Jubilee

సినిమా తీయడం అనేది కేవలం “స్టూడియోల” చేతుల్లో మాత్రమే ఉన్నప్పటి రోజుల్లో జరిగే కథ ఇది.

ఇప్పుడంటే పారితోషికాలు కోట్లలో, అది కూడా కొన్ని సార్లు గంటల్లెక్కన వసూలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి కానీ, కొన్ని దశాబ్దాల కిందట స్టార్ హీరోల్ని కూడా నెల జీతానికి, అది కూడా అయిదు వందలు, వెయ్యి రూపాయల జీతాలకి పెట్టుకుని సినిమాలు తీసేవిట.

అలా ఒక స్టూడియో ఒక నటుడ్ని తమ స్టూడియో ద్వారా “హీరోగా పరిచయం చేసి, అతడితో అగ్రిమెంట్ చేసుకుని, ఒక అయిదేళ్ల పాటు” తమ చెప్పు చేతల్లో పెట్టుకుని తక్కువ లేదా కంట్రోల్డ్ బడ్జెట్ లో సినిమాలు తీసేవిట.

అగ్రిమెంట్ కాలం పూర్తయ్యే సరికి అదృష్టం కొద్దీ అతడికి స్టార్ హోదా వచ్చేస్తే బయట ఎలాగా సినిమాలు ఉంటాయి. ఈలోగా స్టూడియో మరో నటుడ్ని వెతుక్కుంటుందన్నమాట. ఒకవేళ రాకపోతే అప్పటి దాకా సంపాదించిన డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి.

ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే 1947 లో స్వతంత్రం రావడానికి ఒక రెండు మూడు నెలల ముందు స్టార్ట్ అవుతుంది.

“రాయ్ టాకీస్” అనే స్టూడియో ఒక కొత్త నటుడ్ని స్క్రీన్ టెస్ట్ చేసి, ఒకే చేసి, అయిదేళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకుని, అతడికి “మదన్ కుమార్” అని పేరు మార్చి తమ స్టూడియో ద్వారా మొదటి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది.

అంతా బానే ఉంది అనుకుంటూన్నప్పుడు ఆ స్టూడియో ఓనర్ పెళ్ళాం, హీరోయిన్ అయిన “సుమిత్ర” ఆ నటుడి తో ప్రేమలో పడుతుంది.

ఇద్దరూ లక్నో లో కలిసి అక్కడ నుండి కరాచీ పారిపోదాం అనుకుంటారు. (అప్పటికింకా పాకిస్తాన్ రాలేదు.)

ఆ విషయం ఆ స్టూడియో ఓనర్ “రాయ్” కి తెలిసి పెళ్ళాం పోతే మళ్లీ వస్తుంది. కానీ అలాంటి స్టార్ అయ్యే లక్షణాలున్న నటుడు మళ్ళీ దొరకడు అని తన నమ్మిన బంటు అయిన “బినోద్” ను లక్నో పంపిస్తాడు.

అయితే అనుకోకుండా అక్కడ జరిగిన అల్లర్ల వల్ల జరిగిన ఒక యాక్సిడెంట్ లో “ఈ కాబోయే స్టార్ మదన్ కుమార్” చనిపోతాడు.

దాంతో అనుకోని పరిస్థితుల్లో ఈ స్టూడియో ఓనర్ రాయ్ తన నమ్మిన బంటు “బినోద్” ని “మదన్ కుమార్” గా మార్చి జనాల్లోకి వదులుతాడు.

ఇక అక్కడ నుండి ఒక పది ఎపిసోడ్స్ కదలకుండా కూర్చోబెడుతుంది.

దేశ విభజన సామాన్య ప్రజల్ని ఎలా ప్రభావితం చేసిందో, “శరణార్థుల క్యాంప్” ల్లో ఎలా జీవించే వారో చూపించారు.

అసలు ఈ స్టూడియోలు నటుల కెరీర్స్, జీవితాలను ఎలా మారుస్తాయి.?

నటీ నటుల మధ్య ఎఫైర్స్ ఉంటే సినిమాలకి ఎలా వాడుకుంటాయి.?

అసలు కొన్ని సినిమాలకి ఇక్కడ హాల్స్ ఖాళీగా ఉన్నా కూడా “ఫారిన్ లో” మాత్రం కోట్ల రూపాయల కలెక్షన్స్ ఎలా వస్తాయి.?

