Room

ఈ సినిమా కోసం రాసేటప్పుడు ఏదైనా ఇంట్రో లా రాద్దామని దాదాపు పది పాయింట్స్ రాసి మళ్ళీ డిలీట్ చేసేసాను. కారణం ఈ సినిమాలో చూపించిన విషయంలో దేన్ని హైలైట్ చెయ్యాలో అర్థం కాలేదు. చూసిన తర్వాత కొంతసేపు బుర్రకి పని చెప్పబుద్ధి కాలేదు.

ఇప్పుడు సరదాగా కొన్ని విషయాలు గుర్తు చేస్తా. మీ ఫ్రెండ్ లిస్ట్ లో దాదాపు 1000 మంది ఉండచ్చు, కానీ మీకు కేవలం మహా అయితే ఒక యాభై అరవై మంది పోస్టులు (ఆ నాలుగు గోడలు) మాత్రమే రెగ్యులర్ గా కనబడతాయి. మిగతా వారి పోస్టులు మీరెప్పుడూ కనీసం చూసయినా ఉండకపోవచ్చు.

మరి మీ లిస్ట్ లో ఉన్న మిగతా వారి పోస్టులు (మిగతా ప్రపంచం) మీకు కనబడకుండా చేస్తున్నది ఎవరు..?

ఏదైనా గ్రూప్ లో వేలమంది సభ్యులు ఉండచ్చు కానీ మీకు మాత్రం ఒక పది లేదా పదిహేను మంది పోస్టులు మాత్రమే ముందు కనబడతాయి. మరి మిగతా వందల మంది సభ్యుల సంగతి ఏంటి.?

సరే ఇక సినిమాలోకి వద్దాం.!

సినిమా మొదలయ్యే సరికి 24 ఏళ్ల “జాయ్” అనే ఒక స్త్రీని, ఆమె అయిదేళ్ల బిడ్డ “జాక్” ని “ఓల్డ్ నిక్” అనే అతను ఒక రూం లో బంధించి ఉంచుతాడు. రూం అంటే అది నిజంగా ఒక కంటైనర్ లాంటి ఒక డబ్బా మాత్రమే. ఆ కంటైనర్ డబ్బా ఒక పాడుబడిన ఇంటి వెనకాల ఉంటుంది. బంధించడం అంటే తాళ్లతో కట్టి పడేయడం లా కాదు. ఆ రూం లో నుండి బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాడు.

వాళ్ళకు కావాల్సిన సామాన్లు అన్నీ తనే బయట నుండి తెచ్చి ఇస్తూ ఉంటాడు. కరెంట్, వాటర్, గ్యాస్, టీవీ. కాకపోతే బయట ఏం జరిగేది వీళ్ళకు తెలుస్తూ ఉంటుంది కానీ వీళ్ళకు బయట వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండదన్నమాట.

ఆ రూం లోనే ఒక మూల వంట కోసం సెటప్, బాత్ టబ్, టీవీ, మంచం ఉంటాయ్. ఆ రూం కి పైన ఉన్న ఒక చిన్న ద్వారం గుండా కొంచెం ఎండ వస్తుంది అంతే. ఆ రూం లోనే ఒక చిన్న దండెం కట్టుకుని అక్కడే బట్టలు అవీ ఆరేసుకుంటూ ఉంటుంది జాయ్.

జాయ్ అలా బంధింప బడి దాదాపు ఏడేళ్లు అవుతుంది. అంటే ఆమె బిడ్డ జాక్ పుట్టడానికి దాదాపు రెండేళ్ల నుండీ ఆమె ఆ గదిలో బంధింపబడి ఉంటుంది. జాక్ పుట్టడం కూడా ఆ గదిలోనే పుడతాడు. ఆ గదిలోనే పెరుగుతాడు. అతడికి బయట ఇంకో ప్రపంచం ఉందని కూడా తెలియదు. ఆ నాలుగు గోడలే అతనికి ప్రపంచం. టివి లో కనబడే వన్నీ “ఫేక్” అనుకుని ఉంటూ ఉంటాడు. ఆమె అక్కడ నుండి తప్పించుకుని పోవడానికి ఒకసారి ప్రయత్నించి ఫెయిల్ అయ్యి అక్కడే ఉండిపోతుంది. ఇక అప్పటినుండీ తప్పించుకోడానికి ఏం ప్రయత్నం చెయ్యదు. కానీ ఒకసారి జరిగిన గొడవ వల్ల ఇక అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోడానికి నిశ్చయించుకుని కనీసం తన కొడుకుని అయినా తప్పిద్దామని చనిపోయాడు అని అబద్ధం చెప్పి ఒక కార్పెట్ లో చుట్టి మూట కట్టి బయట ఎక్కడైనా పాతి పెట్టమని అడుగుతుంది.

