Anora

కొన్ని రోజుల క్రితం “Anora” అనే ఒక సినిమాకి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. దాంతో పాటే లీడ్ రోల్ లో చేసిన “Mikey Madison అమ్మాయికి కూడా ఉత్తమ నటిగా అవార్డ్ వచ్చింది.

కోటీశ్వరుడైన ఒకబ్బాయి, ఒక పేదింటి అమ్మాయి ఒక చోట కలుస్తారు. 

ఎక్కడా.? 

ఆ అమ్మాయి పని చేసే చోట. 

ఆ అమ్మాయి ని కలవడం కోసమే ఆ అబ్బాయి రోజూ ఆమె పని చేసే చోటికి వెళుతూ ఉంటాడు. మెల్లిగా ఆ అమ్మాయికి కూడా అతనంటే ఇష్టం కలుగుతుంది. 

ఒకరోజు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుందామా అని అడుగుతాడు. ఆ అమ్మాయి సరే అంటుంది.

ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న ఒక చర్చిలో పెళ్ళి చేసుకుంటారు.

ఆ విషయం ఆ అబ్బాయి ఇంట్లో తెలుస్తుంది. దాంతో ఆ అబ్బాయి తల్లి రౌడీలని పంపి “తన కొడుకుని వదిలేయాలని” ఆ అమ్మాయిని బెదిరిస్తుంది. 

కానీ ఆమె ఒప్పుకోకుండా “నేను తన భార్యని. తనతోనే జీవితం” అని తెగేసి చెప్తుంది.

దాంతో ఒక ప్రైవేట్ ప్లేన్ లో స్వయంగా తనే వచ్చి తన కుటుంబ పరువు, ప్రతిష్ఠ అన్నీ చూపించి మరీ విడాకుల కాయితాల మీద సంతకాలు పెట్టమని అడుగుతుంది.

ఏం జరిగింది అనేది మిగతా కథ. 

నిజానికి ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం తేజ దర్సకత్వంలో వచ్చిన “నువ్వూ నేను”, దాంతో పాటే కొన్ని వందల తెలుగు సినిమాల్లో అరిగిపోయిన ఒక పాత కథకి ఆస్కార్ అవార్డ్ వచ్చింది అంటే ఏదో విషయం ఉండాలి కదా.

 ఇప్పుడు ఒక్కో విషయం మెల్లిగా చదవండి. ఈ సినిమాకి ఆస్కార్ ఇవ్వచ్చో లేదో మీరే నిర్ణయించండి.

ఆ అమ్మాయి పని చేసే చోటు అన్నా కదా. అదే అసలు ఈ కథకి మూలం.

అదొక స్ట్రిప్ క్లబ్. Anora అనే అమ్మాయి అక్కడ పార్ట్ టైం గా స్ట్రిప్పర్ గా పని చెస్తూ ఉంటుంది. 

(అంటే ఏంటో వివరాలకి గూగుల్ లో వెతకండి. మనది ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాబట్టి రాయకూడదు.)

అక్కడకి Ivan అనే ఒక రష్యన్ కుర్రాడు వచ్చి రష్యన్ మాట్లాడగలిగే ఒకమ్మాయి కావాలని అడుగుతాడు. (వీడి భాషాభిమానం తగలెయ్య.)

అసలీ ఇవాన్ అమెరికా వచ్చింది చదువుకోడానికి. వీడి తల్లిదండ్రులు బాగా డబ్బున్న వాళ్ళు. రష్యాలో కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ లు చేస్తూ ఉంటారు. వీడిలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. 

ఆ క్లబ్ ఓనర్ వచ్చి అనోరా ని పరిచయం చేస్తాడు.

ఇవాన్ కి అనోరా ఇచ్చిన సర్వీస్ బాగా నచ్చుతుంది. దాంతో రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తన మాన్షన్ కి కూడా రాప్పించుకుంటూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా ఇద్దరూ కబుర్లు చెప్పుకుని ఎంజాయ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మెల్లిగా ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఆమె చార్జ్ చేయడం మానదు. 

ఒకరోజు నేను ఫ్రెండ్స్ తో ఒక వారం లాస్ వేగాస్ వెళుతున్నా. నువ్వు కూడా రావాలి. పదిహేను వేల డాలర్లు ఇస్తాను అంటాడు. ఆమె ఒక అంటుంది.

ప్రైవేట్ జెట్ లో ప్రయాణం.

ఫైవ్ స్టార్ హోటల్ లో సూట్ రూమ్ లో స్టే.

కావల్సినంత తినడం, తాగడం. అన్నింటి కన్నా ముఖ్యంగా ఆమెకి ఎప్పుడూ దొరకని ఒక ఫ్రెండ్ షిప్ దొరకడం. 

