Casablanca
యుద్దం, ప్రేమ, ద్రోహం, త్యాగం, అవినీతి, రొమాన్స్, రాజకీయం, విప్లవం ఆఖరుగా కళ్ళు తిప్పుకోనివ్వని హీరోయిన్ అందం ఇవన్నీ కలిపి ఒకే సినిమాలో ఉంటే ఆ సిననిమా పేరే “కాసాబ్లాంకా”.
స్పాయిలర్ అలెర్ట్. మొత్తం కథ చెప్పేసా. కాబట్టి సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు చదవకండి. చదివి చూసినా కూడా అద్భుతంగా ఉంటుంది.
కాసాబ్లాంకా అనేది మొరాకో లో ఒక బిగ్గెస్ట్ సిటి.
ఆ సిటీ ని ఒక వైపు నాజీ ప్రభుత్వం, మరో వైపు “Vichy France” పరస్పరం సహకరించుకుంటూ కంట్రోల్ చేస్తూ ఉంటాయ్.
సింపుల్ గా చెప్పాలంటే “మనకి మనకి బయట ఎన్నైనా ఉండచ్చు. కానీ ఇక్కడ ఎలాంటి గొడవలొద్దు. ఒకళ్ళకొకళ్ళు పరస్పరం సహకరించుకుందాం, మాకు ద్రోహం చేసే వాళ్ళు మీకు తెలిస్తే మాకు చెప్పండి. మీకు ద్రోహం చేసేవాళ్ళు మాకు తెలిస్తే మీకు చెప్తాం” టైప్ అన్నమాట.
రెండో ప్రపంచ యుద్ద సమయంలో నాజీల నుండి తప్పించుకోవడానికి చాలా మంది కాసాబ్లాంకా నుండి లిస్బన్ కీ అక్కడ నుండి అమెరికా కి పారిపోయేవారు. అమెరికా కే ఎందుకంటే అప్పటికింకా అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగలేదు. కాబట్టి అక్కడికి పొతే ఎలాగోలా బ్రతకచ్చు.
ఎలాగో అలా కాసాబ్లాంకా నగరానికి వచ్చి తమకున్న పలుకుబడి, డబ్బు ఉపయోగించి ఒక వీసా సంపాదించి షిప్ గానీ విమానం గానీ ఎక్కితే గనక లిస్బన్ కి వెళ్ళిపోయి అక్కడ నుండి హ్యాపీగా బ్రతకచ్చు.
కానీ అదృష్టం కలిసి రాకపోతే కనక కాసాబ్లాంకా లో ఇరుక్కుపోతారు. మళ్ళీ స్వదేశాలకి వెళ్ళలేరు, వీసా లేదు కాబట్టి లిస్బన్ కీ పోలేరు, దొంగతనంగా వచ్చారు కాబట్టి కాసాబ్లాంకా లో ధైర్యంగా బ్రతకలేరు. ప్రభుత్వానికి దొరికితే కనక కుక్క బ్రతుకే.
కథ డిసెంబర్ 1941 లో స్టార్ట్ అవుతుంది.
ఈ సినిమాలో అయిదు పాత్రలు చాలా ముఖ్యం.
- హీరో రిక్
- హీరోయిన్ ఇల్స
- విక్టర్ లాజ్లో
- లోకల్ పోలిస్ ఆఫీసర్ లూయిస్ రెనాల్ట్.
- జర్మనీ ఆర్మీ మేజర్ స్ట్రాసర్
- కొరియర్ బాయ్ ఉగార్ట్
అమెరికా నుండి కాసాబ్లాంకా కి వలసొచ్చిన హీరో “రిక్” ఒక నైట్ క్లబ్, గాంబ్లింగ్ డెన్ నడుపుతూ ఉంటాడు. ఆ క్లబ్ కి రకరకాల మనుషులు, అధికారులు వస్తూ ఉంటారు. రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు.
కానీ రిక్ మాత్రం అక్కడ జరిగే ఏ చర్చల్లోనూ పాల్గొనకుండా తన వ్యాపారం తాను చేసుకుంటూ ఉంటాడు. “మీరు మీరు ఏమైనా చేసుకోండి. కానీ నా క్లబ్ కి ఆర్థికంగా నష్టం రాకుండా చేసుకోండి. నా వ్యాపారం నాకు ముఖ్యం టైప్.”
