Shindlers-list

(ఈ సినిమా కోసం ఇంతకన్నా తక్కువగా రాయడం నావల్ల కాలేదు.)

మీరెవరికైనా ఉద్యోగం ఎందుకిస్తారు..?

ఒకటి మీకు ఒక ఉద్యోగి అవసరం ఉన్నప్పుడు..!

లేదా ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా మీకేదైనా లాభం కలుగుతుంది అన్నప్పుడు.!

లేదా ఎవరైనా అధికారో, రాజకీయ నాయకుడో ఫోన్ చేసి మావాడికి ఉద్యోగం ఇవ్వమని రికమెండ్ చేసినట్టు బెదిరించినప్పుడు..!

లేదా మీకిదివరకు ఎంతో సాయం చేసిన మనిషి కొడుకో కూతురో పని లేకుండా ఉంటే కృతజ్ఞత తో ఇస్తారు..!

పోనీ ఇక లాస్ట్ కి మహా అయితే మన ఊరివాడు, మన కులం వాడు, మన మతం వాడు అని ఫీలింగ్ తో ఇస్తారు.!

సరే ఈ పైన చెప్పిన కారణాలవల్ల మీ సొంత ఆఫీస్ లో ఎంతమందికి ఉద్యోగం ఇవ్వగలరు..?

ఒకరు, ఇద్దరు, ముగ్గురు లేదా పదిమంది లేదా వందమంది. అది కూడా వాళ్ళకు తగిన అర్హతలు ఉంటే ఇస్తారు. ఒక రెండు మూడు నెలలు చూసి సరిగ్గా పని చెయ్యకపోతే మొహమాటం లేకుండా ఉద్యోగంలో నుండి తీసేస్తారు..!

అంతేకానీ అవసరం లేకపోయినా, అర్హత లేకపోయినా, పరిచయం లేకపోయినా, కనీసం వాళ్ళ పేర్లు తెలియకపోయినా ఆఫీస్ లో నూటికి నూరుశాతం మందికి కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మాత్రమే ఉద్యోగం ఇచ్చి, అది కూడా నెలల తరబడి జీతాలు ఇచ్చి, పొరపాటున ఆ విషయం గానీ బయటకు వస్తే హిట్లర్ లాంటి వాడి చేతిలో కుక్క చావు చచ్చే అవకాశం ఉంటే ఆ ఆలోచనైనా చేసేవారా..!

కానీ అలాంటి ఆలోచన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో “ఆస్కార్ షిండ్లర్” అనే జర్మన్ వ్యాపారవేత్త చేశాడు.

రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జర్మన్ పోలీసులు లోకల్ గా ఉన్న పోలాండ్ జ్యూయిష్ పీపుల్ ని వాళ్ళ ఆస్తులు లాక్కుని, బెదిరించి, పనికొచ్చే వాళ్ళని ఘెట్టో అనే ఒక లోకల్ క్యాంప్ లో బలవంతంగా పెడుతూ ఉంటారు.

పని అంటే జర్మన్ లకు మాత్రమే పనికొచ్చే పనులు అంటే బూట్లు తుడవడం, ఫాక్టరీ ల్లో టెక్నికల్ గా వర్క్ చేయగలగడం, ఇళ్ళు కట్టడానికి తాపీ మేస్త్రి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి ఇలా అన్నమాట.

నాజీలు దాడి చేసినప్పుడు మీకు ఏదైనా పని వచ్చు అంటే బ్రతకనిచ్చి ఘెట్టో లో ఇంత తిండి పడేసి పని చేయించుకుంటూ బ్రతకనిస్తారు.

పనికి రాని వాళ్ళను కుదిరితే అక్కడికక్కడే కాల్చి పడేస్తూ ఉంటారు. ఇంకా మిగిలితే కాన్సంట్రేషన్ క్యాంప్ ల్లో కి పంపి విషవాయువు ఇచ్చి చంపేస్తారు.

ఘెట్టో అంటే ఒక చిన్న చిన్న కాలనీలు లాంటివి అనుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇరుగ్గా పదిమంది ఉండాల్సిన చోటులో వంద మందిని కుక్కి వాళ్ళకు పోలీసులను కాపలా పెట్టి పనులు చేయించుకుంటూ ఉంటారు.

ఇలాంటి క్యాంప్ ఒకటి పోలాండ్ లోని Krakow అనే ఊళ్ళో పెట్టడం చూసి జన్మతః జర్మన్ అయిన ఆస్కార్ షిండ్లార్ అనే వ్యాపారవేత్త తన వ్యాపారాన్ని అక్కడ కూడా మొదలెడతాడు.

