The Fool

ప్రపంచంలో ఎక్కడైనా కామన్ గా ఉండే కొన్ని విషయాలు ఉంటాయి. అవి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. అది ఇండియా, అమెరికా, రష్యా, పేద దేశం, ధనిక దేశం ఏదైనా సరే కొన్ని మారవు.

అలాగే అన్ని కాలాల్లోనూ ఒక విషయం కూడా కామన్. గవర్నమెంట్ కి ఎదురెళ్లి జనానికి మంచి చేద్దాం అని వచ్చేవాళ్లు చివరకు నానా కష్టాలు పడి చివరకు ఆ జనానికి, ప్రభుత్వానికి ఇద్దరికీ శత్రువులు అవ్వడం.

అది శాస్త్రవేత్తలు కావచ్చు, సామాజిక వేత్తలు కావచ్చు, సాధువులు కావచ్చు ఆఖరికి ఒక చిన్న “ప్లంబర్” కూడా కావచ్చు.

రష్యాలో ఒక “పేరు లేని” ఊరిలో ఈ కథ మొదలవుతుంది. హీరో ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే ఒక వ్యక్తి దగ్గర ప్లంబర్ గా పని చేస్తూ ఉంటాడు. అలాగే పని చేసుకుంటూ సివిల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు.

ఒకరోజు రాత్రి ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్ లో వాటర్ పైపు లీక్ అయింది అని పిలుస్తారు. ఆ ఏరియా ఇతనిది కాకపోయినా ఆ వేళ అక్కడ ప్లంబర్ లేకపోవడంతో ఇతను వెళ్లాల్సి వస్తుంది.

ఆ అపార్ట్మెంట్ సముదాయం ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం పేదలకోసం ప్రభుత్వం కట్టించింది. అక్కడ ఉండే వాళ్ళు అందరూ దిగువ మధ్యతరగతి కుటుంబాలు, ఏరోజు డబ్బులు ఆరోజు తెచ్చుకుని గడిపే బాపతు.

ఇతను పనిచేసే కంపెనీ దాని మరమ్మతులు చూసే కాంట్రాక్ట్ తీసుకుంది. అందుకే ఇతను వెళ్లాల్సి వచ్చింది.

అక్కడ ఆ పైపులు పగిలిన విధానం చూసి ఇతనికి అనుమానం వచ్చి మళ్ళీ వస్తా అని బయటకు వచ్చి బిల్డింగ్ చుట్టూ పరిశీలిస్తాడు. ఒక రెండు చోట్ల కింద పునాది నుండి పై అంతస్తు దాకా రెండుగా చీలి కింద పునాది కొద్ది కొద్దిగా ఒక వైపు ఒరుగుతూ ఉంటుంది.

అది చూసి ఇతనికి ఆ బిల్డింగ్ ఇంకో ఇరవై నాలుగు గంటల కన్నా ఎక్కువ ఉండదు అని, ఈ లోగా ఖాళీ చేయిస్తే ఆ బిల్డింగ్ లో ఉన్న 820 మందిని ప్రాణాలతో కాపాడచ్చు అని తనకు తెలిసిన వ్యక్తి ద్వారా అప్పటికప్పుడు ఆ నగర మేయర్ ని కలిసి సంగతి వివరిస్తాడు.

ఆవేళ రాత్రి ఆ మేయర్ ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. సిటీ లో ఉన్న పెద్దలు, అన్ని డిపార్ట్మెంట్ లోని పెద్ద తలకాయలు అక్కడే ఉండి తాగి తందనాలు ఆడుతూ ఉంటారు. ఇతను వెళ్ళి మేయర్ కి విషయం చెప్పేసరికి ఆమె అక్కడ ఉన్న పోలిసు హెడ్, ఫైర్ సేఫ్టీ హెడ్, మెడికల్ హెడ్ ఇలా అందరినీ సమావేశ పరిచి విషయం అడుగుతుంది.

ఇతను వెళ్లేసరికి ఇతని కంపెనీ హెడ్ కూడా అక్కడే ఉండి అదంతా అబద్ధం, ఏమీ జరగదు. ఇతను జస్ట్ పేరు కోసం ఈ హడావుడి చేస్తున్నాడు అని కొట్టి పడేస్తాడు. అసలు విషయం ఏమిటంటే ఆల్రెడీ బిల్డింగ్ రిపేర్ పని కోసం ఇచ్చిన డబ్బులు తినేశాడు. అంతే కాకుండా ఎవరి వాటా వాళ్ళకు పంచేసాడు.

ఇక అక్కడనుండి చర్చ మొదలవుతుంది. వాళ్ళను కాపాడాలా వద్దా, కాపాడి వేరే చోట ఉంచాలి అంటే దాదాపు 25 కోట్లు కావాలి. పోనీ అలాగే వదిలేద్దాం అంటే ముందు ఎలక్షన్స్ ఉన్నాయి. పోనీ ప్రమాదం జరిగింది అని రాద్దాం అంటే ఆల్రెడీ బిల్డింగ్ రిపేర్ చేసినట్టు ఇతను పని చేసే కంపెనీ 16 కోట్లు బిల్ తీసేసుకుంది. అంతా బానే ఉంది అని ఫైర్ సేఫ్టీ అతను సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ఆ డబ్బులో మేయర్ కి కూడా వాటా ఉంది.

చివరకు హీరో వాళ్ళను కాపాడాడ లేదా అనేది మిగతా సినిమా.

ఈ సినిమా కథ రాత్రి 8 గంటలకు మొదలై పొద్దున్న 8 గంటలకు అయిపోతుంది.

ఈ సినిమా రష్యన్ లో ఉంటుంది. సబ్ టైటిల్స్ లో చూడాలి. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసారుట. అందుకే సినిమాలో ఆ ఊరికి పేరు ఉండదు.

ఈ సినిమా ని రష్యాలో ఒక ఛానెల్ టీవీ లో వెయ్యగా ఆ వెంటనే దాని ప్రసారానికి అనుమతి ఇచ్చిన అధికారిని ఉద్యోగం లోనుండి పీకేశారు.

2014 లో విడుదల అయిన ఈ సినిమా హిట్ అయ్యింది.

ఇంతకీ ఈ సినిమాకి హీరో అని కాకుండా ఫూల్ అని ఎందుకు పెట్టారా అని ఆలోచిస్తే సినిమా చివరిలో అర్థం అయింది. ఎందుకంటే ప్రాణాలకు తెగించి, స్వార్థం చూసుకోకుండా జనాలకు మంచి చేద్దాం అనుకునేవాడిని ఈ కాలంలో ఫూల్ అనే అంటారు అని గుర్తుకు వచ్చింది.