2001_A_Space_Odyssey

ఈ సినిమా కథ సింపుల్ గా చెప్పాలి అంటే అలా చెప్పడం కుదరదు అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఆర్ట్ వర్క్ చూసినప్పుడు ఎవరికి ఎలా అర్థం అయితే అలా తీసుకుంటారు. ఈ సినిమా కూడా అంతే.

ఈ సృష్టిలో మార్పు అనేది మాత్రమే శాశ్వతం. మిగతా అంతా అశాశ్వతం.! ఈ సినిమా కూడా ఒక రకంగా చెప్పేది అదే.

ఈ సినిమా మొదటి సారి చూసినప్పుడు “Interstellaar” సినిమా పైరసీ లో కెమెరా ప్రింట్ కొరియన్ భాషలో చైనీస్ సబ్ టైటిల్స్ తో చూసిన ఫీలింగ్ వస్తుంది.

ఈ సినిమా కథ(?) నడిచే స్పీడ్ చూస్తుంటే స్లో మోషన్ వీడియోలు ఇంకా స్లో మోషన్ లో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

ఒక విలన్, ఒక సమస్య, ఒక హీరో, ఒక సొల్యూషన్, ఒక ఫైట్, ఒక పాట ఇలా ఉంటుంది అనుకుని సినిమా చూస్తే బుర్ర బొప్పి కట్టడం ఖాయం. (కానీ మొదటి సగం సినిమా ఇలాగే ఉంటుంది.)

లేదా సినిమా పేరులో “స్పేస్” అని ఉంది కాబట్టి మామూలు అంతరిక్ష సినిమా లా రెండు అంతరిక్ష నౌకలు, భూమికి, ఆకాశానికి, వేరే గ్రహాలకు ట్రిప్పులు వేసేటప్పుడు ఇంజన్ చెడిపోయి భూమికి రావడానికి పడే కష్టాలు అనుకుంటే పొరపాటున కూడా అలా అనుకోవద్దు. (కానీ ఇంకో సగం సినిమా ఇలాగే ఉంటుంది).

ఈ సినిమాలో నాలుగు ఉప కథలు ఉంటాయి.

మొదటిది కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం మనిషి “ఏప్” లా ఉన్నప్పుడు మొదలవుతుంది. ఒక ఏప్ గ్రూప్ గ్రూప్ ఇంకో ఏప్ గ్రూప్ మీద దాడి చేసి తరిమేస్తుంది. భయపడిన మొదటి ఏప్ గ్రూప్ పారిపోయి దాక్కుంటుంది. ఒక రోజు పొద్దున్న అవి నిద్ర లేచేసరికి ఒక “మొనొలిత్” (ఒక పెద్ద నల్ల స్తంభం) వాటి ముందు ఉంటుంది. వాటికి అక్కడి నుండి బుర్ర పెరిగి చనిపోయిన జంతువుల ఎముకలు ఆయుధాలుగా వాడి మిగతా గ్రూప్ మీద దాడి చేసి ఆ ప్రాంతం నుండి వాటిని తరిమేస్తాయి.

అప్పుడు ఆ గొడవ జరిగాక చేతిలో ఉన్న ఎముకను ఒక ఏప్ పైకి విసరడం, ఆ విసిరిన ఎముక తెలుగు సినిమాలో చిన్నప్పటి హీరో పరిగెడుతూ పెద్దయినట్లు ఒక స్పేస్ షిప్ గా మారడం తో రెండో పార్ట్ స్టార్ట్ అవుతుంది.

అంటే మిలియన్ ఏళ్ల తర్వాత ఆ సెకండ్ పార్ట్ మొదలయింది. ఆ స్పేస్ షిప్ అంతరిక్షం లోని ఒక స్పేస్ సెంటర్ కి వస్తుంది. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల పరిచయాలు, వాళ్ళ మధ్య మీటింగ్స్ అయ్యాక వాళ్ళు అందరూ కలిసి ఎప్పుడో మిలియన్ ఏళ్ల కింద మూన్ మీద మట్టితో కప్పి పడి ఉన్న ఒక “మొనోలిత్” ని స్టడీ చెయ్యడానికి వెళతారు. హఠాత్తుగా దానిలో నుండి ఒక పెద్ద సౌండ్ వేవ్ వచ్చి జుపిటర్ మీదకు సిగ్నల్ వెళుతుంది.

