21ఈ సినిమా ప్రపంచంలో డబ్బుకి సంబంధించిన విషయాలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అలాంటి వాటిలో మొదటి, రెండు ప్లేసుల్లో ఉండేవి ట్రెజర్ హంట్, దోపిడీ సినిమాలయితే తర్వాత స్థానంలో ఉండేది గ్యాంబ్లింగ్.
సుమతీ శతకంలో ఒక పద్యం ఉంటుంది. సిరితా వచ్చిన వచ్చును అని. అంటే డబ్బు కొబ్బరి కాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో తెలియనట్లు అలా వస్తుంది. ఏనుగు మింగిన వెలగ పండు లో నుండి గుజ్జు మాయం అయినట్లు మాయం అవుతుంది.
మిగతా వారి విషయాల్లో ఏమో గానీ గ్యాంబ్లర్స్ విషయంలో మాత్రం ఇది అక్షరాలా నిజం. వాళ్ళకి నిమిషాల్లో లక్షలు రావచ్చు లేదా సెకన్లలో రోడ్డున పడచ్చు.
అలా నిమిషాల్లో మిలియనీర్ అయ్యి క్షణాల్లో రోడ్డున పడ్డ ఒక హార్వర్డ్ స్టూడెంట్ కథే ఈ సినిమా.
స్పాయిలర్స్ ఉంటాయ్ కాబట్టి సినిమా చూద్దాం అనుకునే వాళ్లు చదవకండి.బెన్ MIT లో లెక్కల స్టూడెంట్. తెలివైన వాడు, బాగా చదువుతాడు. మంచి గ్రేడ్స్ కూడా వస్తాయ్. హార్వర్డ్ లో చదవాలి అన్నది ఇతని కల. కానీ దానికి కనీసం మూడు లక్షల డాలర్లు కావాలి. ఇతనికి, ఇతని తల్లికి అంత స్తోమత ఉండదు. పార్ట్ టైం కింద ఒక బట్టల షాపు లో పని చేస్తూ ఉంటాడు.
ఒకసారి క్లాస్ రూంలో ప్రొఫెసర్ మిక్కీ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తాడు. బెన్ బ్రెయిన్ మాములుది కాదు అని కనిపెట్టిన మిక్కీ ఇతన్ని తన టీమ్ లోకి రమ్మంటాడు.
మిక్కీ టీమ్ లో అయిదుగురు స్టూడెంట్ లు ఉంటారు. వీళ్లు చేసే పనేంటి అంటే క్యాసినోలకి వెళ్ళి “బ్లాక్ జాక్” అనే పేకాట ఆడి డబ్బు సంపాదించడం. అది కూడా లక్షల్లో. బ్లాక్ జాక్ అంటే సెట్ లో ఉన్న 52 కార్డ్స్ లో మీకు రెండు కార్డ్స్ వేస్తారు. క్యాసినో వాళ్ళు రెండు కార్డ్స్ వేసుకుంటారు. దీంట్లో ఎవరి కౌంట్ 21 కి దగ్గరగా ఉంటే వాళ్ళదే విన్. మీకు 19 వచ్చి క్యాసినో కి 20 వస్తె క్యాసినో నెగ్గినట్లు, అదే 18 వస్తె క్యాసినో ఓడిపోయినట్లు.
అదంత ఈజీ కాదు. దానికోసం మిక్కీ”కార్డ్ కౌంటింగ్” బేస్ మీద కొన్ని స్ట్రాటజీ లు తయారు చేస్తాడు. అయితే అవి అప్లయ్ చెయ్యాలి అంటే దానికి మామూలు బ్రెయిన్ చాలదు.
కార్డ్ కౌంటింగ్ అంటే సింపుల్. మీ ముందు మూడు సెట్ల కార్డ్ లు పెట్టారు. అంటే 52×3 = 156 కార్డులు ఉంటాయ్. ఒక నాలుగు రౌండ్ లు ఆట తిరిగాక కింద పడిన కార్డులు ఏమేం ఉన్నాయో దాన్ని బట్టి డెక్ లో ఇంకా ఎన్ని కార్డులు ఉన్నాయో, ఉన్న వాటిలో ఏమేం కార్డులు రావచ్చో లెక్క పెట్టడం. అది అంత ఈజీగా అవ్వదు.
క్యాసినో ల్లో అలా కార్డ్ కౌంటింగ్ చెయ్యడం ఇల్లీగల్ కాదు. కానీ గ్రూప్ గా చెయ్యడం మాత్రం ఇల్లీగల్. అలాంటి వాళ్ళమీద క్యాసినో కెమెరాలతో ఒక కన్నేసి ఉంచుతుంది. ఒక మనిషి నెగ్గిన వెంటనే వాడు మామూలుగా నెగ్గాడా మాయ చేసి నిగ్గాడా అన్నది కెమెరా ద్వారా కొన్ని సాఫ్ట్వేర్ లు వాడి డిసైడ్ చేస్తారు.