తప్పించుకున్నాడా లేదా అనే విషయం పక్కన పెడితే సినిమా చూస్తున్నంత సేపూ మనకి కూడా అలాంటి రూం లోనే బ్రతుకుతున్న ఫీలింగ్ వస్తుంది. “ట్రూ మాన్ షో” సినిమాలో హీరో తప్ప మిగతా అంతా సెట్టింగ్ అన్న విషయం అతనికి తప్ప ప్రపంచం అంతా తెల్సు. కానీ అతను ముప్ఫై యేళ్లు ఆ సెట్ లోనే ఆనందంగా బ్రతికిస్తాడు. ఒకసారి నిజం తెలిశాక బయటకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు.

దీంట్లో అయితే ఆ అయిదేళ్ల కుర్రాడు “జాక్” ఆ నాలుగ్గోడలవతల ఇంకో ప్రపంచం ఉంది అని నమ్మడు. ఈ ప్రపంచం ఇంతే, దాంట్లో తను, అమ్మ, ఓల్డ్ నిక్ మాత్రమే ఉన్నారు అని నమ్ముతాడు. ఓల్డ్ నిక్ మేజిక్ చేసి కావాల్సిన వస్తువులు తెస్తున్నాడు అనుకుంటాడు. కానీ అవతల ఇంకో ప్రపంచం ఉంది అని అతడిని నమ్మించడానికి అతని తల్లి చాలా కష్టపడాల్సి వస్తుంది.

కొన్ని కొన్ని సార్లు మనం కూడా అలాంటి ఒక చిన్న బౌండరీ లోనే బ్రతకడానికి అలవాటు పడిపోయాం అనిపిస్తుంది. అది చిన్న పల్లెటూరు వాళ్ళకి హైదరాబాద్ కి రావడం కావచ్చు లేదా హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ వదిలి వేరే రాష్ట్రం వెళ్ళడానికి ఇష్టపడక పోవటం కావచ్చు లేదా మన దేశం చాల్లే అనే భావం కావచ్చు. చాలామంది ఉన్న ప్లేస్ నుండి కదలడానికి ఇష్టపడరు. ఇది చాల్లే అనే మనస్థత్వం.

కొంతమందికి ఎన్ని దేశాలు తిరిగినా కూడా సరిపోకపోవచ్చు. అందుకే ఎలాన్ మస్క్ ఈ ప్రపంచం సరిపోక ఏకంగా మార్స్ మీద ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

ఇది మొదట్లో థ్రిల్లర్ లా మొదలైనా కూడా చివరకు వచ్చేసరికి మానవ సంబంధాల దగ్గర, మనుషుల మనస్తత్వాల దగ్గర తేలి సెంటిమెంట్ సీన్ తో ముగుస్తుంది.

మొదట్లో రాసిన ఫేస్ బుక్ గోల కి సమాధానం ఒక్కసారి ఆలోచిస్తే మనం ఆ జాక్ లాగా, జుకర్ బర్గ్ ఓల్డ్ నిక్ లాగా అనిపిస్తాడు.మనం ఎప్పుడూ కూడా “ఫేస్ బుక్ ఎవరిది (పోస్టులు) చూపిస్తే అదే చూడ్డానికి” అలవాటు పడ్డాం తప్ప లిస్ట్ తవ్వి మిగతా జనాల కోసం తెలుసుకోడానికి ట్రై చెయ్యం. ఆ జనాలకే మనం అలవాటు పడుతున్నాం. ఆ నలుగురి మధ్యే తిరుగుతున్నాం, కామెంట్స్ పెడుతున్నాం, లైక్స్ కొడుతున్నాం.

అంటే ఆ కాస్త నలుగురినీ మెచ్చుకోవడం కూడా దాదాపు “ఫేస్ బుక్” లోనే చేస్తున్నాం.

అలాగే ఈ సినిమాలో జాక్ కూడా తనను రూం లో బందీగా చేసిన ఓల్డ్ నిక్ టివి లో ఏం చూపిస్తే అదే చూడ్డానికి ఇష్టపడతాడు. ఆ రూం లోనే ప్రపంచం ఉందనే భ్రమలో ఉంటాడు. బయటకు వెళ్లడానికి ఇష్ట పడడు.

జాక్ కి బయట ప్రపంచం చూపించడానికి తల్లి ఎంతో నచ్చచెప్పి, కష్టపడాల్సి వస్తుంది. అలాగే మీకెప్పుడైనా “ఒరేయ్! ఆ ఫోన్ పక్కనడేసి అన్నం తిను!” అనే పిలుపు ఎప్పుడైనా వినబడితే మీరు కూడా “జాక్” లాగా బందీ అయ్యారేమో ఆలోచించుకోండి.