రైల్వే ట్రాక్ పక్కన ఇరుకు కొంప, సరిగ్గా తిండి కూడా తినే గ్యాప్ ఇవ్వని కస్టమర్లు. సరిగ్గా మాట్లాడే మనుషులు కూడా లేని జీవితం నుండి వచ్చిన ఆమెకి ఇదంతా కొత్త కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉండటమే కాదు బావుంటుంది.  

ఒక రోజు బెడ్ మీద సడెన్ గా “మనం పెళ్ళి చేసుకుందామా” అని అడుగుతాడు. 

ఆమె ముందు జోక్ చేస్తున్నాడు అనుకుని నవ్వుతుంది. తర్వాత నిజమే అని అర్థమయ్యి ఒకే అంటుంది. 

ఇద్దరూ పక్కనే ఉన్న చర్చ్ కి వెళ్ళి పెళ్ళి చేసేసుకుంటారు.

మళ్ళీ వెనక్కి వచ్చాక ఆమె అతనితోనే మాన్షన్ లోనే కాపురం పెడుతుంది. ఉద్యోగం మానేసింది. ఇద్దరికీ అసలు టైమే తెలియకుండా జీవితం గడిచి పోతోంది.

కొన్ని రోజులకి ఈ విషయం అబ్బాయి ఇంట్లో తెలిసింది. దాంతో అతని ఫ్యామిలీ ఈ సంగతేంటో చూడమని ఇద్దరు మనుషుల్ని పంపిస్తుంది. ఇద్దరూ ఇంటికి వచ్చి నిజమే అని కన్ఫర్మ్ చేసుకుని రష్యాకి చెప్తారు. ఇవాన్ అక్కడ నుండి పారిపోదామంటాడు. కానీ అనోరా మనం  ఏం తప్పు చేసాం అని పారిపోవాలి కాబట్టి ఇక్కడే ఉందాం అంటుంది. 

ఇక్కడే ఉంటే మనల్ని విడదీసేస్తారు అని చెప్పినా కూడా వినదు. ఇవాన్ పారిపోతాడు.  ఆమె దొరికిపోతుంది. ఆమెని కట్టేసి అతని కోసం వెతుకుతారు. ఆమె కూడా సాయం చేస్తుంది. అలా వెతికేటప్పుడు ఆమె ఎలాంటిదో ఆ రౌడీలకి అర్థమవుతుంది. ఇవాన్ దొరుకుతాడు.

ఇవాన్ తల్లి, తండ్రి ఒక ప్రైవేట్ జెట్ లో వచ్చి విడాకులు ఇప్పించడం కోసం “ఇవాన్ మైనర్” అని చెప్పి తమ లాయర్ సాయంతో కోర్టుకి వెళతారు. కానీ పెళ్ళయింది లాస్ వేగాస్ లో కాబట్టి విడాకులు కూడా అక్కడే తీసుకోవాలి అని చెప్పడంతో అందరూ కలిసి లాస్ వేగాస్ వెళతారు. 

కానీ అనోరా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోదు. దాంతో ఇవాన్ తల్లి ఆమెని “నువ్వు నిజంగా మాతో కోర్టుల్లో పోరాడగలవా” అని చెప్పడం, పైగా ఇవాన్ కూడా “మా ఫ్యామిలీ ఏ నాకు ముఖ్యం” అని చెప్పడంతో ఆమెకి “ఇవాన్ కి తన మీద మోజు తీరిపోయింది” అన్న విషయం అర్థమయ్యి విడాకులకి ఒప్పుకుని సంతకం పెడుతుంది.

అక్కడ నుండి అందరూ రష్యా వెళ్ళిపోతారు. ఆమెని మాత్రం ఒక బాడీగార్డ్ ని తోడు ఇచ్చి పంపి మాన్షన్ లో ఆమె వస్తువులు, ముందుగా మాట్లాడుకున్న పదివేల డాలర్లు తీసుకుని ఆ మర్నాడు ఉదయమే వెళ్లిపోవాలి అని వార్నింగ్ ఇస్తారు. ఆ బాడీగార్డ్, ఆమె రాత్రంతా ఆ మాన్షన్ లోనే ఏకాంతంగా ఉండాల్సి వస్తుంది. ఇద్దరి మధ్యా చిన్న ఫ్రెండ్ షిప్ లాంటిది డెవలప్ అవుతుంది.  

ఆ మర్నాడు ఆ కూడా వచ్చిన బాడీగార్డ్ ఆమెకి పది వేల డాలర్లు ఇచ్చేసి ఇంటి దగ్గర దింపడం కోసం కార్ ఎక్కుతాడు, ఆమె కూడా కార్ లో కూర్చుంటుంది. అంతకు ముందు రాత్రి ఇద్దరూ ఉన్నప్పుడు “నన్ను రే***ప్ చేసెలా ఉన్నావ్ అని ఆరోపణలు చేస్తుంది?”. కానీ అతను ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటాడు.

