రోప్..!
ప్రపంచ సినిమా చరిత్రలో సస్పెన్స్ సినిమాలు అంటే గుర్తొచ్చే పేరు “అల్ఫ్రెడ్ హిచ్ కాక్”. ఆయన 1948 లో దర్శకత్వం వహించిన సినిమా ఈ “రోప్”..!
హైదరాబాద్ లో లాక్ డౌన్ సందర్భంగా ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి, ఒంటరిగా ఫ్లాట్ లో ఉండలేక తన ఫ్రెండ్ ను తన ఫ్లాట్ కి వచెయ్యమన్నాడు. కాకపోతే ఆ అపార్ట్మెంట్ లో కరోనా కారణంగా చుట్టాలను, కొత్త వాళ్ళను ఎవరినీ రానివ్వడం లేదు. సో అతను ఒక ప్లాన్ చేసి ఒక పెద్ద సూట్ కేస్ లో అతని ఫ్రెండ్ ను కుక్కి జాగ్రత్తగా దాన్ని లాక్కుంటూ వచ్చి లిఫ్ట్ లోపలకు వెళ్ళెలోగా వాచ్మెన్ కి అనుమానం వచ్చి చెక్ చెయ్యగా అతని ఫ్రెండ్ ఆ బ్యాగ్ లో ఉన్నాడు. ఇద్దర్నీ కలిపి పోలీసులకు అప్పగించారు..! ఇది నిజంగా జరిగింది..!
ఒకవేళ వాచ్ మన్ చూడకుండా మీరు సూట్ కేసు ఫ్లాట్ దాకా తీసుకెళ్ళారు. లిఫ్ట్ లో అతని ఎదురు ఫ్లాట్ అంకుల్ కూడా ఎక్కి ఎంటి బాబు ఆ సూట్ కేసు అని అడిగాడు. వెంటనే మీరు చాలా మామూలుగా “ఏమీ లేదు అంకుల్ జస్ట్ బట్టలు. అన్నీ ఒకేసారి ఇస్త్రీ కి ఇచ్చి తెస్తున్నా” అని చెప్పారు.
సరిగ్గా ఫ్లాట్ దగ్గరకు రాగానే అనుకోకుండా ఫ్లాట్ “కీ” ఎక్కడో పడి పోయింది అని గ్రహించారు..! ఎదురుగా ఉన్న అంకుల్ ఏం పర్లేదు ఆ సూట్కేస్ మా ఫ్లాట్ లో పెట్టేసి వెళ్ళి కీ వెతుక్కో అన్నాడు..! అప్పుడు మీ పరిస్ఠితి ఏంటి..!
సూట్ కేసు వదిలేస్తారా, లేక “పర్లేదండి” అని పట్టుకెళ్లగలరా..! ఒకవేళ కూడా పట్టుకెలితే ఇప్పుడే కదా జస్ట్ ఇస్త్రీ బట్టలు అన్నాడు అంతలోనే ఎందుకు పట్టుకుపోతున్నడు అని అనుమానం వస్తె..! పోనీ వదిలేసి వెళ్తే, ఎవరైనా ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే..! ఆ సూట్ కేసు లో ఉన్న వ్యక్తి కదిలితే..!
ఇలాంటి ఒక పరిస్థితిలో ఇరుక్కున్న ఒక హంతకుడు ఎలా పట్టుబట్టాడు అన్నదే ఈ “రోప్”.
కథ విషయానికి వస్తె.
ఒక వ్యక్తి ఒక చక్కని సాయంత్రం వేళ ఫ్రెండ్స్ అందరినీ పార్టీ ఇస్తా అని పిలిచాడు. వాళ్ళల్లో అందరికన్నా ముందు వచ్చిన ఒక స్నేహితుణ్ణి ఇంకో స్నేహితుడి ముందే సరదాగా మాటల్లో పెట్టిన మందు పోసి “రోప్” (తాడు) తో పీక చుట్టూ చుట్టి చంపేసి ఆ శవాన్ని ఐస్ క్రీం లు పెట్టే ఫ్రిడ్జ్ లాంటి ఒక పెద్ద చెక్క పెట్టె లో పెట్టేసి, ఆ పెట్టె మీద క్యాండిల్స్, బుక్స్ తో అలంకరణ చేసి పార్టీ అయిన తర్వాత మూట కట్టి బయట పడెద్దాం అని ప్లాన్ చేసి చంపేశాడు.
సరిగ్గా అదే పార్టీకి ఆ చనిపోయిన వ్యక్తి తండ్రి, అతని ఆంట్, ఇంకా అతనికి కాబోయే భార్య అందరూ వస్తారు..! వీళ్ళు చాలరు అన్నట్టు ప్రతీ విషయాన్ని అనుమానించే అలవాటు ఉన్న “హీరో” కూడా వస్తాడు.
