ఒక అమాయకురాలైన టీనేజ్ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు Iffet మన కథానాయిక.
తండ్రి, చెల్లి తో కలిసి ఉంటుంది. ఆమె తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఇంటి బాధ్యత Iffet మీద పడుతుంది. ఈ ఫ్యామిలీ ఎవరి జోలికీ వెళ్ళకుండా ఎదో వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు.
అలాంటి ప్లేస్ కి “కేమేల్” అనే ఒక పైలా పచ్చీసు గా జీవితం సాగించే ఒక కుర్రాడు వస్తాడు. ఆ అబ్బాయిని చూసిన వెంటనే మన కథానాయిక ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమ ముదిరి పాకాన పడుతుంది. దాంతో ఆ అమ్మాయి కడుపులో ఒక జీవం పడింది.
కేమేల్ ఆ అమ్మాయికి అబార్షన్ చేయిస్తాడు. కారణం ఇతనికి ఒక డబ్బున్న అమ్మాయితో పెళ్లి కుదరడమే. మన కథా నాయికకి ఈ విషయం తెలుస్తుంది. నిలదీసీసేసరికి నా ఇష్టం అని ఎదురు తిరిగి దిక్కున్న చోట చెప్పుకోమంటాడు.
ఈ విషయం తెల్సిన Iffet తండ్రి పరువు కోసం భయపడి కూతుర్ని తన్ని బయటికి పొమ్మంటాడు.
దిక్కు తోచని Iffet మొదట చనిపోవాలని చూస్తుంది. కానీ తన పరిస్థితికి కారణం అయిన కేమేల్ మీద పగ తీర్చుకోవాలని తన పిన్ని దగ్గర చేరుతుంది. ఖాళీగా ఉండి తినడం ఇష్టం లేక ఏదైనా పని చూపించమని తన పిన్నిని అడుగుతుంది. ఆమె పిన్ని ఒక ఫోటో గ్రాఫర్ ని పరిచయం చేస్తుంది.
అతను ఆమెని రక రకాల భంగిమల్లో ఫోటోలు తీసి పెద్ద మోడల్ ని చేస్తాడు. ఆమె బాగా డబ్బు సంపాదిస్తుంది. ఒక రోజు ఒక పత్రిక కవర్ పేజ్ మీద ఆమె ఫోటో చూసిన తండ్రి గుండె ఆగి చనిపోతాడు. దాంతో Iffet చెల్లి ఆమె దగ్గరకి వచ్చేస్తుంది.
ఒక కోటీశ్వరుడు ఆమెని ప్రేమిచడం మొదలు పెడతాడు. ఈమె ఎటూ తేల్చకుండా అతనితో గడుపుతూ, అతని పలుకుబడి వాడుకుని కేమేల్ ని తన దగ్గరే డ్రైవర్ గా జాయిన్ అయ్యేలా చేస్తుంది.
గతాన్ని మనసులో పెట్టుకుని రోజూ అతన్ని అవమానిస్తూ ఉంటుంది. కానీ అతను అన్నీ మౌనంగా భరిస్తూ ఉంటాడు. ఆమె మెల్లిగా అతని ప్రవర్తనలో మార్పు గమనిస్తూ ఉంటుంది.
ఒకరోజు తాగేసి ఆమె కాళ్ళు పట్టుకుని తాను మారిపోయానని, పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు. ఆమె మనసు కరిగిపోయి ఒప్పుకుంటుంది. ఒకరోజు షూటింగ్ ఉందని బయటికి వెళ్ళిన సమయంలో ఆమె చెల్లి ఇంటికి వస్తుంది.
ఒంటరిగా ఉన్న ఆమెని కేమేల్ మనభంగం చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో షూటింగ్ పూర్తీ చేసుకు వచ్చిన Iffet అది చూసి అతను ఇంకా మారలేదు అని గ్రహించి గన్ తీసుకుని కాల్చి పడేయడం తో సినిమా ముగుస్తుంది.
ఇదొక టర్కిష్ మూవీ. 1982 లో వచ్చింది.
ఈ సినిమా కోసం ఇప్పుడెందుకు రాసాననే కదా. చెప్తా.
ఇప్పుడు 1987 లో వచ్చిన ఒక తెలుగు సినిమా కోసం చెప్పుకుందాం.
ఒక పల్లెటూరి అమాయకమైన అమ్మాయి. ఆ ఊరికి వచ్చిన ఒక ఆఫీసర్. ఇద్దరికీ పరిచయం అవుతుంది. ఇద్దరూ కలిసి
నిన్న నీవు నాకెంతో దూరం.
నువ్వు నాకు ఇవాళ ప్రాణం
అని పాటలు కూడా పాడుకుంటారు.
అతను చెప్పిన మాయ మాటలకి బుట్టలో పడుతుంది. పెళ్లి చేసుకుంటా అని సిటీ కి తీసుకు వచ్చి ఒక పెద్ద బంగ్లా లో కాపురం పెడతాడు. రేపే మన పెళ్ళి, కాబట్టి పెళ్లి ఏర్పాట్లు చేసి రేపు పొద్దున్నే వస్తా అని బయటికి వెళతాడు.
మర్నాడు ఆమె తన బంగారు భవిష్యత్ ఊహించుకుంటూ
ఓ రాతిరీ నువ్వు వెళ్ళిపో
ఓ వేకువా నువ్వు వచ్చిపో
అని పాడుకుంటూ ఉండగా ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేసేయమంటాడు. అదేంటి అని అడిగిన ఆమెతో తనకి అద్దె అంతా సెటిల్ చేసేసి, ఇక నీకు తనకి ఏం సంబంధం లేదని చెప్పాడని చెప్పి ఆమెని మెడపట్టి బయటికి గెంటేసి ఇల్లు స్వాధీనం చేసుకుంటాడు.
