Enemy At the Gages

అప్పుడప్పుడు మన సినిమాల్లో హీరో కోసం బిల్డప్ ఇచ్చేటప్పుడు “చావు నీ కళ్ళ ముందే నిలబడినట్టు ఉంటుంది” లేదా “మృత్యువు నీ ముంగిట నిలబడినట్టు ఉంటుంది” అంటూ ఉంటారు కదా. 

ఈ సినిమా టైటిల్ కి అర్థం కూడా అదే. 

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అంటే 1942 వ సంవత్సరంలో జర్మన్ సేనలు రష్యా లోని “స్టాలిన్ గ్రాడ్” అనే ఒక ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాయి. ఆ ప్రాంతం కానీ శత్రువు చేతికి దొరికితే ఇక రష్యా పని అయిపోయినట్టే. 

సరిగ్గా అలా పీకల మీదకి వచ్చాక ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం రష్యా తమ సేనని ఆ ప్రాంతానికి పంపుతుంది. ఎలా పంపుతుంది అంటే వంద మంది సైనికులు ఉంటే వాళ్ళలో 50 మందికి మాత్రమే రైఫిల్స్ ఉంటాయి. మిగతా యాభై మందికి  కేవలం బులెట్స్ మాత్రమే ఇస్తారు. ఒక వేళ  ఆ  రైఫిల్ ఉన్న వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ రైఫిల్ తీసుకుని వీళ్ళు యుద్ధం చేయాలి. 

ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే శత్రువు కన్నా ముందే సొంత సేనల చేతిలో చావాలి. ఎలాగైనా చావు తప్పదు. అంటే ఒక రకంగా ఆత్మాహుతి దళం అన్నమాట.

అలాంటి పరిస్థితుల్లో యుద్ధ రంగం లోకి కేవలం చేతిలో ఒక అయిదు బుల్లెట్స్ తో “వసిలి జైత్సేవ్” అనే ఒక సైనికుడు అడుగు పెడతాడు. ఇతని పని చంపడం లేదా చావడం అంతే. కూడా వచ్చిన సైనికుల్లో ఒక్కొక్కళ్ళు చనిపోతూ ఉంటారు. కొన ప్రాణాలతో ఉన్న వాళ్ళని జర్మన్ సైనికులు కాల్చి పడేస్తూ ఉంటారు. 

ఇతను తప్పించుకోవడం కోసం అక్కడ పడి ఉన్నశవాల కింద దాక్కుంటాడు. అయితే ఇతనితో పాటూ ఆ శవాల కింద “దానిలోవ్” అనే ఒక అధికారి కూడా దాక్కుని ఉంటాడు. ఆ దానిలోవ్ “కమిషన్ ర్యాంక్” అధికారి కాబట్టి అతని దగ్గర రైఫిల్ ఉంటుంది. కానీ కాల్చే పరిస్థితుల్లో ఉండడు. గాయపడి ఓపిక లేక అలా శవాల కింద దాక్కుని ఉంటాడు.

వసిలి ని చూసిన దానిలోవ్ వేరే దారి లేక తన రైఫిల్ అతనికి ఇస్తాడు. వసిలి ఆ రైఫిల్ తీసుకుని తన దగ్గర ఉన్న అయిదు బుల్లెట్స్ తో దూరంగా ఉన్న నలుగురు జర్మన్ సైనికుల్ని, ఒక ముఖ్య అధికారిని కాల్చి పడేస్తాడు. అది చూసిన దానిలోవ్ కి వసిలి టాలెంట్ అర్థం అవుతుంది. 

ఇద్దరూ మెల్లిగా సైనిక శిబిరానికి వచ్చేస్తారు. 

ఆవేళ వార్ లో జర్మన్ ది పై చేయిగా ఉంటుంది. మెల్లిగా రష్యన్ ల నమ్మకం సన్నగిల్లుతూ ఉంటుంది. ఒక అధికారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు.