ఎవడైనా తేడా చేశాడని తెలిస్తే మాత్రం మిలియన్స్ లో వ్యవహారం, వ్యాపారం కాబట్టి వాడి బాడీ కూడా దొరకదు.కాబట్టి వీళ్లు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటారు. ప్రతీ వీకెండ్ కి లాస్ వెగాస్ ట్రిప్ వేసి క్యాసినో ల్లో ఇలా చిన్న చిన్న మొత్తాల్లో సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళతో బెన్ జాయిన్ అవ్వడం తో ఇంకా ఎక్కువ సంపాదించడం మొదలు పెడతారు.
బెన్ గ్రూప్ లో జిల్ అని ఒకమ్మాయి ఉంటుంది. బెన్ ఆమెతో ప్రేమలో పడతాడు.మిక్కీ ఎప్పుడూ తన గ్రూప్ కి ఒక మాట చెప్తూ ఉంటాడు. మనం గ్యాంబ్లింగ్ ఆడటం లేదు. బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి ఆట ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉండండి అని.
బెన్ రాకతో అప్పటి దాకా వీళ్ళ టీం లో మెయిన్ ప్లేయర్ గా ఉన్న ఫిషర్ కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. దాంతో ఫిషర్ జెలసీ ఫీల్ అవుతూ ఉంటాడు. అందువల్ల మిక్కీ ఫిషర్ ని టీమ్ నుండి బయటికి పంపేస్తాడు.అయితే ఒకరోజు అనుకోకుండా ఒక క్యాసినో లో సెక్యూరిటీ హెడ్ అయిన కోల్ విలియమ్స్ కన్ను బెన్ మీద పడుతుంది. బెన్ తాగకుండా తాగినట్లు యాక్ట్ చెయ్యడం, కొన్ని సిగ్నల్స్ ని బట్టి టేబుల్ దగ్గరకు వచ్చి ఆడటం, ఇలాంటి వన్నీ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. దాంతో బెన్ ని పట్టుకోవాలని విలియమ్స్ ట్రై చేస్తాడు. అక్కడ నుండి క్యాసినో చిప్స్ (టోకెన్లు) తో తప్పించుకున్న వీళ్ళకి అవి మార్చుకోడానికి బెన్ ఒక ఐడియా ఇస్తాడు. దాని ప్రకారం దాంట్లో పని చేసే చీర్ గర్ల్స్ అందరూ కూడా కొన్ని కొన్ని చిప్స్ మార్చి డబ్బులు బయటికి తెచ్చి వీళ్ళకి ఇస్తారు.
ఇలా కొన్ని లక్షలు సంపాదించి దాన్లో సగం మిక్కీ తీసుకుని మిగతా సగం వీళ్ళకి ఇస్తాడు.
ఒకసారి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడద్దు అని సిగ్నల్ వచ్చినా కూడా ఆడి బెన్ రెండు లక్షల డాలర్లు ఓడిపోతాడు. దాంతో మిక్కీ కి కోపం వచ్చి ఇతన్ని టీమ్ నుండి తీసేసి, ఇతను అప్పటి దాకా పోగొట్టిన రెండు లక్షల డాలర్లు ఇవ్వాలని, లేకపోతే చదువు సంగతి మర్చిపొమ్మని బెదిరిస్తాడు.
ఆ డబ్బుల కోసం మిగిలిన డబ్బులతో ముగ్గురు స్టూడెంట్స్ కలిసి క్యాసినో లోకి వెళతారు. కానీ అక్కడ మిక్కీ ఆల్రెడీ రహస్యంగా ఉప్పందించడం వల్ల బెన్ దొరికిపోతాడు. విలియమ్స్ బెన్ ని కొట్టి మళ్ళీ క్యాసినో లోకి అడుగు పెట్టద్దని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. నిరాశగా ఇంటికి వచ్చిన బెన్ కి తను అసైన్మెంట్స్ పూర్తి చేయనందువల్ల గ్రాడ్యుయేషన్ కి అర్హత సాధించిలేదనీ ఒక లెటర్ వస్తుంది. అంతే కాకుండా ఇతను అప్పటి దాకా సంపాదించి రూం లో దాచిన డబ్బులు కూడా ఎవరో కొట్టేస్తారు. దాంతో ఈ రెండూ చేయించింది మిక్కీ యే అని అర్థం అవుతుంది.
