The-Platform

ఈమధ్యన లాక్ డౌన్ సమయాల్లో సూపర్ మార్కెట్లు కి, కిరాణా షాపుల్లో కి, కూరగాయల దుకాణాల కి కొంతమంది కార్లలో వచ్చి అవసరం లేకపోయినా రెండు మూడు నెలలకు సరిపోయే సామాన్లు ఒకేసారి కొనుక్కుపోయారు అని వార్తలు చదివాం గుర్తుందా..!

అలా డబ్బులున్న వాళ్ళు ఒకేసారి పట్టుకుపోవడం వల్ల సరుకులు దొరక్క రేట్లు పెరిగి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, పేద వాళ్ళకు చాలా ఇబ్బంది అయ్యింది.

దానివల్ల ఏరోజు బియ్యం ఆరోజు కొనుక్కునే చాలా మందికి అసలు ఒక కేజి బియ్యం కూడా దొరక్క, మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి కోనాల్సి వచ్చింది. అలా డబ్బులు ఉన్నవాళ్లు కొనుక్కున్నారు, లేనివాళ్ళు సరుకుల కోసం మళ్ళీ తనవంతు వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది. అది కొన్ని సరుకులకు రోజులు పడితే కొన్నింటికి వారాలు పట్టింది. చివరకు ప్రభుత్వాలు కలుగజేసుకుని ఎలాగో అందరికీ ఇబ్బంది లేకుండా చూశాయి.

అలాగే ఈ ప్రపంచం జీవులు అన్నీ బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని, వనరులు కలిగి ఉంది. ఎవరికి అవసరం అయినంత, వనరులను పరిమితం గా వాడుకున్నంత కాలం ఈ ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉంటాయి.

కానీ కొందరు తమకున్న బలం వల్ల, ఆశ వల్ల ఉన్న వనరుల్లో ఎక్కువ తమకే కావాలి అని, లేదా ఉన్న వనరులు అన్నీ ఒకేసారి వాడేసి ఇవాల్టికి మాత్రమే కాకుండా తమ తరతరాలకు కూడా పోగేసుకుని కింద ఉన్న బీదా బిక్కి కీ మిగతా జీవులకు కూడా కనీసం నీళ్ళు కూడా దొరక్కుండా దాచేసుకు ని మరీ డబ్బు చేసుకుంటున్నారు. కానీ చివరకు ఆ డబ్బు తినడానికి పనికిరాదు.

ఈ ప్లాంట్ ఫాం సినిమా కాన్సెప్ట్ కూడా అదే.

కొంత మంది వాలంటీర్స్ ని ఫ్లోర్ కి ఇద్దరు చొప్పున ఒక కొన్ని వందల అంతస్తుల భవనంలో బంధించి ఉంచుతారు. ఒక్కో బందీ 6 నెలలు సమయం ఆ భవనంలో ఉండాలి. తర్వాత వాళ్లకు ఒక డిగ్రీ లాంటిది ఇస్తారు. ఆ డిగ్రీ వల్ల వాళ్ళు తర్వాత ప్రపంచంలో అత్యంత అందమైన జీవితం గడపవచ్చు. బంధనాలు అంటే తాళ్ళతో కట్టి కాదు. ఆ ఫ్లోర్ లో ఒక మంచం, తాగడానికి నీళ్ళు ఉంటాయి అంతే. వాళ్ళకు ఆ ఫ్లోర్ కి తప్ప వేరే ఫ్లోర్ కి వెళ్ళడానికి కూడా దారి ఉండదు. రోజూ పై ఫ్లోర్ నుండి ఒక పెద్ద టేబుల్ లాంటింది కిందకి వస్తుంది. దాని మీద ఉన్న ఆహార పదార్థాలు పై ఫ్లోర్ వాళ్ళు తినగా ఏమైనా మిగిలితే కింద ఫ్లోర్ వాళ్ళకు వస్తాయి.