ఇతని వ్యాపారం ఏంటంటే కంచాలు, గ్లాసులు, పళ్ళాలు, గిన్నెలు లాంటి సామాన్లు తయారు చేస్తూ ఉంటాడు. కాకపోతే అవి కొంచెం కళాత్మకంగా ఉంటాయ్. ఇతను అక్కడ ఉన్న జర్మన్ మిలట్రీ అధికారులకు లంచాలు ఇచ్చి, బహుమతులు పంపి, పార్టీలు ఇచ్చి, ఆ పార్టీల్లో అమ్మాయిలను పంపి ఇలా అన్ని రకాలుగా వాళ్ళను గుప్పెట్లో పెట్టుకుని అక్కడ ఉన్న ఘెట్టో ల్లో ఉన్న పోలిష్ పీపుల్ ని తన ఫాక్టరీ ల్లో చాలా తక్కువ జీతానికి పెట్టుకుని పని చేయించుకుంటూ తనకు లాభం వచ్చే విధంగా వ్యాపారం చేస్తూ ఉంటాడు.

అక్కడ పని చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు షిండ్లర్ ఫాక్టరీ లో పని చేసే ఉద్యోగులు గా గుర్తింపు పొంది నాజీల చేతుల్లో చావకుండా బ్రతికి ఉంటారు.

వీళ్ళను “షిండ్లర్ జ్యూస్” అంటారు.

ఇలా షిండ్లర్ హ్యాపీగా ఉన్న ఆ చోటికి “అమన్ గోత్” అనే ఒక సైనికాధికారి వస్తాడు. షిండ్లర్ ఈ అమన్ గోత్ కి కూడా లంచాలు ఇచ్చి మంచి చేసుకుంటాడు.

ఒకనాడు భార్యతో కలిసి సరదాగా గుర్రం మీద అలా షికారుకు వెళ్ళిన షిండ్లర్ కి అక్కడ ఉన్న ఒక ఘెట్టో లో ఉన్న వందల మంది జనాన్ని నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి పడేయడం కంటబడుతుంది. తను కొండపై నుండి చూస్తూ వుండగానే కొన్ని వందల మంది పోలాండ్ జ్యూయిష్ పీపుల్ పిల్లల తో సహా అలా పిట్టల్లా రాలి పడిపోతూ ఉంటారు.

అప్పటి దాకా డబ్బుకోసం మాత్రమే చూసుకున్న షిండ్లర్ మొదటి సారి మనుషుల ప్రాణాల కోసం బాధపడటం మొదలుపెడతాడు. తిరిగి ఫాక్టరీ కి వచ్చిన ఇతనిని ఒక అమ్మాయి కలుస్తుంది.

తన ముసలి తల్లిదండ్రులు పక్కనే ఉన్న వేరే ఘెట్టో లో ఉన్నారని దయచేసి వాళ్ళకు కొన్ని రోజులు ఫాక్టరీ లో ఉద్యోగం ఇవ్వమని దాంతో ప్రాణాలు నిలబడతాయనీ తరవాత తను వచ్చి ఎలాగోలా వాళ్ళను తీసుకు వెళతానని బ్రతిమాలుతుంది. మొదట ఇదేం గోల అని విసుక్కున్నా కూడా తర్వాత తన మేనేజర్ తో చెప్పి వాళ్ళకు ఏదో ఒక స్కిల్ ఉంది అని చెప్పి డమ్మీ ఉద్యోగం ఇస్తాడు.

దాంతో ఇతనికి ఒక విషయం అర్థం అవుతుంది. తాను ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తే అంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది అని. దాంతో ఇతను డబ్బు సంపాదన కన్నా కూడా ఉద్యోగాలు ఇవ్వడం మీద మాత్రమే దృష్టి పెడతాడు. దాంతో స్కిల్ లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం కోసం తను అప్పటి దాకా సంపాదించిన డబ్బు కూడా లంచాలు ఇవ్వడం కోసం, పనికిరాని వర్కర్ లకి జీతాలు ఇవ్వడం కోసం ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. దాంతో ఇతని ఆస్తి తగ్గడం మొదలవుతుంది.

కానీ లెక్క చెయ్యకుండా ఆస్తులు అమ్మి మరీ ఉద్యోగాలు సృష్టించి మరీ ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడు.

యుద్ధం ముగింపు దశకు వచ్చేసరికి అమన్ గోత్ ఘెట్టో ల్లో ఉన్న మిగతా జనాన్ని కూడా చంపెయ్యమని ఆర్డర్ వేస్తాడు. కానీ షిండ్లార్ వాళ్ళంతా తన ఉద్యోగులనీ వాళ్ళను తనతో బాటూ తన ఊరికి తీసుకు వెళ్లి అక్కడ ఫ్యాక్టరీ లో పని చేయించాలనీ అని అమన్ గోత్ ని రిక్వెస్ట్ చేసి, లంచం ఇచ్చి ఆ ఉద్యోగుల పేర్లతో ఒక లిస్ట్ తయారు చేస్తాడు.

