Time Renegades

Renegade అనే ఈ పదానికి నెట్ లో మోసగాడు, తిరుగుబాటు దారుడు అనే అర్థాలు దొరికాయి..!

ఒక ముప్పై ఏళ్ల తర్వాత కరోనా వస్తుంది. ప్రపంచం ఇలా ఉంటుంది అని 1990 లో ఎవరైనా మీకు ఖచ్చితంగా చెప్పి, ఆ విషయాన్ని వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఒక కల ద్వారా తెలుసుకున్నాం అని మీకు చెప్పారు అనుకోండి మీరు నమ్ముతారా, లేక పిచ్చొడిలా చూస్తారా..?

అలాగే అదే ముప్పై ఏళ్ల ముందు 1990 లో జరిగిన ఒక హత్య మీకు ఇప్పుడు కల్లోకి వచ్చి అప్పుడు చంపిన హంతకుడు తప్ప మిగతా అన్ని విషయాలు కలలో కనబడుతుంటే, ఆ కల్లో జరిగిన విషయాలకు ఇప్పుడు 2020 లో రుజువులు దొరుకుతూ ఉంటే మిమ్మల్ని మీరే పిచ్చోడు అనుకుంటారా లేక మిగతా ఆధారాల కోసం చూస్తారా..?

1983 లో ఒక టీచర్ తన తోటి టీచర్ కి జనవరి 1 న ప్రపోజ్ చేసేటప్పుడు ఒక దొంగ అతడిని కత్తితో పొడిచి పారిపోవడం తో కథ మొదలవుతుంది.

అప్పటి నుండీ అతనికి 2015 లో ఇతను ఉన్న ఊరిలో జరగబోయే సంఘటనలు అన్నీ కలలోకి వస్తూ ఉంటాయి. మొదట ఇతను తన తోటి టీచర్స్ తో చెప్తూ ఉంటాడు. కానీ ఎవరూ నమ్మరు. అందుకని ఇతను అన్నీ తన మాటల్తో రికార్డ్ చేసి దాచేస్తూ ఉంటాడు.

సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఒక పోలీసు ఆఫీసర్ కూడా అలాంటి పరిస్థితుల్లో అదే సమయంలో, అదే జనవరి 1 న కాల్చబడతాడు. అప్పటి నుండీ ఇతనికి కూడా ముప్పై ఏళ్ల ముందు జరిగిన విషయాలు కల్లో కి వస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది ఒక 23 ఏళ్ల అమ్మాయి హత్య.

ఇద్దరూ మొదట తేలిగ్గా కొట్టి పడేస్తారు. కానీ తర్వాత వాటికి తగ్గ రుజువులు దొరుకుతు ఉండటం తో అలా ఎందుకు జరుగుతోంది అని పరిశీలన మొదలెడతారు.

ఈ ప్రయత్నంలో 1983 స్కూల్ టీచర్ కి 2015 లో ఒక అమ్మాయిని హత్య చెయ్యబోతారు అని కల వస్తుంది. ఆ హత్య ఎలాగైనా ఆపాలి అని అతను చేసే ప్రయత్నం ఒక పక్క జరుగుతూ ఉండగా అదే స్కూల్ లో ఒక సైకో ఆరుగురు అమ్మాయిలను పీక కోసి చంపేసి ఆ కత్తిని ఎవరికీ తెలియకుండా ముప్పై ఏళ్ల తర్వాత తెరవడం కోసం పెడుతున్న ఒక టైమ్ కేప్సుల్ లో పడేస్తాడు.

టైమ్ కాప్సుల్ అంటే ఒక పెట్టేలో వాళ్ళ గుర్తుగా కొన్ని వస్తువులు పడేసి అవి పాతికేళ్ల తర్వాత లేదా యాభై ఏళ్ల తర్వాత తెరిచి ఎవరి వస్తువులు వాళ్ళు తిసేసుకోవడమో లేదా వేలం వెయ్యడం చేస్తూ ఉంటారు. వజ్రోత్సవాల్లో చిరంజీవి అవార్డ్ ఒక పెట్టెలో పడేసి పాతికేళ్ల తర్వాత చూస్తా అనడం గుర్తుందా..?

ఇక్కడ 2015 లో అతనికి ఆ ఆరుగురిని చంపినట్లు కల వస్తుంది. ఆ చనిపోయిన వాళ్ళ మొహాలు కూడా కనబడతాయి. కానీ ఎవరు చంపారో కనబడరు. అలా చంపినట్టు ఇతనికి ఋజువులు కూడా దొరికాయి. ఆ హంతకుడిని ఎలాగైనా పట్టుకోవాలి అని ఇతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు..?

ఈ రెండు కథలు ఒక చోట కలుస్తాయి. అసలు ఆ కలలు ఎందుకు వస్తాయి, వాళ్ళు ఇద్దరికీ లింక్ ఏంటి అనేది పూర్తిగా ఎంజాయ్ చేస్తూ చూడండి.

2016 లో విడుదల అయిన ఈ సౌత్ కొరియా సినిమా ఆ ఏడాది లో బిగ్గెస్ట్ హిట్ గా నిలబడింది..!

ఈ సినిమా మొత్తం రెండు “టైమ్ జోన్” లలో నడుస్తుంది. ఒకటి 1983 రెండు 2015. రెండింటి మధ్య తేడా చూపించడానికి కేమెరా వర్క్ నీ, లైటింగ్ నీ చాలా బాగా వాడుకున్నాడు. సినిమాలో ఈ విషయం లో మాత్రం అసలు కన్ఫ్యూజన్ ఉండదు. చాలా క్లారిటీ గా ఉంటుంది.

ఈ సినిమా పాయింట్ కొంచెం అటూ ఇటూగా బేస్ చేసుకునే అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ రెండు జంటలుగా, దాసరి అరుణ్ కుమార్ విలన్ గా వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో “ఒక్క క్షణం” అనే సినిమా వచ్చింది. (ఎక్కడికీ పోతావు చిన్నవాడా, డిస్కో రాజా డైరెక్టర్)