Hacksaw Ridge
(రంపపు శిఖరం)
కురుక్షేత్రం లో ఆయుధం పట్టను కానీ మీ వైపున ఉంటాను అన్నప్పుడు కృష్ణుణ్ణి సుయోధనుడు యుద్ధం అయ్యేంత వరకు నమ్మలేదు. కానీ ధర్మరాజు నమ్మాడు.
అలాగే ఈ సినిమాలో “డెస్మండ్ డాస్” అనే సైనికుడు గన్ పట్టుకోను కానీ యుద్ధం చేస్తా అన్నప్పుడు కూడా అతని పై అధికారులు అతన్ని అలాగే చూసారు. కానీ అతని తండ్రితో కలిసి పని చేసిన ఒక “బ్రిగేడియర్ జనరల్” నమ్మి అతన్ని యుద్ధభూమి లోకి వెళ్ళడానికి అనుమతిస్తాడు. ఇక అతను ఆ యుద్ధం ఎలా చేశాడు అనేది ఈ “Hacksaw Ridge”.
డెస్మండ్ డాస్ ఫ్యామిలీ వర్జీనియా లో నివసిస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీ లో అతనికి అన్న, తల్లీ, తండ్రీ ఉంటారు. ఒకసారి చిన్నప్పుడు అతని అన్నతో జరిగిన చిన్న గొడవలో అతని అన్న ని గాయపరుస్తాడు. తర్వాత తప్పు తెలుసుకుని బైబిల్ లో ఉన్న “Thou shalt not kill” అనే వాక్యాన్ని నమ్మి దాన్నే ఫాలో అవుతాడు. అంటే “ఎవర్నీ చంపకూడదు” అని ఆ వాక్యం అర్థం. అందుకని మాంసాహారం కూడా మానేసి శాకాహారిగా మారిపోతాడు.
ఒకసారి గాయపడిన ఒక వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకు వెళతాడు అక్కడ “డొరొతి” అనే నర్సు పరిచయం అవుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఆమె ద్వారా మెడికల్ కి సంభందించిన బేసిక్ విషయాలు నేర్చుకుంటాడు.
ఈలోగా పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి చెయ్యడం తో ఆసక్తి ఉన్నవాళ్లు సైన్యం లో జాయిన్ అవ్వచ్చు అని అమెరికా పిలుపు ఇవ్వడంతో ఇతను కూడా తనపేరు ఇచ్చి జాయిన్ అవుతాడు. అయితే ట్రైనింగ్ ఇచ్చే సమయంలో తాను “గన్” ముట్టుకోను, శత్రువుని చంపను అని చెప్పడంతో అందరూ పిరికివాడు అని వెటకారం చేస్తారు. కానీ అతను తన పద్దతి మార్చుకోక పోవడంతో అతని పై అధికారులు ఆదేశాలను పాటించలేదు కాబట్టి “కోర్టు మార్షల్” చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటారు.
ఈ విషయం డెస్మండ్ తండ్రికి తెలిసి ఒకప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో తనతో కలిసి పని చేసిన ఒక అధికారి సైన్యం లో అత్యున్నత స్థాయి లో ఉండటం తో అతని రికమేండేషన్ ద్వారా ఇతనికి కోర్టు మార్షల్ నుండి తప్పించి, “Conscientious Objector” అనే ఒక రూల్ ద్వారా ఒక “మెడికల్ హెల్ప్” కోసం యుద్ధానికి పంపుతారు. ఆ రూల్ ప్రకారం తనకున్న మతపరమైన లేదా ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల సైన్యంలో కొన్ని రూల్స్ పాటించ వలసిన అవసరం లేని హక్కు కలిగి ఉండటం. ఉదాహరణకు సిక్కు సైనికులు షేవింగ్, హెయిర్ కటింగ్ నుండి మినహాయింపు కలిగి ఉండటం లాంటివి.
ఇలా అతని మొదటి యుద్ధం జపాన్ లోని “ఒకినావా” దగ్గర చెయ్యాల్సి వస్తుంది. దాని కోసం వీళ్ళు ఒక పెద్ద కొండ దాటాల్సి వస్తుంది. ఆ కొండని “Hacksaw Ridge” అని పిలుస్తారు. అది జపాన్ కి యుద్ధపరంగా ఒక ముఖ్యమైన ప్రదేశం. దానిమీద పట్టుకోసం అమెరికా ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఆ వేళ జరిగిన యుద్ధం లో జపాన్ సైనికుల ధాటికి తాళలేక చాలామంది అమెరికా సైనికులు గాయపడి యుద్ధంలో గాయపడి ఉంటారు. మిగిలిన సైనికులు ఇక తమ వల్లకాదు అని ఇంకా సైన్యం కావాలి అని కొండ దిగి ఆర్మీ క్యాంప్ బేస్ దగ్గరకు వెనక్కు వెళ్ళిపోతారు. డెస్మండ్ కూడా వెళ్లిపోతూ వుండగా ఒక సైనికుడు గాయపడి రక్షించమని నెప్పితో బాధపడి చేసే మూలుగులు వినిపిస్తాయి. ఇతను అతన్ని కాపాడి కొండ మీదనుండి తాడుతో కిందకు దింపెలోగా ఇంకో పిలుపు వినబడుతుంది. అతన్ని కూడా జపాన్ సైనికుల కంటబడకుండా కాపాడి తీసుకువస్తాడు.