ఇక అక్కడ నుండి కథ మూడో పార్ట్ కి వెళుతుంది.
(ఇది ఒక్కటే కొంచెం అర్థం అయ్యి చచ్చింది. కాబట్టి ఎక్కువ రాశా)

ఈ పార్ట్ లో జుపిటర్ మీద ఒక స్పేస్ సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ లో ఒక అయిదుగురు సైంటిస్ట్ లు ఉంటారు. వాళ్ళలో ముగ్గురు “రెస్ట్” తీసుకుంటూ ఉంటారు. మిగతా ఇద్దరూ పని చేస్తూ ఉంటారు. ఆ స్పేస్ సెంటర్ మొత్తం “హాల్” అనే ఒక సూపర్ కంప్యూటర్ కంట్రోల్ లో ఉంటుంది. అది అవసరం అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఒక రకంగా ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పచ్చు. ఒకసారి స్పేస్ షిప్ లో ఒక ప్రాబ్లం రావడంతో వాళ్ళు ఆ ప్రయోగం ఆపేసి కిందకు వెళ్ళిపోవదానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కానీ అలా మధ్యలో ఆపడం హాల్ కి ఇష్టం ఉండదు. ముందు అలా ఆపద్దు అని మర్యాదగా చెప్తుంది. ఈ ఇద్దరికీ హాల్ మీద అనుమానం వచ్చి లోపల ఒక గదిలో కూర్చుని అది తమ మాటలు వినకుండా సౌండ్ సిస్టమ్ మొత్తం ఆపేసి మాట్లాడుకుంటారు. కానీ అది అక్కడ ఉన్న కెమెరా ల నుండి లిప్ సింక్ ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నది అర్థం చేసుకుని, రెస్ట్ బాక్స్ లో రెస్ట్ తీసుకుంటున్న ముగ్గురినీ ఆక్సిజన్ ఆపేసి చంపేస్తుంది.

మిగతా ఇద్దరిలో ఒకరు సెంటర్ బయట ఉన్న సిగ్నల్ అంటెన్నా పని చెయ్యకపోతే రిపేర్ చెయ్యడానికి బయటకు వెళతాడు. అతడికి సెంటర్ తో ఉన్న వైర్ కట్ అయ్యేలా చేసి అంతరిక్షం లో తప్పిపోయి చనిపోయెలా చేస్తుంది. అతడిని కాపాడటానికి బయటకు వెళ్లిన మిగతా అతడిని కూడా లోపలకు రాకుండా డోర్ క్లోజ్ చేసి చంపెద్దామ్మని చూస్తుంది. కానీ హాల్ తో సంబంధం లేని ఒక ఎమర్జెన్సీ డోర్ నుండి లోపలకు వచ్చిన హీరో లోపల ఉన్న లాజికల్ మెమరీ కార్డ్ తీసేయడం తో హాల్ కథ, ఆ స్పేస్ సెంటర్ కథ ముగిసిపోతుంది.

అక్కడ ఉన్న ఒక చిన్న స్పెషల్ స్పేస్ షిప్ ద్వారా బయట పడిన హీరో అలా స్పేస్ లో ట్రావెల్ చేసి చేసి (పది నిమిషాలు) ఒక గదిలో ఆగుతాడు.

ఆ ట్రావెలింగ్ మొత్తం ఒక రకమైన కలర్స్ మధ్య సాగుతూ ఉంటుంది. దాన్ని స్టార్ గేట్ అంటారు.

అక్కడ ఉన్న గదిలో “తన భవిష్యత్తు ముసలి తనం, బెడ్ మీద ఉన్న తన శరీరం” చూస్తాడు. ఆ బెడ్ ముందు ఒక మోనో లిత్ ప్రత్యక్షం కావడం, ఆ బెడ్ మీద ఉన్న ముసలి వ్యక్తి ఆ మోనో లీత్ ను ముట్టుకోవడానికి చెయ్యి చాచడం తో కథ నాలుగో పార్ట్ లోకి వస్తుంది.