అది గుర్తొచ్చి  ఇద్దరూ కారులో ఎక్కాక మెల్లిగా అతని సీట్ వెనక్కి వాల్చి అతని మీద ఎక్కుతుంది. అతను ముందు వద్దు అన్నా తర్వాత ముద్దు పెడదాం అనుకుంటాడు. ఆమె అక్కడితో ఆపేసి “మళ్ళీ పాత జీవితాన్ని కొనసాగించాలి” అని గుర్తొచ్చి బాధతో అతన్ని కౌగిలించుకుని ఏడవడం తో సినిమా ముగుస్తుంది. 

ఈ సినిమాలో మొదటి అరగంట వచ్చే దారుణమైన సీన్స్ తీసేస్తే ఇదో ఎమోషనల్ డ్రామా. ఒక మనిషి కి అద్భుతమైన జీవితం చేతి దాకా వచ్చి దూరమైతే ఎలా ఉంటుందో చాల క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. 

ప్రేమ నిలబెట్టుకోవాలి అంటే ప్రేమతో బాటూ డబ్బు, ధైర్యం కూడా కావాలి అని అర్థమవడంతో అనోరా ఆఖర్లో అలా కూలబడిపోతుంది.

ఈ సినిమా ముగింపులో ఆమె అలా ప్రవర్తించడానికి కారణం ఒకటి ఇవాన్ లాంటి వాడిని ప్రేమించానా అని అతని మీద అసహ్యం అయితే, రెండో కారణం ఇవాన్ ఫ్యామిలీ, అతని వైపు మనుషులందరూ ఆమెని ఒక సెక్స్ వర్కర్ లా చూసినా కూడా ఇతనొక్కడే ఆమెని కొద్దిలో కొద్దిగా మంచిగా చూస్తాడు. 

ఈ సినిమాలో మొదటి అరగంటలో కనబడే స్ట్రిప్పర్ ల లో చాలామంది నిజమైన వాళ్ళే. పైగా తన సీన్స్ సహజంగా రావడం కోసం హీరోయిన్ “Mikey Madison” కొన్ని సీన్స్ తీసేటప్పుడు రెగ్యులర్ గా సెట్ లో ఉండే intimacy కో ఆర్డినేటర్ లని కూడా వద్దని చెప్పేసింది.

ఈ సినిమా పూర్తిగా చూసాక ఇది ఆస్కార్ వచ్చే రేంజ్ ఉందని నాకు అనిపించ లేదు. కానీ హీరోయిన్ కి రావడం సరైన నిర్ణయం అనిపించింది. 

ఈ సినిమా దర్శకుడు “Sean Baker” అయితే నిర్మాత అతని భార్యే “Samantha Quan”.

Sean Baker ఆ సినిమాలో Anora గా చేసిన “Mikey Madison” ని చూసి ఆమె కోసమే స్క్రిప్ట్ రాసాడు. 

ఇక ఇవాన్ గా చేసిన నటుడి పేరు “Mark Aleksandrovich Eydelshteyn”. రష్యాలో పుట్టి పెరిగాడు. నటన మీద ఇష్టంతో స్కూల్ ఎగ్గొట్టి థియేటర్స్ కి వెళ్ళేవాడట.

సినిమాలో “Anora” ఇవాన్ కంటే రెండేళ్ళు పెద్దది. అతనికి 21 అయితే ఆమెకి 23. బయట కూడా అతని కన్నా ఆమె రెండేళ్ళు పెద్దది. అందుకేనేమో సినిమాలో కెమిస్ట్రీ బాగా కుదిరి ఎకనామిక్స్ బాగా పని చేసాయి.

Anora, Sean Baker, Mikey Madison, Ivan Zakharov, Vanya, Russian Oligarch, Brooklyn, New York, Brighton Beach, Sex Worker, Stripper, Marriage Drama, Las Vegas Wedding, Family Conflict, Power Struggle, Class Divide, Social Commentary, Realism, Indie Film, Guerrilla Filmmaking, Palme d’Or, Academy Awards, Best Picture, Best Actress, Best Director, Dark Humor, Love Story, Betrayal, Emotional Breakdown, Cinematic Realism, Neon Aesthetics, Handheld Camera, Social Issues, Money and Power, Independent Cinema, Raw Storytelling, Unpredictable Narrative, Female Protagonist, Relationship Drama, No Prenuptial Agreement, Divorce Settlement, Forced Annulment, Russian Mafia, Thematic Exploration, Character-Driven Film, Dark Comedy, Tragic Love Story, Financial Manipulation, Real Locations, Improvised Dialogue

error: Content is protected !!