Forrest Gump

ఇప్పుడు ఇంటా ఇంటా బయటా నిరాశ నిస్పృహ తో కూడిన కాలం నడుస్తుంది కాబట్టి సరదాగా కాసేపు ఆశావహ దృక్పధాన్ని కలిగించే ఒక సినిమాను చూద్దాం..!

మీరు ఈ లాక్ డౌన్ టైమ్ లో అర్జంట్ గా బయటకు వెళుతున్నారు. బండి మీద వెళుతున్న మిమ్మల్ని ఆపి పోలీసు మీ వెనక లాఠీ తో గట్టిగా కొట్టాడు. చాలా మందికి ఇది చేదు అనుభవం.

కాని ఆ వెనక్కాల ఎన్నాళ్ళ నుండో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒక “సెగ్గడ్డ” ఆ దెబ్బకి చితికి పోయింది. ఆ సెగ్గడ్డ ఆపరేషన్ చేసి తియ్యడానికి ఒక రెండు రోజుల ముందో డాక్టర్ 10 వేలు అడిగాడు..! మళ్ళీ మీరు ఆ డాక్టర్ దగ్గరకు వెళితే చితికి పోయింది కాబట్టి ఇక ప్రాబ్లం ఏమీ లేదు జస్ట్ ఆ దెబ్బ మానడానికి ఒక 100 రూపాయల ఆయింట్మెంట్ రాసి ఇచ్చాడు..! అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి..!

రైల్ ఎక్కడానికి వెళుతుంటే సరిగ్గా అప్పుడే ట్రాఫిక్ జామ్ అయ్యి రైలు వెళ్ళిపోయింది. మీరు ట్రైన్ మిస్ అయ్యారు. కానీ ఆ వెళ్ళిన రైలు ఏక్సిడెంట్ అయ్యి మీరు ఎక్కాల్సిన బోగీ మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయింది..! అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి..!

మీ అమ్మాయికి అనుకున్న ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగి సంబంధం “మీకు రావలసిన ఆస్తి రాకపోవడంతో కట్నం ఇవ్వలేక పోవడం వల్ల” తప్పిపోయింది. కానీ తర్వాత ఆ అబ్బాయి పెద్ద తాగుబోతు, ఆల్రెడీ ఒక పెళ్ళి అయింది, ఆ పెళ్ళాన్ని రోజూ కొట్టే శాడిస్ట్, అవన్ని దాచి పెట్టాడు అని తెలిసింది..! అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి..!

అమెరికాలో ఉద్యోగం ఊడిపోయి అప్పు చేసి టికెట్ కొని విమానం ఎక్కిన మీ పక్కన ఎవరో కూర్చుని ఉన్నారు. టైమ్ పాస్ కోసం ఏదో ఒక బిజినెస్స్ ఐడియా అతనికి ఇచ్చారు. తర్వాత రోజు అతను రతన్ టాటా అని, మీరిచ్చిన ఐడియా తో వ్యాపారం మొదలు పెడుతు సలహా ఇచ్చినందుకు మీకు కూడా పైసా పెట్టుబడి లేకుండా వాటా ఇస్తే..! అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి..!

అబ్బాయిగారు సినిమాలో కోట శ్రీనివాసరావు వెంకటేష్ తో చెరువులో కొబ్బరి కాయలు పడి వచ్చిన “లాభం” పాతిక వేలు..!, తుఫాన్ వచ్చి చెట్లు అన్నీ కూలిపోవడం వచ్చిన “లాభం”చేసిన యాభై వేలు..! అని చెప్తాడు..!

ఈ సినిమా చూస్తుంటే “అంతా మన మంచికే..!” అనే పెద్దల మాట నిజంగా నిజమేమో అనిపిస్తుంది..!

ఈ సినిమా “హీరో” ఫారెస్ట్ గంప్ జార్జియా లో ఒక బెంచ్ మీద పక్కన కూర్చున్న ఒక అపరిచిత వ్యక్తికి తన ఫ్లాష్ బ్యాంక్ చెప్పడంతో మొదలవుతుంది..!

అలబామా లో పుట్టిన హీరోకి చిన్నప్పటి నుండి వెన్నెముకకు ఏదో అనారోగ్యం సమస్య ఉండటం తో కాళ్ళకు ఒక రకమైన క్లిప్పు లాంటివి పెట్టుకుని తిరుగుతూ దానివల్ల వంకరగా నడుస్తూ ఉంటాడు..!