ఆమె రోడ్డున పడుతుంది. అలా వీధులన్నీ తిరుగుతూ ఉండగా ఒక ఇంట్లో నుండి క్యాంప్ కి వెళ్ళి త్వరగా వచ్చేయండి, అసలే రేపు మన పెళ్లి అన్న అరుపు వినబడుతుంది. చూస్తే అతనే మరో అమ్మాయిని మోసం చేయడానికి రెడీ అవుతున్నాడు అని అర్థం అవుతుంది. నిజం చెప్పాలని చూస్తే ఎవరూ నమ్మరు. పైగా తరిమి కొడుతూ ఉంటారు.
అలా పారిపోతున్న ఆమెని ఒక కళ్ళజోడు వ్యక్తి కాపాడతాడు. ఆమె గొంతు బావుంది అని గ్రహించి ఆమె చేత
ఇది పాట కానే కాదు
ఏ రాగం నాకు రాదు
అని ఒక పాట పాడించి మంచి సింగర్ ని చేస్తాడు. ఆమెకి డబ్బు, దాంతో పాటూ పలుకుబడి అన్నీ వస్తాయి. ఒకరోజు మరో అమ్మాయిని మోసం చేయబోయిన అతడిని చూసి అతనికి బుద్ధి చెప్పాలని గ్రహించి తన పలుకుబడి ఉపయోగించి అతని ఉద్యోగం తీయిన్చేస్తుంది. ఇంకెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తుంది.
చివరికి తన దగ్గరే డ్రైవర్ గా, పని వాడిగా ఉద్యోగం ఇస్తుంది. రోజులు గడుస్తూ ఉంటాయ్. అతనిలో మెల్లిగా మార్పు గమనిస్తూ ఉంటుంది.
అతను తను చేసిన తప్పు గ్రహించి తప్పు చేసానని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఆమె కాపాడుతుంది. పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. తన ఆస్తులు, కెరీర్ అతని చేతిలోనే పెడుతుంది. పెళ్లి రోజు పొద్దున్న అతను అదంతా నాటకం అని తన ఫ్రెండ్ తో ఫోన్ లో చెప్తూ ఉండటం అదే సమయానికి అక్కడకి వచ్చిన కళ్ళజోడు వ్యక్తి చెల్లెలు విని అందరికీ చెప్పడానికి వెళ్ళిపోతూ ఉండగా అతను ఆమెని అక్కడ గదిలో బంధించి మాన భంగం చేయబోగా అక్కడకి వచ్చిన కథానాయిక తన చేతిలో ఉన్న గన్ తో కాల్చి చంపేయడంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా పేరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.
రాజశేఖర్ కి జీవిత ని పరిచయం చేసిన “తలంబ్రాలు” సినిమా. కోడి రామకృష్ణ దర్సకత్వంలో వచ్చింది. M.S. ఆర్ట్స్ బ్యానర్ లో శ్యాం ప్రసాద్ రెడ్డి గారు నిర్మించారు.
Iffet సినిమాలో హీరోయిన్ మోడల్ అయితే ఇక్కడ సింగర్ ని చేశారు.
ఆ సినిమాలో హీరో డ్రైవర్ అయితే ఇక్కడ ఒక కంపెనీ మేనేజర్ ని చేసారు.
Iffet కి సాయం చేసిన ఫోటో గ్రాఫర్ నీ, ఆమె కి పరిచయం అయిన ఒక ధనవంతుడిని ఇద్దర్నీ కలిపి కళ్ళజోడు పెట్టి కళ్యాణ చక్రవర్తి ని చేసారు.
Iffet కి ఉన్న చెల్లెల్ని మన తెలుగులో కళ్యాణ చక్రవర్తి చెల్లెల్ని చేసారు.
అక్కడ క్లైమాక్స్ లో జరిగిన మానభంగాన్ని ఇక్కడ కేవలం ప్రయత్నం చేసినట్టు చూపించారు.
అక్కడ వాతావరణానికి, సంస్కృతికి తగినట్టు పెట్టుకున్న బికినీ సీన్స్, మందు సీన్స్, రొమాంటిక్ సీన్స్ ని మొత్తానికి తీసేసి ఇక్కడ మన సంస్కృతికి తగినట్టు సంగీత దర్శకుడు సత్యం గారితో సంప్రదించి నాలుగు అధ్బుతమైన పాటలు పెట్టారు.
ఒక అమ్మాయి ప్రేమ, జాలీ, పగ ఎలా ఉంటాయో రెండు సినిమాల్లోనూ చూపించారు.
ఇన్ని మార్పులు చేశారు కానీ ఒకే ఒక్కటి మాత్రం మార్చకుండా వదిలేశారు. అదేంటంటే…
ఆడది తనకి అన్యాయం చేసినా సహిస్తుంది, క్షమిస్తుంది. కానీ మరో అమ్మాయికి తన కళ్ళెదురుగా అదే అన్యాయమే జరుగుతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోదు. అది ఆపడానికి ఎంత దూరమైనా వెళుతుంది అనే ఒక అద్భుతమైన సందేశం మాత్రం ఉంచారు.
రెండు చోట్లా మంచి డబ్బులు సంపాదించారు.
అన్నిటికన్నా ముఖ్యంగా రాజశేఖర్ – జీవిత లాంటి మంచి జంటని జనాలకి ఇచ్చారు.