వీళ్ళు అందరూ ఎప్పుడూ సమయానికి వచ్చే ఆ వ్యక్తి ఎందుకు ఇంకా రాలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వీళ్ళ మాటలు హత్యలు, నేరాలు మీదకు మళ్ళుతుంది.
చివరకు ఎలా దొరికాడు అన్నదే సినిమా.
సాధారణంగా మర్డర్ మిస్టరీ లు అంటే “ఎవరు, ఎందుకు, ఎలా” చంపారు అని ఉంటాయ్. ఒక శవం లేదా దాని తాలూకు వాహనం బట్టలు ఇలాంటివి దొరకడం, డిటెక్టివ్ “ఎవరు” చంపారో, ఎలా చంపారో, ఎందుకు చంపారో అని ఆఖర్లో చూపిస్తారు.
పైన కథలో ఓపెనింగ్ షాట్ లోనే “హత్య” ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు ఇవన్నీ చుపించేస్తాడు. కాబట్టి అదేం పెద్ద సస్పెన్స్ కాదు. కానీ ఈ సినిమాలో “ఎలా” దొరుకుతాడు అనేది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
కనీసం శవం కూడా చూడకుండా ఆ పార్టీకి వచ్చిన హీరోకి ఆ అనుమానం ఎందుకు వచ్చింది అనేది చూస్తేనే బెటర్.
సినిమా అంతా “సింగిల్” లొకేషన్, అంటే ఏదో పెద్ద ఫిల్మ్ సిటీ అనుకున్నారు. కాదండీ బాబూ అదొక 3 గదుల పొడుగ్గా ఉండే పోర్షన్.
ఈ సినిమాకు ఉన్న ఇంకో ప్రత్యేకత సినిమా అంతా కూడా కేవలం పది అంటే “పదే లాంగ్ షాట్” లో తీసేసారు. ఒక్కో షాట్ కనీసం పది నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత అయినా కెమెరాలో ఫిల్మ్ మార్చాలి కాబట్టి “కట్” చెప్పి ఉంటాడు..! ఒక రకంగా చెప్పాలంటే సినిమా అంతా “సింగిల్ షాట్” లో తీసినట్టే లెక్క.
ఉదాహరణకు కెమెరాలలో “ఫిల్మ్” అయిపోయే సమయానికి ఆ షాట్ ని ఒక బ్లాక్ “కోటు” మీదకు జూమ్ చేసి రీల్ మార్చాక మళ్ళీ ఆ బ్లాక్ కోటు మీదనుండి షాట్ స్టార్ట్ అవుతుంది..!
సినిమా మధ్యలో ఒక ఆర్టిస్ట్ చేతిలో పొరపాటున వైన్ గ్లాస్ పగిలిపోయిందిట. దానివల్ల ఆ ఆర్టిస్టు కి చెయ్యి తెగి రక్తం కూడా వస్తుంది. అయినా కూడా షాట్ కట్ చెయ్యకుండా అలాగే కంటిన్యూ చేశాడు. ఇదంతా సినిమాలో ఉంటుంది..!
ఈ గంటా ఇరవై నిమిషాల సినిమాలో హీరో ఎంట్రన్స్ దాదాపు అరగంట తర్వాత వస్తుంది.
ప్రత్యేకంగా ఆ సినిమా రన్ టైమ్ చెప్పడానికి కారణం “రియల్ టైమ్” స్టోరీ గా తియ్యడమే. ఈ రియల్ టైం అంటే మీరు అన్నం తినడాన్ని సినిమాలో చూపించాలి అంటే “మీరు బయట అరగంట సేపు తింటే సినిమాలో కూడా అరగంట సేపూ తినడం చూపిస్తారు.
అంటే మామూలుగా అలాంటి పార్టీలు ఒక గంటన్నర లో ముగుస్తాయి. కాబట్టి పార్టీ మొదలయినప్పటి నుండి చివర వరకు ఏం జరిగింది అనేదాన్ని గంటన్నర లోగా చూపించాడు..!
ఈ సినిమా కోసం ఔట్ డోర్ లో ఒక రెండు నిమిషాల ట్రైలర్ ని కట్ చేశారట. కానీ సినిమా కథ మొత్తం ఇండోర్ లో నే జరిగినట్లు చూపించాలని దర్శకుడు అనుకోవడం వల్ల ఆ సన్నివేశాలు తీసేసారు. కానీ ట్రైలర్ లో మాత్రం ఉండిపోయాయి.
కింద పెట్టిన ఫోటోలో ఆ కొవ్వొత్తులు పెట్టిన పెట్టె లోనే శవం ఉంటుంది.
ఇది Alfred Hitchcock మొదటి రంగుల సినిమా..!