ఆ వంకర నడకను అనుకరించిన ఇతని ఫ్రెండ్ కొన్నాళ్లకు ఒక పెద్ద “పాప్ స్టార్”, డాన్సర్ అవుతాడు..!

తండ్రి ఉండడు. తల్లి ఏదో ఒక చిన్న పని చేస్తూ అతడిని పోషిస్తూ ఉంటుంది. ఆ ఇంటి దగ్గరే కొత్తగా వచ్చిన హీరోయిన్ అతనికి మంచి ఫ్రెండ్ అవుతుంది..!

అతనికి ఉన్న ఆ అవకరం వల్ల ఆ చుట్టు పక్కల ఉండే కొందరు పోకిరీ కుర్రాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఒకసారి హీరోయిన్ తో వెళుతూ ఉండగా వాళ్ళు ఆమెని ఏదో అనడంతో హీరో వాళ్ళ మీద తిరగ బడతాడు. వాళ్ళు అతన్ని కొట్టడానికి రాబోగా భయపడి పారిపోయే ప్రయత్నంలో అతని కాళ్ళకు ఉన్న ఆ క్లిప్పులు ఊడిపోయి మామూలుగా పరుగెత్తుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక రన్నింగ్ రేసు జరుగుతున్న గ్రౌండ్ లోకి పారిపోతాడు. అతను పరిగెత్తే విధానం చూసి చాలా ఫాస్ట్ రన్నర్ అవుతాడు అని అర్థం అయ్యి అతన్ని ఫుట్బాల్ టీమ్ లో తీసుకుంటారు..!

అనుకోకుండా స్కూల్ డేస్ అవ్వగానే చినప్పటి హీరో హీరోయిన్ విడిపోతారు..!

కాలేజ్ అయిన తర్వాత హీరో వెళ్లి ఆర్మీలో జాయిన్ అవుతాడు. అక్కడ అతనికి “బుబ్బా” అని ఒక వ్యక్తి ఫ్రెండ్ అవుతాడు…! బబ్బా కి ఆల్రెడీ షిప్పింగ్ లో అనుభవం ఉంటుంది. అతను ఆ అనుభవాలు హీరో తో అప్పుడప్పుడూ పంచుకుంటూ ఉంటాడు..! ఇద్దరూ retire అయిన తర్వాత ఒక షిప్పింగ్ కంపెనీ పెడదాం అని ఆలోచనలో ఉంటారు…!

ఇద్దర్నీ కలిపి వియత్నాం లో జరిగే యుద్ధానికి పంపుతారు. అక్కడ బుబ్బా చనిపోతాడు. అతన్ని వెతికే ప్రయత్నంలో ఉన్న హీరోకి అనుకోకుండా గాయపడి చనిపోయే పరిస్థితుల్లో ఉన్న ఒక “సైనిక పటాలం” కనిపిస్తుంది. ఇతను వాళ్ళని కాపాడతాడు. వాళ్ళలో ఇతని పై అధికారి అయిన డాన్ టైలర్ కూడా ఉంటాడు. కానీ ఆ అధికారికి రెండు కాళ్ళూ తీసెయ్యాల్సి వస్తుంది..!

ఆ సైన్యం లో గాయపడి చికిత్స తీసుకుంటూ ఉండగా సరదాగా నేర్చుకున్న “పింగ్ పాంగ్” ఇతన్ని పెద్ద స్పోర్ట్స్ సెలబ్రిటీ ని చేస్తుంది..! దానివల్ల అప్పటికే పింగ్ పాంగ్ లో బాగా పేరున్న “చైనా” నీ ఓడించడం వల్ల ఇతనికి ఇంకా పేరు వచ్చి ఒక రోజు ప్రెసిడెంట్ ను కలిసే అవకాశం వస్తుంది..!

ఆ కలిసిన రోజు ఇతని ద్వారా అనుకోకుండా బయట పడిన ఒక పెద్ద కుంభకోణం వల్ల ప్రెసిడెంట్ రాజీనామా చేయాల్సి వస్తుంది..! ఈ లోగా యుద్ధం ముగియడంతో ఇతన్నినింటికి పంపేస్తారు..!

అయితే ఆర్మీ లో నేర్చుకున్న పింగ్ పాంగ్ వల్ల ఇతనికి ఒక కంపెనీ కి ప్రచారం చేసే అవకాశం వస్తుంది. దానిద్వారా వచ్చిన డబ్బుతో ఒక షిప్పింగ్ బోటు కొంటాడు..! ఒకప్పుడు ఇతని పై అధికారి అయిన డాన్ టేలర్ కూడా ఇతనితో జాయిన్ అవుతాడు. ఇద్దరూ కలిసి ఆ షిప్పింగ్ బోటు నడుపుతూ ఉంటారు..!