అంటే ఆ టేబుల్ టాప్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు టేబుల్ నిండా ఆహారం ఉంటుంది. వాళ్ళు తినగా మిగిలిన వి తర్వాత అంతస్తు వాళ్లకు, వాళ్ళు తినగా ఏమైనా మిగిలితే తర్వాత అంతస్తు వాళ్లకు ఆ తర్వాత కూడా ఏమైనా మిగిలితే కింద వాళ్ళకు ఇలా అన్ని వందల ఫ్లోర్లకు ఆ టేబుల్ రోజుకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ పదార్థాలు ఏమీ మిగలకపోతే మళ్ళీ మర్నాడు దాకా ఎదురు చూడాలి. లేదా ఎప్పుడైనా పై అంతస్తుకు మార్చే దాకా ఎదురు చూడాలి. అలా ఆహారం తమ ఫ్లోర్ దాకా రాక కింద అంతస్తులో చాలా మంది ఆకలితో చచ్చిపోతు ఉంటారు.

అందులో ఉన్న బందీలను నెలకు ఒక ఫ్లోర్ చొప్పున మారుస్తూ ఉంటారు. ఆ మార్చినప్పుడు కొన్నిసార్లు కింద ఫ్లోర్ కి, కొన్ని సార్లు పై అంతస్తు లకు మారుస్తూ ఉంటారు. ఆ బందీలు వాళ్లకు కావలసిన ఏదైనా వస్తువును తమతో బాటు ఆ భవనానికి తీసుకు రావచ్చు. అది ఒక పుస్తకం ఆయుధం లేదా ఆట వస్తువులు. ఇలా ఏదైనా తమకు అవసరం అనుకున్న వస్తువు తమతో బాటు తెచ్చుకోవచ్చు.

హీరో కూడా అలా వాలంటీర్ గా వస్తాడు. అయితే వచ్చిన వారం రోజులకే పరిస్ఠితి అర్థం చేసుకుని మనం కొద్దిగా తిని కింద ఫ్లోర్ వాళ్ళకు కూడా ఉంచుదాం అంటాడు. కానీ ఫ్లోర్ మెట్ ఒప్పుకోడు. హీరో ఏమీ చెయ్యలేక పోతాడు. తర్వాత నెల హీరో కి పై అంతస్తులో ఉండే అవకాశం వస్తుంది. అంటే తను కొద్దిగా తిని మిగతా వాళ్లకు కూడా ఆహారం పంపే అవకాశం వస్తుంది.

అవకాశం ఉన్న హీరో మిగతా అంతస్తుల వాళ్ళకు అందరికీ ఆహారం అందడం కోసం ఏం చేశాడు అనేది మిగతా సినిమా..!

ఈ సినిమా చూస్తుంటే ధనిక పేద ప్రజల మధ్య జరిగే సంఘటనలు గుర్తుకు రాక మానవు. అధికారం, బలం, అవకాశం ఉన్నవాళ్లు లేని వాళ్ళను ఎలా దోచుకుంటూ ఉన్నారు, అసలు ఆ తారతమ్యాలు పోవాలి అంటే కావాల్సింది ఎంటి, కేవలం చదువు సరిపోతుందా..? ఇవన్నీ కూడా సింపుల్ గా చూపిస్తాడు.

సినిమా అంతా ఓకే లొకేషన్ లో జరుగుతుంది. సింపుల్ గా గంటన్నర లో అయిపోతుంది.

ఈ సినిమా 2019 లో “Toronto International film Festival” అవార్డ్ కూడా గెలుచుకుంది.

నోట్
————-
ఈ సినిమా పక్కాగా పెద్దలకు మాత్రమే సినిమా. ఒక సన్నివేశంలో ఆహారం దొరక్క తన ఫ్లోర్ మేట్ నీ చంపి తినాల్సి ఉంటుంది. అలాంటి సీన్లు చాలా ఉంటాయ్. కాబట్టి ఒంటరిగా కూర్చుని చూడటం క్షేమం. కడుపులో తిప్పితే ఆపేసి మళ్ళీ వచ్చి చూడచ్చు. అయితే ఆల్రెడీ “saw” మూవీ చూసిన వాళ్ళకు కొంచెం పర్లేదు.