బెన్ మిక్కీ దగ్గరకు వెళ్ళి ఆఖరిసారిగా ఒక్క ఛాన్స్ ఇమ్మనీ దాంతో పోయిన మొత్తం డబ్బులు సంపాదిస్తానని ఒప్పించి, మిక్కీ తో సహా మొత్తం గ్యాంగ్ లాస్ వెగాస్ కి వెళతారు. అక్కడ దాదాపు ఆరు లక్షల డాలర్లు గెలిచాక విలియమ్ వీళ్లని గుర్తుపట్టి తరమడం మొదలు పెడతాడు. క్యాసినో నుండి పారిపోయి బయటకు వచ్చి తలో దార్లో తప్పించుకుంటారు. మిక్కీ తప్పించుకోవడం కోసం ఒక కార్ ఎక్కుతాడు. తీరా ఎక్కాక అది కాస్తా విలియమ్, బెన్ కలిసి ఆడిన డ్రామా అని అర్థం అవుతుంది. ఆ ఒప్పందం ప్రకారం బెన్ విలియమ్ కి మిక్కీ ని పట్టించాలి. ఆవేళ గెలిచిన డబ్బులన్నీ బెన్ ఉంచుకోవచ్చు.
అయితే విలియమ్ గన్ తో బెదిరించి బెన్ దగ్గర ఉన్న డబ్బులు కూడా లాగేసుకుని ఇక మళ్ళీ లాస్ వెగాస్ లో అడుగు పెట్టద్దనీ హెచ్చరించి పంపిస్తాడు.అయితే బెన్ ఈలోగా తన ఫ్రెండ్స్, రూం మేట్ లు అయిన మిల్స్ కి, క్యాం కి ఆల్రెడీ కార్డ్ కౌంటింగ్ నేర్పి అక్కడ ఆడటానికి పెడతాడు. ఈ గొడవ జరుగుతున్నప్పుడే ఇతని ఫ్రెండ్స్ ఆ స్ట్రాటజీ వాడి కొన్ని మిలియన్స్ నెగ్గి బయటకు వచ్చేస్తారు.
చివరికి బెన్ హార్వర్డ్ వర్సిటీ కి సెలెక్ట్ అవుతాడు. మూడు లక్షల డాలర్లు ఫీజ్ కింద కట్టాల్సి వస్తుంది. దానికోసం ఒక స్కాలర్ షిప్ కి అప్లయ్ చేస్తాడు. ఇతనికి మార్కులకు, తెలివితేటలకు తక్కువ ఉండదు. కానీ ఇతనితో సమానంగా తెలివితేటలు ఉన్నవాళ్లు ఇంకో 72 మంది ఉంటారు. వాళ్ళకన్నా నువ్వు గ్రేట్ అని నిరూపించే విషయం ఒకటి చెప్తే ఆ స్కాలర్ షిప్ నీకే వచ్చే ఏర్పాటు చేస్తా అని ఆ సంస్థలో ఉండే ఒక డైరెక్టర్ చెప్తాడు.
బెన్ తను చేసిన ఈ పని చెప్పి ఇంతకన్నా మిమ్మల్ని అబ్బురపరిచే సంఘటన చెప్పిన వాళ్ళకి స్కాలర్ షిప్ ఇవ్వండి అని చెప్పడంతో కథ ముగుస్తుంది.
ఈ సినిమా కథ ఇంత పెద్దగా రావడానికి కారణం బ్లాక్ జాక్ కోసం, కార్డ్ కౌంటింగ్ కోసం వివరంగా చెప్పడమే.
ఆసులు పెద్దయ్యా రాజులు పెద్దయ్యా అని రవితేజ ఆమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి సినిమాలో కొట్టిన సీన్ గుర్తుందా.
ఈ సినిమాని “Ben Mezrich” రాసిన “Brining the House Down” అనే పుస్తకం ఆధారంగా తీశారు. ఆ పుస్తకంలో కూడా ఒక ఆరుగురు MIT స్టూడెంట్స్ ఒక క్యాసినో లో ఇలాగే లక్షలు సంపాదిస్తారు.
PS: క్యాసినో లో జనాలు అన్నిటికన్నా ఎక్కువగా నెగ్గే అవకాశం ఉన్న ఓకే ఒక్క ఆట “బ్లాక్ జాక్”.
దాంట్లో విన్నింగ్ ప్రాబబిలిటీ దాదాపు – నేను చెప్పను.
అతి తక్కువ విన్నింగ్ ప్రాబబిలిటీ ఉన్న గేమ్ రౌలెట్ వీల్. జస్ట్ 1/36. మీరే లెక్కేసుకొండి.
#21, #21Movie, #JimSturgess, #KateBosworth, #LaurenceFishburne, #KevinSpacey, #RobertLuketic, #BringingDowntheHouse, #BenMezrich, #HollywoodTeluguReviews