దాంతో ఆవేళ రాత్రి రష్యన్ సైన్యాధికారి “నికితా కృశ్చెవ్” యుద్ధం లో జర్మన్ల మీద పై చేయి సాధించడానికి ఏమైనా సలహాలు ఇమ్మని తన అనుచర అధికారులని అడుగుతాడు. అందరూ ఏవేవో సలహాలు ఇస్తారు. కానీ అవేమి కృశ్చెవ్ కి నచ్చవ్. అక్కడే ఉన్న “దానిలోవ్” ఇలాంటి సమయంలో తమని కాపాడటానికి ఒక “హీరో” ఉన్నాడని రష్యన్ సైనికులకి, జనాలకి నమ్మకం కలిగిస్తే వాళ్ళకి కొద్దిగా ధైర్యం వస్తుందని సలహా ఇస్తాడు.

ఎలా అని అడిగిన కృశ్చెవ్ తో అయిదు బుల్లెట్స్ తో అయిదుగుర్ని కేవలం రెండు నిమిషాల్లో చంపేసిన  “వసిలి” కోసం చెప్పి, అతన్ని స్నైపర్ టీం లోకి తీసుకుని, అతన్ని వార్ హీరోగా ప్రోజెక్ట్ చేస్తూ, రోజూ వసిలి షూట్ చేసి చంపేసిన జర్మన్ అధికారుల లిస్టు వేస్తూ న్యూస్ పేపర్స్ లో  ఆర్టికల్స్ రాయడం మొదలు పెడతారు. దాంతో రష్యన్ లకి మెల్లిగా తాము యుద్దం లో పై చేయి సాధించగలం అని నమ్మకం కలగడం మొదలవుతుంది. 

మెల్లిగా వసిలి కి జనాల్లో, రష్యన్ సైనికుల్లో ఒక హీరో ఇమేజ్ వస్తుంది. 

ఈ వసిలి, దానిలోవ్ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు.

ఇక్కడే లోకల్ గా ఉన్న “టానియా” అనే ఒకమ్మాయి తో ఇద్దరికీ ముక్కోణపు ప్రేమ కథ మొదలవుతుంది. ఈ టానియా ఒక లోకల్ మిలిటరీ గ్రూప్ కి చెందిన అమ్మాయి. వీళ్ళు రష్యన్ సైనికులకి యుద్ధం లో సాయ పడుతూ ఉంటారు. 

దానిలోవ్ టానియా పట్ల అట్రాక్ట్ అవుతాడు. కానీ ఆమె వసిలి ని ఇష్టపడుతూ ఉంటుంది. ఆ విషయం తెలిసిన దానిలోవ్ కి మెల్లిగా వసిలి పట్ల అసూయ మొదలవుతుంది. అతని గురించి పై అధికారులకి చెడుగా చెప్పడం మొదలు పెడతాడు. 

ఇలా ఈ ముక్కోణపు ప్రేమకథ నడుస్తూ ఉండగా, వసిలి షూటింగ్ స్కిల్స్ వల్ల, అతని స్నైపర్ టీం వల్ల జర్మన్ సైనికులు చాలామంది చనిపోతూ ఉంటారు. అందువల్ల జర్మనీ “మేజర్ కొనిగ్” అనే ఒక షార్ప్ షూటర్ ను రంగంలోకి దింపుతుంది. అతని పని వసిలి ని, అతని టీం ని చంపేసి రష్యన్ ల లో ఉన్న ధైర్యాన్ని చంపేయడమే. 

స్నైపర్ టీం అంటే వందల మంది ఏమీ ఉండరు. ఒక ముగ్గురు నలుగురు ఉంటారు. కానీ వాళ్ళే వంద మందికి సమానం. కొనిగ్ వసిలి స్నైపర్ టీం ని మొత్తం లేపెస్తాడు. జర్మన్లు ఆ విషయం  బాగా ప్రచారం చేస్తారు. 

వసిలి కి కొనిగ్ ని ఎలాగైనా చంపాలి అనే పంతం పెరుగుతుంది. 