రిక్ ఒకప్పుడు ఇల్లీగల్ గా గన్స్ సప్లయ్ చేసే వాడు. కానీ అది రిస్క్ అవ్వడం, పైగా తన మీద నిఘా ఉండటం తో ఇక్కడకి వచ్చి సెటిల్ అవుతాడు.
ఒక రోజు రాత్రి ఉగర్ట్ రిక్ క్లబ్ కి వచ్చి రెండు వీసా పేపర్స్ ఇస్తాడు. ఇద్దరు నాజీ కొరియర్ లని చంపి ఆ పత్రాలు దొంగిలించాడు. ఆ పత్రాల మీద అన్ని సంతకాలూ అయిపోయి ఉంటాయ్. వాటి మీద నచ్చిన పేర్లు రాసుకుంటే హాయిగా లిస్బన్ కి వెళ్లిపోవచ్చు. అంటే ఒక రకంగా బ్లాంక్ చెక్కు కింద లెక్క. అవి బ్లాక్ మార్కెట్ లో అమ్మితే లక్షలు వస్తాయ్.
తన మీద నిఘా ఉందని, కాబట్టి మళ్ళీ తాను వచ్చే దాకా ఆ పత్రాలు జాగ్రత్తగా ఉంచమని రిక్ కి ఇస్తాడు. రిక్ అవి దాచేస్తాడు.
ఇది జరిగిన వెంటనే పోలిస్ ఆఫీసర్ లూయిస్ వచ్చి ఉగార్ట్ ని అరెస్ట్ చేసి తీసుకుపోతాడు. ఎంక్వయిరీ లో ఆ పత్రాలు ఎక్కడున్నాయో చెప్పకుండానే ఉగార్ట్ చనిపోతాడు.
ఈ లూయిస్ ఒక అవినీతి పరుడు. డబ్బుకోసం గడ్డి తినే రకం. అవడానికి ఫ్రాన్స్ ఉద్యోగి అయినా కూడా జర్మనీ కి సపోర్ట్ చేస్తూ సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. ఎవరు డబ్బులిస్తే వాళ్ళకి వీసాలు అరేంజ్ చేస్తూ ఉంటాడు.
ఆ మర్నాడు రిక్ క్లబ్ కి “విక్టర్ లాజ్లో, అతని భార్య ఇల్సా” ఇద్దరూ వచ్చి ఉగార్ట్ కోసం అడుగుతారు.
ఆ వీసా పత్రాలు వాళ్ళకి అమ్మడానికే ఉగార్ట్ వాళ్ళని అక్కడకి రమ్మన్నాడు. వాళ్ళకి జరిగింది తెలియక అక్కడకి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు.
ఈ విక్టర్ లాజ్లో ఒక విప్లవ నాయకుడు. నాజీలకి వ్యతిరేకంగా పని చేస్తూ ఉంటాడు. ఇతన్ని ఒక పదేళ్ళ క్రితం నాజీలు బంధించి కాన్సంట్రేషన్ క్యాంప్ లో పెడతారు. అక్కడ నుండి తప్పించుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తాడు. భార్యతో కలిసి లిస్బన్ వెళ్ళిపోయి, అక్కడ నుండి అమెరికా వెళితే తన రాజకీయ కార్యక్రమాలతో నాజీలని ఇంకా ఇబ్బంది పెట్టచ్చు అని అతని ప్లాన్.
ఇతను ఇక్కడకి వస్తున్నాడని నాజీలకి సమాచారం అందింది. ఇతన్ని ఇక్కడే అరెస్ట్ చేద్దాం అంటే సరైన ఆధారాలు లేవు.పోనీ కాల్చి పడేద్దాం అంటే చచ్చి అందరికీ హీరో అయిపోతాడు. అక్కడ నాజీ అధికారి అయిన మేజర్ స్ట్రాసర్ కి ఈ రెండూ ఇష్టం లేవు.
అతను దొంగ వీసా కోసం వచ్చాడు. కాబట్టి అది తీసుకుని విమానం ఎక్కే ముందు అరెస్ట్ చేస్తే ఇక ఏ గొడవా ఉండదు అని అతని మీద నిఘా పెట్టి ఉంచుతాడు. ఇది ఇతని ఫ్లాష్ బ్యాక్.