ఒక సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత అప్పు చేసి మళ్ళీ ఇంకో సినిమా తీయగలడు, స్టార్ హీరో అదే నిర్మాతకి పాపం అని ఇంకో సినిమా చేస్తాడు. టెక్నీషియన్ కి వేరే సినిమాలో పని దొరుకుతుంది.

కానీ ఆ సినిమా డైరెక్టర్ మాత్రం కెరీర్ ముగించుకుని ఇంట్లో కూర్చోవాలి. ఒకవేళ అదే మొదటి సినిమా అయితే…!

ఒక్క సినిమా ఫ్లాప్ ఒక డైరెక్టర్ జీవితాన్ని ఎలా మారుస్తుందో, ఒక సినిమా హిట్ దర్శకుడి రేంజ్ ను ఎక్కడ దాకా తీసుకు పోతుందో…?

అప్పటి దాకా మామూలుగా ఉన్న నటులు ఒకసారి స్టార్ అయితే ఎలా బిహేవ్ చేస్తారో ఇలాంటివన్నీ అప్పటి వాతావరణంలో (అంటే 1947 – 1960 మధ్య కాలంలో) చూపించారు.

ముఖ్యంగా అప్పటి వాతావరణం చాలా బాగా క్రియేట్ చేశారు.

అన్ని వెబ్ సిరీస్ లాగే దీనిలో కూడా “బూతులు” విచ్చల విడిగా వినబడుతూనే ఉంటాయ్.

అది తెలుగు డబ్బింగ్ రైటర్స్ ప్రతిభా లేక హిందీ లో కూడా అలాగే ఉన్నాయా అనేది చూడాలి.

మొత్తానికి పది ఎపిసోడ్స్ కలిపి ఒక అయిదారు గంటల పాటు కూర్చో బెట్టడం ఖాయం.

నటీ నటుల విషయానికి వస్తే “టీవీ రాముడు అరుణ్ గోవిల్, అదితి రావు హైదరి, శ్వేతా బసు ప్రసాద్” తప్ప ఎవరూ తెలుగు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. నేను కూడా తెలుగు వాడినే కాబట్టి నాకు కూడా తెలియదు. కాబట్టి చెప్పడం లేదు.

నిలోఫర్ పాత్ర చూసిన వెంటనే “ఎక్కడో చూసిన జ్ఞాపకం” అని పాట గుర్తొచ్చింది. దాంతో ఆ అమ్మాయి ఎవరా అని నెట్ లో వెతికా.

ఆ అమ్మాయి పేరు “వామికా గబ్బి” సుధీర్ బాబు 2015 లో హీరోగా చేసిన “భలే మంచి రోజు” అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఈ సినిమా తీసిన దర్శకుడు “విక్రమాదిత్య మొత్వానీ” నిర్మాతగా ఇంతకు ముందు

క్వీన్ (కంగనా రనౌత్),

Udta Punjab (అప్పట్లో పెంట అయింది. పంజాబ్ అంటే డ్రగ్స్ అని చూపిస్తారా అని),

Hunterr (శ్రీనివాస్ అవసరాల హీరోగా బాబు బాగా బిజీ ఒరిజినల్)

లాంటి సూపర్ హిట్స్ తీశాడు.

అలాగే దర్శకుడి గా తీసిన వాటిలో సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్ “Lootera, Trapped” మాత్రమే చెప్పుకోదగ్గవి.

Lootera సినిమా O Henry రాసిన “The Last Leaf” ఆధారంగా తీశాడు. ఆ విషయం అందరికి తెలిసిందే. కానీ ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు అనుకుంటా.

కానీ ఈ “Trapped” ఒక ప్రయోగాత్మక చిత్రం.

Under construction లో ఒక బిల్డింగ్ లో ఒక మనిషి ఒక పది రోజుల పాటు ఇరుక్కు పోతే ఎలా ఉంటుందో బాగా చూపించాడు. పర్లేదు. బానే ఉంటుంది. రాజ్ కుమార్ రావు హీరో.

మొత్తానికి ఒక మంచి వెబ్ సిరీస్ అని చెప్పచ్చు.

Available in Prime.

AditiRaoHydari, #AparshaktiKhurana, #SidhantGupta, #WamiqaGabbi, #RamKapoor, #ArunGovil, #WebSeries, #perodicDrama

error: Content is protected !!