ఒక రెస్టారెంట్ లో ఎనిమిది మంది (వైట్, ఆరంజ్, పింక్, బ్లూ, బ్రౌన్, బ్లండ్, ఏడ్డి, జో) కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అప్రస్తుతం.

అక్కడ తినేసాక ఒక షాపులో వజ్రాల దొంగతనం కోసం బయల్దేరతారు. వీళ్ళందరూ అసలు పేర్లతో కాకుండా ఇలా కలర్స్ వాడి మారు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. వీళ్ళకు పెద్ద బాస్ జో అయితే చిన్న బాస్ జో కొడుకు ఎడ్డీ. జో వీళ్ళందరినీ వెతికి పట్టుకుని ఒక షాపులో వజ్రాల దొంగతనం ప్లాన్ చేస్తాడు.

అయితే అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల వైట్ చనిపోతాడు, ఆరంజ్ కి బులెట్ షాట్ తగులుతుంది. వైట్, ఆరంజ్ ని కార్ లో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకు వెళ్దాం అంటే పోలీసులు ఉన్నారు కాబట్టి వీళ్లు ఉన్న డెన్ కి తీసుకుని వచ్చేసి జో వచ్చేదాకా వెయిట్ చేద్దాం అంటాడు. ఆ వస్తూ వస్తూ కార్లో చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అప్రస్తుతం.

ఈలోగా పింక్ కూడా వస్తాడు. వచ్చిన వాడు తిన్నగా ఉండక మనలోనే ఒకడు పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నాడు అందుకే దొంగతనం సరిగ్గా జరగలేదు అంటాడు. ఇద్దరూ కూడా మాటలతో మొదలయ్యి, తర్వాత ఏకంగా గన్స్ తీసుకుని షూట్ చేసుకోడానికి రెడీ అవుతారు. ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అప్రస్తుతం.

ఈలోగా బ్లండ్ వస్తూ వస్తూ ఒక పోలీస్ మాన్ ని కిడ్నాప్ చేసి తీసుకు వస్తారు.

ఈ బ్లండ్ ఒక సైకో. దొంగతనం జరిగేటప్పుడు చాలా మంది జనాన్ని చంపేస్తాడు. అంతే కాకుండా గతంలో జో తో కలిసి పని చేసి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి వస్తాడు. బయటకు వచ్చాక జో ఇతనికి ఒక “నో షో జాబ్” ఇప్పిస్తాడు. అంటే చాలా ఆఫీసుల్లో(ఎలాంటి ఆఫీసులో నేను చెప్పను.) చాలామంది చేసే “పని లేని ఉద్యోగం. జస్ట్ నెలకోసారి వచ్చి జీతం తిస్కోడం అంతే. కానీ బ్లాండ్ కి ఆ లైఫ్ బోరు కొడుతుంది. మళ్ళీ ఎలాగైనా నిజం పని ఇప్పించమని జో ని పిక్కుని తింటాడు. (ఈడేవడో పని రాక్షసుడు అన్నమాట.) దాంతో బ్లండ్ ని కూడా వీళ్ళతో పాటు ఈ దొంగతనానికి చేర్చుకుంటారు. ఇది వీడి ఫ్లాష్ బ్యాక్.

ఇందాకా వస్తూ వస్తూ బ్లాండ్ ఒక పోలీస్ నీ కిడ్నాప్ చేసి తెచ్చాడు కదా. పింక్, వైట్ వాడిని మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని కొట్టడం మొదలు పెట్టారు. ఈలోగా ఎడ్డీ వచ్చి బ్లాండ్ ని అక్కడ కాపలా ఉండమని చెప్పి, పింక్ నీ, వైట్ నీ తీసుకుని బయటకు వెళతాడు.

బ్లాండ్ ఖాళీగా ఉండకుండా పోలీస్ ని ఇంకా టార్చర్ చేసి కుడి చెవి కట్ చేసేసి పెట్రోల్ పోసి తగలెట్టెయ్యడానికి ప్లాన్ చేసి కాన్ తో పెట్రోల్ పోసి సరిగ్గా నిప్పు అంటించబోయే సరికి..!

ఇక్కడితో చెప్పడం ఆపుతా. ఎందుకంటే ఇక్కడ నుండి సినిమా ఇంకా బావుంటుంది. అదే క్లైమాక్స్.