ఆ క్లబ్ లో “రిక్” ని చూసి “ఇల్సా” షాక్ అవుతుంది. కారణం పదేళ్ళ క్రితం ఆమె ప్యారిస్ లో ఉన్నప్పుడు ఇద్దరూ ప్రేమించుకుంటారు. నాజీలు ఫ్రాన్స్ ని ఆక్రమించుకునేటప్పుడు అక్కడ ఉండటం క్షేమం కాదని భావించి అక్కడ నుండి వేరే చోటకి పారిపోదాం అని ప్లాన్ చేసుకుంటారు.
రిక్ ని రైల్వే స్టేషన్ లో వెయిట్ చెయ్యమని చెప్పి ఇల్సా రాదు. దాంతో ఆమె మోసం చేసింది అని అర్థం చేసుకుని రిక్ ఒక్కడే వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ క్లబ్ లో కనబడ్డాడు.
ఉగార్ట్ చనిపోయాడు అని లాజ్లో కి, ఇల్సా కి తెలుస్తుంది. పత్రాలు అతని దగ్గరే ఉన్నాయ్. అవి లేకపోతే లిస్బన్ కి వెళ్ళలేరు, ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళలేరు, కాసాబ్లాంకా లో ఉండలేరు. ఎందుకంటే ఎదో ఒక కారణం చూపించి విక్టర్ ని అరెస్ట్ చేయచ్చు. రిక్ ని చూస్తూ ఇల్సా అక్కడే ఉండలేదు. ఏం చేయాలో ఇద్దరికీ తోచదు.
అక్కడే మరో నైట్ క్లబ్ నడిపే ఒక వ్యక్తి ఆ వీసా పేపర్స్ రిక్ దగ్గర ఉండచ్చు అని లాజ్లో కి హింట్ ఇస్తాడు. లాజ్లో వెళ్ళి రిక్ ని అడుగుతాడు. కానీ రిక్ ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆ వీసా పేపర్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పి, కారణం వెళ్ళి నీ భార్యని అడుగు అంటాడు.
లాజ్లో కి అర్థం కాక వెళ్ళి ఇల్సా తో జరిగింది చెప్పి ఒక మీటింగ్ ఉందని వెళ్ళిపోతాడు. ఇల్సా ఆ వేళ రాత్రి దొంగతనంగా రిక్ ని కలిసి తాను అక్కడకి రాక పోవడానికి కారణం చెప్తుంది.
రిక్ ని కలవడానికన్నా ముందే ఇల్సా లాజ్లో ని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆ విషయం రహస్యం గా ఉంచుతారు. అయితే లాజ్లో ని నాజీలు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కాన్సంట్రేషన్ క్యాంప్ ల్లో పడేస్తారు. ఆమె రెండేళ్ళు ఎదురు చూస్తుంది. తప్పించుకు పోతూ ఉండగా కాల్చి చంపారు అని కబురు వస్తుంది, దాంతో ఇక చేసేది ఏమీ లేక ఇక మామూలు జీవితం గడుపుదాం అని నిర్ణయించుకుని రిక్ తో ప్రేమలో పడి పారిపోదాం అనుకుంటుంది.
కానీ సరిగ్గా ఆ ముందు రోజే లాజ్లో బ్రతికే ఉన్నాడని, కానీ గాయపడి చాలా దారుణమైన పొజిషన్ లో ఉన్నాడని కబురు వస్తుంది. దాంతో తన లైఫ్ కన్నా కూడా లాజ్లో లాంటి విప్లవ కారుడికి తన అవసరం ఎక్కువగా ఉందని అర్థం చేసుకుని లాజ్లో దగ్గరకి వెళ్ళిపోతుంది.
జరిగింది అర్థం చేసుకున్న రిక్ ఎలాగైనా ఇద్దర్నీ లిస్బన్ పంపిస్తా అని మాటిస్తాడు.
ఈలోగా మీటింగ్ కి వెళ్ళిన లాజ్లో ని పోలీసులు తరుముతూ రావడంతో తప్పించుకోవడం కోసం రిక్ క్లబ్ లోకి దూరతాడు. లూయిస్ కూడా క్లబ్ లోకి వస్తాడు.
