కి తీసుకు రావడానికి.

కానీ బెర్లిన్ వచ్చాక అతనికి ప్రియర్ కోసం తెలిసి అతన్ని కూడా విడిపించాలి అని అనుకుంటాడు. పైగా బెర్లిన్ లో రైలు ప్రయాణం చేసే సమయంలో ఆ బెర్లిన్ వాల్ దాటుతున్న ఇద్దర్ని సైనికులు కాల్చి చంపేయడం కనిపిస్తుంది. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుంది.

దాంతో మీటింగ్ లో ఇద్దర్నీ, విడుదల చేయాలనీ, లేకపోతే రుడాల్ఫ్ ని వదలడం కుదరదు అనీ గట్టిగా చెప్తాడు. కానీ రష్యా అధికారులు ఒప్పుకోరు. ఇటు పక్క అమెరికా అధికారులు ఆ స్టూడెంట్ కుర్రాడు ఎలా పోయినా మనకి అనవసరం, మన పైలట్ కోసం మాత్రమే మాట్లాడమని ఒత్తిడి చేస్తూ ఉంటారు.

ఇక ఆఖరి ప్రయత్నంగా ఒక రష్యన్ అధికారిని కలుద్దాం అని అతని ఆఫిస్ కి వెళతాడు. కానీ అతన్ని అవమాన పరచాలని, బయట కూర్చోబెట్టి వెయిట్ చేయిస్తారు.

ఇక Donovin కి విషయం అర్థం అయ్యి అక్కడ ఉన్న రష్యన్ ఆఫీసర్ అసిస్టెంట్ ని పిలిచి ఇప్పటి దాకా రుడాల్ఫ్ తన దేశానికి వెళతా అని ఆశ ఉండటం తో తమకి రహస్యాలు ఏమీ చెప్పలేదు అనీ, కానీ ఒక్కసారి తాను విడుదల అవడం లేదని తెలిస్తే అతని మనసు మారి అన్ని సీక్రెట్స్ చెప్పేస్తే రష్యా పొజిషన్ ఏంటో ఆలోచించుకోమని, కాబట్టి రుడాల్ఫ్ ని విడుదల చేయాలి అంటే పవర్ నీ, ప్రియర్ ని ఇద్దర్నీ విడుదల చేయాలనీ, తన బాస్ కి చెప్పమని హోటల్ కి వచ్చేస్తాడు.

దాంతో రష్యా కాళ్ల బేరానికి వచ్చి రుడాల్ఫ్ ని అప్పగిస్తే ఇద్దర్నీ విడుదల చేస్తామనీ అయితే ఒకర్ని ఒక చోట, మరొకర్ని మరో చోట విడుదల చేస్తామని చెప్తారు

ఇక Donovin కి మరో దారి లేక ఏం జరిగితే అది జరిగింది సరే అని రుడాల్ఫ్ ని తీసుకుని ఈస్ట్ బెర్లిన్ కీ, వెస్ట్ బెర్లిన్ కీ మధ్యలో ఉన్న ఒక బ్రిడ్జి దగ్గరకి తీసుకుని వస్తారు.

అటు వైపు రష్యా కూడా అమెరికన్ పైలట్ అయిన పవర్ ని తీసుకుని బ్రిడ్జి దగ్గరికి వస్తుంది. ఇరువైపుల మనుషులు వచ్చిన వాళ్ళు సరైన వాళ్ళే అని కన్ఫర్మ్ చేసుకుంటారు.

ఈలోగా Donovin మరో బోర్డర్ దగ్గర రావాల్సిన అమెరికన్ స్టూడెంట్ ప్రియర్ వచ్చాడా లేదా అని అడుగుతాడు. CIA ఏజెంట్ ఫోన్ చేసి రాలేదు అని చెప్పి, ఎలాగా పవర్ వచ్చేశాడు కదా ఇక ప్రియర్ సంగతి వదిలెయ్యి అని చెప్తాడు.

Donovin ఆలోచనలో ఉండగా పక్కనే ఉన్న రుడాల్ఫ్ ఏం జరిగింది అని అడుగుతాడు. Donovin జరిగింది చెప్తాడు.

దాంతో ముందుకు వెళ్ళ బోతున్న రుడాల్ఫ్ ఆగిపోయి ప్రియర్ కూడా వచ్చాడు అని కన్ఫర్మ్ అయ్యే దాకా తాను రష్యా వైపు వెళ్ళను అని అక్కడే నిలబడతాడు.

ఒక పక్కన CIA ఏజెంట్ కంగారు పెడుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా అలాగే నిలబడి ఉన్న రుడాల్ఫ్ ని చూసి Donovin ఆనందంతో ఆశ్చర్య పోతాడు.

ఈలోగా ప్రియర్ ని అప్పగించారు అని మరో బోర్డర్ నుండి కాల్ వస్తుంది. అది విన్న రుడాల్ఫ్ Donovin కి థాంక్స్ చెప్పి నీకు ఒక గిఫ్ట్ పంపా అని చెప్పి రష్యా ఆక్రమిత జర్మనీ వైపు నడవడం మొదలు పెడతాడు.

అటువైపు నుండి పవర్ అమెరికా ఆక్రమిత జర్మనీ బోర్డర్ వైపు వస్తాడు.

అక్కడ నుండి అందరూ US వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ ఎక్కాక తనకి వచ్చిన గిఫ్ట్ చూస్తే అది రుడాల్ఫ్ తన చేతులతో గీసిన Donovin పెయింట్.

Donovin ఇంటికి వచ్చిన మర్నాడు అప్పటి దాకా రహస్యంగా జరిగిన ఈ సంఘటన ని అమెరికా అందరికీ చెప్తుంది. అంతే కాకుండా ఈ విషయంలో తెలివిగా వ్యవహరించి పవర్ నీ, ప్రియర్ ని ఇద్దర్నీ విడుదల చేయించిన Donovin కి థాంక్స్ చెప్తుంది.

దాంతో అప్పటి దాకా దేశ ద్రోహి లా అందరూ చూసిన Donovin హీరో అవుతాడు.

పేరుకి ఈ సినిమా పేరులో “స్పై” అని ఉన్నా ఎక్కడా గూఢచర్యం ఊసు లేకుండా ఈ సినిమా అంతా కూడా హ్యూమన్ ఎమోషన్స్ మీద ఆధార పడి నడుస్తుంది.

సినిమా మొదట్లో ఒక లాయర్ Donovin తో ఒకతను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి అయిదుగురి కి నష్టం కలిగించాడు కాబట్టి అయిదు లక్షలు పరిహారం ఇమ్మని అడుగుతాడు.

ఇన్సూరెన్స్ కంపెనీ తరపున వాదించే Donovin జరిగింది ఒకటే యాక్సిడెంట్ కాబట్టి తమ వైపు నుండి యాక్సిడెంట్ కి లక్ష మాత్రమే ఇస్తా అని వాదిస్తాడు.

అదే టెక్నిక్ ఫాలో అయ్యి సినిమా చివర్లో కూడా తమ వైపు నుండి రుడాల్ఫ్ ఒకరు మాత్రమే వెళ్లేలా వాదించి, అవతలి వైపు నుండి ప్రియర్ నీ, పవర్ నీ ఇద్దర్నీ తెస్తాడు.

2015 లో స్టీవెన్ స్పీల్ బర్గ్ డైరక్షన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టామ్ హ్యాంక్స్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

#HollywoodMovieReviews

error: Content is protected !!