ఇలా ఒక్కొక్కళ్ళు నీ యుద్ధభూమిలో ఆ చీకట్లో రహస్యంగా వెతకడం, గాయపడిన వాళ్ళకి నెప్పి తెలియకుండా మెడిసిన్ ఇవ్వడం, జాగ్రత్తగా జపాన్ సైనికుల కంటబడకుండా నేల మీద జాగ్రత్తగా పాక్కుంటూ కొండ చివరకు లాక్కుని రావడం, అక్కడ నుండి తాడుతో కొండ కిందకు దింపడం ఇలా దాదాపు 50 మంది సైనికులను కాపాడతాడు. అక్కడ కొండ కింద ఉన్న కొంతమంది సైనికులు ఆ తాడుతో కిందకు దింపబడే సైనికులను వెంటనే మెడికల్ క్యాంప్ కి పంపుతూ ఉంటారు. కానీ ఎవరు పై నుండి దింపుతున్నారు అనేది తెలియదు.
ఆఖరికి ఇతను ట్రైనింగ్ లో ఉండగా కోర్ట్ మార్షల్ కి రికమెండ్ చేసిన ఇతని పై అధికారి కూడా గాయపడి కదలలేని స్థితిలో ఉంటాడు, అతన్ని కూడా కాపాడి అతనితో కలిసి కిందకు వచ్చేస్తాడు.
ఒకపక్క ఇలా జరుగుతుండగా ఈ విషయం తెలియని ఇతని పై అధికారి ఆ కొండ కింద కొంతమంది సైనికులను కాపలా పెట్టీ ఇంకా సహాయం కోసం క్యాంప్ దగ్గరకు వస్తాడు.
కొంతసేపటికి డెస్మండ్ కాపాడిన సైనికులను బేస్ క్యాంపు దగ్గరకు తీసుకు వస్తారు. ఎవరు ఇంతమందిని కాపాడారు అని అడిగిన పై అధికారులకు “డెస్మండ్” అని జవాబు వస్తుంది.
మర్నాడు మళ్ళీ మరికొంతమంది సైనికులతో వెళ్ళిన అమెరికా ఈసారి జపాన్ మీద పై చేయి సాధించి “Hacksaw Ridge” మీద పట్టు సాధిస్తుంది.
డెస్మండ్ చూపించిన ధైర్య సాహసాలకు అతనికి సైన్యంలో అత్యున్నత సాహసవంటులకు ఇచ్చే “Medal of Honour” అవార్డ్ ఇచ్చి సత్కరిస్తారు.
డెస్మండ్, డొరొతి పెళ్ళి చేసుకుని 1990 లో ఆమె మరణించే దాకా కలిసి ఉన్నారు. తర్వాత 2006 మార్చ్ 23 న 87 ఏళ్ల వయసులో డెస్మండ్ కూడా మరణించాడు అని చూపడంతో సినిమా ముగుస్తుంది.
డెస్మండ్ పాత్రలో నటించిన నటుడు The Amazing Spider Man సినిమాలో “స్పైడర్ మాన్” పాత్రలో కనబడిన “Andrew Garfield”, అలాగే ఇతని పై అధికారి పాత్రలో నటించింది అవతార్ సినిమా లో హీరోగా చేసిన “Sam Worthington”.
అలాగే ఈ సినిమాలో ఇంకో ముఖ్యమైన పాత్ర అయిన సార్జంట్ గా మొదట ఈ సినిమా దర్శకుడు “మెల్ గిబ్సన్” నటిద్దామనుకున్నాడు. కానీ దర్శకత్వం మీద ఫోకస్ చెయ్యడం కోసం వేరే నటున్ని తీసుకున్నాడు.
ఈ సినిమా మొత్తం 59 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. దానిలో 19 రోజులు కేవలం యుద్ధసన్నివేశాలు కోసమే పట్టాయి.
ఈ సినిమా హీరో పాత్ర మొత్తం కూడా బైబిల్ లో చెప్పిన “Thou shalt not kill” అనే ఒకే ఒక్క వాక్యం మీద నడుస్తుంది. అదే మెల్ గిబ్సన్ అప్పట్లో క్రీస్తు మీద వివాదాస్పదం గా తీసిన “The Passion of the Christ” సినిమా తీయడం విశేషం.
మెల్ గిబ్సన్ తీసిన “అపొకలిప్తో” సినిమా లోని “బావిలో పిల్లాడిని కన్ సన్నివేశాన్ని మన పవన్ కళ్యాణ్ పులి సినిమాలో మొత్తం వాడుకున్నారు”.
మెల్ గిబ్సన్ నటించి దర్శకత్వం వహించిన “Brave Heart” సినిమా కి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి దగ్గర పోలికలు చాలా ఉన్నాయి అని సైరా సినిమా చూశాక అనిపించింది.
బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్స్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇలా దేనికీ కూడా ఆస్కార్ అవార్డ్ రాలేదు.
50 మంది సైనికులను లాక్కుని వచ్చిన డెస్మండ్ ఆస్కార్ అవార్డు మాత్రం లాక్కుని రాలేకపోయాడు.
2016 లో ఆ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ “la la land” సినిమా కోసం Damien Chazelle కి ఇచ్చారు.