ఈ పార్ట్ లో తల్లి గర్భం లో ఉన్న ఒక పిండం అంతరిక్షం నుండి భూమి మీదకు ప్రయాణం చేస్తూ ఉండటం తో కథ ముగుస్తుంది.

ఒక్కో కథలో మనిషి చరిత్ర ఎలా మారుతుంది అనేది చూపించాడు. ఆ మోనో అనేది మనిషికి దేవుడి నుండి వచ్చిన అవకాశాలు లేదా వరాలు అనుకోవచ్చు. లేదా అలియెన్ నుండి వచ్చిన టెక్నాలజీ సహాయం అనుకోవచ్చు.

హాల్ కథ ఇప్పుడు నడుస్తున్న artificial intelligence ప్రపంచాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా మనం ఉపయోగించే సిరి, లేదా ఆలెక్సా, మన google, Facebook ఇవన్నీ కూడా మన జీవితాల్ని వాటి కంట్రోల్ లోకి ఎప్పుడో తీసేసుకున్నాయి. ఇవి కూడా ఒక స్టేజ్ అయ్యాక మనిషి చివరకు వాటిని, వాటి నుండి రాబోయే అపాయాలని తప్పించుకుని మళ్ళీ మామూలు మనిషి గా, ఇప్పుడు ఉన్న వాటి కన్నా ఉన్నతంగా బ్రతకడం దర్శకుడి ఉద్దేశ్యం అని నా భావం.

ఈ సినిమా వచ్చి దాదాపు 52 సంవత్సరాలు అయింది. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండి ఇలాంటి సినిమా ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా గొప్పగా అనిపించక మానదు.

ఈ సినిమా మొత్తం నిడివి 2.30 గంటలు. అయినా కూడా మొత్తం మాటలు 40 నిమిషాలు దాటవు.

మొదటి అరగంట, ఆఖరి నలభై నిమిషాలు అసలు మాటలే ఉండవు. ఈ సినిమా చూస్తూ చాలా మంది అప్పట్లో మధ్యలో లేచి వెళ్లిపోయారుట. అంత స్లోగా ఉంటుంది.

ఈ సినిమాకు వచ్చిన ఒకే ఒక్క ఆస్కార్ అవార్డ్ విజువల్ ఎఫెక్ట్స్ కి.

ఈ సినిమా మొదట ఫెయిల్ అయింది. కానీ ఉండే కొలది దీనిలో వాడిన ఎఫెక్ట్, స్టోరీ లైన్ కొంచెం కొంచెం అర్థం అయ్యాక జనం పెరిగి సూపర్ హిట్ అయ్యి, ఇప్పటికీ స్పేస్ సినిమాల్లో ప్రత్యేక స్థానం దక్కింది. ప్రపంచంలో వంద అద్భుతమైన సినిమా కలెక్షన్ లిస్టులో ఈ సినిమా కూడా ఉంది.

ఈ సినిమా డైరెక్టర్ స్టాన్లీ క్యుబ్రిక్ ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఎంతమంది అడిగినా ఒకటే సమాధానం చెప్పాడుట అదేంటంటే “ఈ సినిమా చూశాక మీకు ఉన్న పరిజ్ఞానం, ఆలోచనా విధానం బట్టి మీకు ఎలా అర్థం చేసుకోవాలి అనేది అర్థం అవుతుంది” అని.

ఈ సినిమా మొత్తం ఒక్క షాట్ లో చెప్పాలి అంటే “ఏప్” తన చేతిలో ఎముక విసిరి నప్పుడు అది ఎగిరి స్పేస్ సెంటర్ గా మారడం.

ఈ odyssey అనేది ఏదో ఒక మతానికి అందులో హీరో పేరు కూడా (బో మాన్) అనేది ఒక పాత్రకి చెందిన పేరు అని అంటారు. ఈ సినిమా చూసాకా ఓపిక ఉంటే వెతుక్కొండి.