అక్కడ లాజ్లో ని అరెస్ట్ చేసిన లూయిస్ ని రిక్ విడిగా కలిసి “మీటింగ్ కి వెళ్ళడం అనేది పెద్ద నేరం కాదని, కోర్ట్ లో నిలబడదు అని, కానీ రేపు ఇద్దరికీ తానూ దొంగ వీసా లు ఇస్తున్నానని, అక్కడ అరెస్ట్ చేస్తే లాజ్లో జీవితాంతం జైల్లో ఉంటాడని, తనకి తన లవర్ ఇల్సా దక్కుతుందని, ఇద్దరూ లాభ పడచ్చని” కన్విన్స్ చేస్తాడు.
లూయిస్ ఒకే అని ఒప్పుకుని లాజ్లో ని విడిచి పెడతాడు.
రిక్ దొంగ వీసాలు, లాజ్లో, ఇల్సాలని తీసుకుని ఎయిర్ పోర్ట్ కి వస్తాడు. కానీ లూయిస్ అంతకు ముందే రిక్ ప్లాన్ గ్రహించి మేజర్ స్ట్రాసర్ కి హింట్ ఇస్తాడు. కానీ అప్పటికే లేట్ అయ్యి లాజ్లో, ఇల్సా విమానం ఎక్కేస్తారు, విమానం స్టార్ట్ అయిపోతుంది.
ఈలోగా మేజర్ తన టీం ని రమ్మని సమాచారం ఇచ్చి, కంగారుగా ఒక్కడే కారు నడుపుకుంటూ వచ్చి అక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి విమానం ఆపమని చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉండగా రిక్ గన్ తీసి మేజర్ ని కాల్చి పడేస్తాడు.
మేజర్ వెనక్కాల జీప్ లో వచ్చిన టీం కి చచ్చి పడున్న మేజర్ బాడీ కనబడుతుంది. అక్కడే ఉన్న లూయిస్ ఇక నిజం చెప్పి రిక్ ని అరెస్ట్ చేయించినా కూడా తనకి వచ్చే లాభం లేదని గ్రహించి జరిగింది చెప్పకుండా “ఎవరో విప్లవ కారులు” షూట్ చేసి పారిపోయారని చెప్పి రిక్ ని కాపాడతాడు.
ఇద్దరూ కలిసి ఒకళ్లకొకళ్ళు లాభం చేకూరాలి అంటే ఏం చేయాలో, ఎంత సంపాదించాలో, ఎలా సంపాదించాలో మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా సినిమా ముగుస్తుంది.
ముందే చెప్పినట్టు అన్ని ఎలెమెంట్స్ కలిసిన అద్భుతమైన సినిమా అని చెప్పచ్చు.
హీరో “Humphrey Bogat” అయితే రిక్ గా సింపుల్ గా చేసి పడేశాడు.
హీరోయిన్ “Ingrid Bergman” ని అయితే మామూలు గా చూపించలేదు. స్క్రీన్ మీద ఆమె కనబడినంత సేపూ చూపు తిప్పుకోలేము. అంత బావుంటుంది. నవ్వితేనే కాదు ఏడ్చినప్పుడు కూడా అందంగా ఉండటం ఆమె స్పెషాలిటీ.
ఐశ్వర్యా రాయ్ తో సహా చాలా మంది స్టార్స్ కి ఫేవరేట్ సినిమా.
ఒక పర్ఫెక్ట్ సినిమా ఎలా ఉండాలో బెస్ట్ ఉదాహరణగా ఈ సినిమా చెప్పచ్చు. అందుకే విడుదలైన ఎనభై ఏళ్ళ తర్వాత కూడా ఇంకా జనాలని అలరిస్తూనే ఉంది.
ఈ సినిమా లో ఉన్న నాజీ వ్యతిరేక సీన్స్ వల్ల ఈ సినిమాని 1952 దాకా జర్మనీలో విడుదల కానివ్వలేదు. విడుదల అయిన సినిమాలో కూడా దాదాపు అరగంట సినిమా కోసేశారు. రిలీజ్ అయిన సినిమా కూడాలో కూడా నాజీలకి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ మార్చేశారు.
మొత్తం మీద ఈ సినిమా చూసాక ఒక అద్భుతమైన సినిమా చూసానన్న ఫీలింగ్ కలగడం మాత్రం ఖాయం.