ఇది జస్ట్ గంటా ముప్ఫై నిమిషాల చిన్న సినిమా. Pulp Fiction, Jackie Brown, Kill Bill, Inglorious Bastards, Dijango లాంటి మాస్టర్ పీసెస్ తీసిన క్వింటెన్ టోరంటినో మొదటి సినిమా.

మామూలుగా గ్యాంగ్స్టర్ సినిమాలూ లేదా దొంగతనాలు మీద సినిమాలు అంటే మాటలు తక్కువ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మాటలు ఉన్నా కూడా అదేదో ఒకటీ రెండూ పాత్రలు ఎక్కువ మాట్లాడతాయి. మిగతావన్నీ తక్కువ మాట్లాడతాయి.

కానీ ఈ సినిమాలో మాత్రం హీరో, విలన్, కమెడియన్, వాడూ వీడూ అనే తేడా లేకుండా అందరూ మొదటి సీన్ నుండే లోడా లోడ వాగుతూ ఉంటారు.

ఈ లొడా లొడా వాగుడు..!
ధడా ధడా కాల్చుడు..!

అనేవి టోరెంటినో సినిమాల్లో కామన్ గా కనబడే రెండు విషయాలు. ఈ రెండూ కూడా సరిగ్గా ప్రతీ సినిమాలోనూ వాడుకున్నాడు. Dijango లో డిన్నర్ సీన్ అయినా, కిల్ బిల్ క్లైమాక్స్ లో బిల్ కి, బ్రైడ్ కి వచ్చే డిస్కషన్ అయినా, Inglorious bastards లో under ground bar సీన్ అయినా అవి లేకపోతే సినిమా లో ఏదో లోపం అన్నట్టు. ఇందాకా పైన రాసిన ఇక్కడ అప్రస్తుతం అన్నది సినిమాలో మాత్రం చాలా అవసరం.

ఈ సినిమా అవడానికి ఒక దొంగతనానికి సంబంధించిన క్రైమ్ స్టొరీ అయినా కూడా మాయాబజార్ సినిమాల్లో పాండవుల్లా ఆ దొంగతనం మాత్రం కనబడదు. ఈ సినిమాని మొదట్లో తక్కువ బడ్జెట్ లో అంటే దాదాపు ముప్పై వేల డాలర్లు లో తీద్దాం అనుకున్నారట. కానీ సాహో కి ముందు బాహుబలి రావడం వల్ల బడ్జెట్ పెంచినట్టు అనుకోకుండా ఒక డబ్బులున్న ప్రొడ్యూసర్, మైఖేల్ మ్యాడ్సన్ లాంటి నటులు (అనుష్క, మాధవన్ చేసిన నిశ్శబ్దం లో విలన్) యాడ్ అవ్వడంతో బడ్జెట్ ఏకంగా పది లక్షల డాలర్లకు పెరిగింది.

అంతేకాకుండా తన సినిమాకి ఫ్రీగా మేకప్ చేసిన అతనికి క్విడ్ ప్రో కో బేసిస్ మీద Quentin Tarantino ఫ్రీగా స్క్రిప్ట్ కూడా రాసి పెట్టాడట.

ఈసినిమాలో చాలా కాస్ట్యూమ్స్, properties ఎవరికి వాళ్ళే సొంతంగా తెచ్చుకున్నారు. కారణం లో బడ్జెట్.అంతేకాకుండా అసలు దొంగతనం చూపించరు. కారణం బడ్జెట్.

Quentin Tarantino సినిమాల్లో ఆడ పాత్రలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఈ సినిమాలో జస్ట్ ముప్పై సెకన్లు కనబడే ఓకే ఒక పాత్ర వల్లే మిగతా సినిమా అంతా మారిపోతుంది. ఖుషీ సినిమాలో సూర్య లాగన్న మాట.

ఇంతకీ ఈ సినిమా పేరుకు అర్థం ఏంటో తెల్సా..!

కుక్కలు అనేవి విశ్వాసానికి మాత్రమే కాదు. ఇంకో దానికి కూడా ఫేమస్. దానికి ఒక సూక్తి కూడా ఉంది.

అదే “కాట్ల కుక్కలెల్ల ఎపుడు కలహించుట నష్టము”.

ఒక చోట గోయ్యిలో దెబ్బలాడుకుంటున్న కుక్కల్ని చూసి ఈ పేరు పెట్టాడట. ఈ సినిమాలో కూడా అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చస్తూ ఉంటారని ఈ పేరు పెట్టాడు.!