అటువైపు కొనిగ్ కి కూడా వసిలి ని చంపలేదనే అసంతృప్తి ఉండిపోతుంది.

ఒకవేళ వసిలి ఆ షార్ప్ షూటర్ చేతిలో చనిపోతే టానియా దానిలోవ్ కి దక్కుతుంది. కానీ వసిలి చనిపోతే రష్యా ఆ యుద్ధంలో ఓడిపోయే అవకాశం ఎక్కువ..

ఇవన్నీ తెలిసినా కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో టానియా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల క్రితమే దానిలోవ్ ఆమెని వార్ ఫీల్డ్ నుండి తీసేసి “నీకు జర్మన్ భాష తెలుసు కాబట్టి వాళ్ళ సీక్రెట్ మేసేజ్ లు డీకోడ్ చెయ్యి” అని ఆఫీస్ వర్క్ లోకి వసిలికి దూరంగా పంపేస్తాడు.

ఇద్దరు షార్ప్ షూటర్ లలో ఎవరు ఎవరి మీద పై చేయి సాధించారు అనేది మిగతా సినిమా.  ఈ సినిమా అంతా కూడా ఇద్దరు షార్ప్ షూటర్ ల మధ్య నడుస్తూ ఉంటుంది. బహుశా డ్రామా కోసం హీరోయిన్ తో ఆ ముక్కోణపు ప్రేమ కథ పెట్టి ఉంటారు.

ప్రేమకథ అనే టాపిక్ వదిలేస్తే “వసిలి జైత్సేవ్” అనే షార్ప్ షూటర్ నిజంగానే రెండో ప్రపంచ యుద్ధం లో ఉన్నాడు.దాదాపు 250 మందిని చంపాడు. రెండో ప్రపంచ యుద్ధం లో షార్ప్ షూటర్ కాక ముందు నావీ లో పని చేశాడు.

ఈ సినిమా కోసం దాదాపు కొన్ని వందల ఎకరాల్లో ధ్వంసం అయిపోయిన ఆ “స్టాలిన్ గ్రాడ్” సిటీ సెట్ వేసారు.

అసలు ఆ సిటీ ఎందుకంత ముఖ్యం అంటే రష్యాకి ఆయిల్ ఈ మార్గం ద్వారానే రావాలి. ఒకవేళ అది మూసేస్తే ఇక ఇంధన సరఫరా ఆగిపోయినట్టే. పైగా అదో ఇండస్ట్రీయల్ హబ్. అంటే ఒకరకంగా ఆర్థికంగా దెబ్బ పడుతుంది.

అన్నిటికన్నా ముఖ్యంగా ఆ నగరం పేరు రష్యా నాయకుడైన “జోసెఫ్ స్టాలిన్” పేరు మీద నిర్మించారు. ఆ నగరమే పొతే ఒక రకంగా పరువు పోయినట్టే.

కాబట్టే రష్యా, జర్మనీలు ఆ ప్రాంతం మీద పట్టు సాధించడం కోసం దాదాపు ఏడాది పాటు శ్రమించాయి. రెండు వైపులా దాదాపు ఆరు లక్షల మంది సైనికులు చనిపోయారు, కొన్ని లక్షల మంది సామాన్య జనాలు చనిపోయారు, గాయపడ్డారు. 

అసలు మొత్తం రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఆరు కోట్ల మందితో పోలిస్తే ఇదో లెక్క లోకి రాదు.

మిగతా వరల్డ్  వార్ – 2 సినిమాలతో పోలిస్తే ఈ సినిమా లో యుద్ధం మీద కన్నా కొనిగ్ – వసిలి మధ్య జరిగే మైండ్ గేమ్, స్నైపర్ ఫైట్స్ మీద, వసిలి – టానియా – దానిలోవ్ ఎమోషన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది.

ఈ సినిమాలో హీరో జూడ్ లా, హీరోయిన్ రాచెల్ విజ్ (మమ్మీ సినిమాలో హీరోయిన్).

మొత్తానికి ఒక సారి చూడచ్చు.

error: Content is protected !!