ఆఖరికి అయిదేళ్ల పసి పిల్లకి కూడా తుపాకీ బుల్లెట్ లో వేలు పెట్టి శుభ్రం చేసే ఉద్యోగం ఉంది అని చెప్పి తన ఉద్యోగుల లిస్ట్ లో పేరు చేరుస్తాడు.

అదే “Schindler’s List”.

ఇలా అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి, తమ కుటుంబాలతో కలిపి తను తన దేశం అయిన జర్మనీ కి వెళ్ళిపోతాడు.

ఆ వెళ్ళే ముందు తన కోటుకు ఉన్న గోల్డ్ బటన్ తీసి చేత్తో పట్టుకుని ఇది నా దగ్గర ఉన్నట్టు నాకు తెలియదు. తెలిసుంటే ఇది కూడా ఇచ్చేసి ఇంకొక్కడిని కాపాడే వాడిని అని షిండ్లర్ కింద కూలబడి మరీ ఏడవడం చూస్తే నిజంగా అక్కడ నుండి జరిగే ఎమోషన్ రాయడం చాలా కష్టం.

ఈ సినిమాలో జరిగే రెండు సీన్లు చెప్తా.

అమన్ గోత్ పొద్దున్నే నిద్ర లేచి ఉచ్చోసుకొచ్చి గన్ తీసుకుని బాల్కనీ లోకి వచ్చి ఎదురుగా గ్రౌండ్ లో నిలబడి కనబడిన ఒక జ్యూయిష్ ని కాల్చి చంపేసి ఖాళీగా ఉన్నాడని సరదాగా చంపేశా అని పెళ్ళాంతో చెప్తాడు.

ఇంకోసారి సాయంత్రం లైన్ లో వెళుతున్న జనంలో ఒకడు నెమ్మదిగా నడుస్తున్నాడనీ, లావుగా ఉన్నాడనీ, సన్నగా ఉన్నాడనీ, పనికి రాడని, పని ఎక్కువ చెయ్యడం లేదనీ, ఇలా కారణం లేకుండా వెతుక్కుని మరీ జ్యూయిష్ పీపుల్ ని సరదాగా కాల్చి చంపేస్తూ ఉంటాడు.

ఇలా అన్ని దేశాల్లో నాజీలు లిస్ట్ వేసి, వెతికి మరీ సరదాగా చంపేసిన జనం దాదాపు “ఆరు కోట్లు”

ఇలా అమన్ గోత్ నుండి, హిట్లర్ నుండీ ఆస్కార్ షిండ్లర్ లిస్ట్ వేసి మరీ కాపాడిన కుటుంబాల సంఖ్య దాదాపు పన్నెండు వందలు.

ఈ సినిమా తీసిన స్పీల్ బర్గ్ ఒక జ్యూయిష్. అందుకే ఈ సినిమాని ప్రాణం పెట్టి మరీ పారితోషికం తీసుకోకుండా తీశాడు.

ఇక షిండ్లర్ గా నటించిన “Liam Neeson”,
“Aman Goth” గా నటించిన “Ralph Fiennes” ఇద్దరూ కూడా మనకు గుర్తుండి పోవడం ఖాయం.

కొన్ని సినిమాలు చూడకూడదు. ఒకసారి చూస్తే దాని ప్రభావం నుండి బయట పడాలంటే కొన్నిసార్లు గంటలు, రోజులు కాదు ఏకంగా వారాలు కూడా పట్టచ్చు.

దీని గురించి ఆలోచించకుండా నా పని మామూలుగా చేసుకోడానికి దాదాపు వారం పట్టింది.

హిట్లర్, అతని సైన్యం సరదాగా చంపేసిన ఆరుకోట్ల మందిలో ఎంతమంది మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు చనిపోయారో లెక్క పెట్టి లిస్ట్ వెయ్యడం మానవ మాత్రులకు సాధ్యం కాదు.

ఎవరో అన్నట్టు నిజంగా హిట్లర్ అనేవాడు పుట్టకుండా ఉండి ఉంటే ఈ ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉండేది అనేది మాత్రం అక్షర సత్యం.!

PS: ఇలా ఇంతమందిని కాపాడిన షిండ్లర్ యుద్ధం తర్వాత ఏం వ్యాపారం లోనూ సక్సెస్ కాలేక తాను కాపాడిన జ్యూయిష్ కుటుంబాలు ట్రస్ట్ గా ఏర్పడి పంపిన చందాల మీద జీవనం గడిపాడు.

జెరూసలేం లోని మౌంట్ జియాన్ మీద సమాధి ఉన్న ఏకైక నాజీ పార్టీ సభ్యుడు ఇతనే..!

అమన్ గోత్ ని పట్టుకుని విచారించి అతను చేసిన సరదా హత్యలకు ఉరి తీసి చంపేశారు.