ఒకసారి అనుకోకుండా సముద్రం లోకి వెళ్లి తుఫాన్ లో చిక్కుకు పోయి మర్నాడు తీరానికి వస్తారు. వీళ్ళు వచ్చేసరికి తీరంలో ఉన్న మొత్తం అన్ని బోట్లు కూడా తుఫాన్ దెబ్బకి నాశనం అయిపోయి ఉంటాయి. దానితో మిగిలి ఉన్న వీళ్ళ బోటుకి డిమాండ్ పెరగడంతో చాలా తక్కువ సమయంలోనే బాగా డబ్బు సంపాదిస్తారు..!

దానిలో వచ్చిన డబ్బులను డాన్ టేలర్ “ఆపిల్ ఇంక్” అనే ఒక కంపెనీలో పెడతాడు. హీరో కి ఆ కంపెనీ ఏంటో తెలియకపోయినా డాన్ మీద నమ్మకంతో అడ్డు చెప్పడు.! పైగా అదొక అపిల్ పళ్ళు అమ్మే కంపెనీ అని అనుకుంటూ ఉంటాడు..! కొన్నాళ్లకు అదే ఇప్పటి “Apple I phone” తయారు చేసే కంపెనీ అని మనకు తెలుస్తుంది.

వ్యాపారంలో ఏమీ వాటా లేకపోయినా కానీ తన బాధ్యతగా ఎప్పటికప్పుడు తన ఆర్మీ ఫ్రెండ్ “బబ్బ” కుటుంబానికి లాభాల్లో వాటా పంపిస్తూ ఉంటాడు..!

ఇలా ఇతను చేసే పని ఏది లాభం కోసం చెయ్యడు. ప్లాన్ చేసి చెయ్యడు. అందుబాటులో ఉన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ ఉంటాడు..!

ఇతని తల్లి, చిన్నప్పుడు విడిపోయిన గర్ల్ ఫ్రెండ్, అతని పై అధికారి అయిన డాన్ టేలర్, అసలు అతను జార్జియా ఎందుకు వచ్చాడు ఇవన్నీ చెప్పడం కన్నా చూస్తేనే ఇంకా బావుంటుంది..!

ఇతను సినిమా మొదట్లో బెంచ్ మీద పక్కన కూర్చున్న వ్యక్తిని పరిచయం చేసుకునే టప్పుడు “Bubbaa Gump Shrimp Company” నాదే అని చెప్తాడు. కానీ ఇతని వాలకం చూసి ఆ వ్యక్తి నమ్మడు..!

ఈ సినిమా అంతా కూడా 1960 నుండి 1994 దాకా నిజంగా జరిగిన సంఘటనలను హీరో జీవితం తో ముడి పెట్టడం తో నడుస్తుంది..!

చెమట పట్టి స్నానం చేస్తుంటే ఇదేమన్నా కూల్ బకెట్ ఛాలెంజ్ ఆ అని, బట్టలు కట్టుకుంటే అదేమన్నా బట్టలు కట్టుకుని ఫోటో పెట్టే ఛాలెంజ్ ఆ అని, పిల్లలతో సరదాగా ముద్దు పెట్టుకుంటే ఇంకేదో ఛాలెంజ్ ఆ అని అడిగే వ్యక్తులు లాంటి వాళ్ళు ఈ సినిమాలో హీరో రన్నింగ్ చేస్తుంటే మీరెందుకు రన్నింగ్ చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు హీరో చెప్పే సమాధానం చూస్తే నిజంగా ఇప్పటి ఫేస్ బుక్ ఛాలెంజ్ లకు సరిపోతుంది..!

ఈ సినిమాతో “Tom Hanks” కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది.

అంతే కాకుండా బెస్ట్ డైరెక్టర్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే తో పాటు దాదాపు ఇంకో 50 (గోల్డెన్ గ్లోబ్, బ్రిటిష్ అకాడెమీ లాంటివి) ఇతర అవార్డులు కూడా అందుకుంది..!

ఈ సినిమానే మన “ఆమిర్ ఖాన్” “లాల్ సింగ్ ఛద్దా” అని రీమేక్ చేస్తున్నాడు..!