రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యం లో చాలా సినిమాలు వచ్చాయి. మామూలుగా యుద్ధం అంటే పైకి కనిపించే నిప్పులు కక్కే గన్నులు, తెగిపడిన కాళ్ళూ చేతులూ, రక్త పాతం, భీభత్స బాధాకర భయానక వాతావరణం మాత్రమే కాకుండా లోపల జరిగే కుట్రలు, ఆ యుద్ధాల వల్ల నాశనం అయిన జీవితాలు కూడా ఉంటాయి.
డన్కిర్క్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, హాక్ సా రిడ్జ్ ఇవన్నీ యుధ్ధ భూమి లో జరిగే కథల కేటగిరీ లోకి వస్తే.
కాసాబ్లాంకా, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, షిండ్లర్స్ లిస్ట్, The Boy in the striped pyjamas ఇప్పుడు చెప్పిన ఈ సినిమా రెండో కేటగిరీ కి వస్తాయి.
వినోద భరితంగా ఉన్నప్పటికీ మళ్ళీ దాంట్లో కూడా భీభత్స భయానక సన్నివేశాలు ఉన్న సినిమా ఇది.
ఈ సినిమాలో రెండు కథలు జరుగుతూ ఉంటాయి.
1941 ప్రాంతం లో హిట్లర్ సైన్యానికి చెందిన “హాన్స్ ల్యాండా” అనే ఒక సైనికాధికారి తప్పించుకు పోయిన కొంతమంది జ్యూయిష్ కుటుంబాల కోసం ఎంక్వైరీ చెయ్యడానికి ఒక ఫ్రెంచ్ రైతు ఇంటికి వస్తాడు. వాళ్ళల్లో అన్ని కుటుంబాల ఆచూకీ తెలుస్తుంది. కానీ ఒక కుటుంబాన్ని మాత్రం ఈ రైతు తన ఇంట్లో దాచాడు అని అనుమానం వచ్చి బెదిరించి ఆ రైతు తో నిజం చెప్పిస్తాడు. రైతు భయపడి ఆ కుటుంబం ఆచూకీ చెప్పడంతో ఆ జ్యూయిష్ కుటుంబాన్ని మొత్తం చంపేస్తాడు. కానీ ఒక అమ్మాయి మాత్రం తప్పించుకుని పారిపోతుంది. సరేలే అమ్మాయే కదా అని “హాన్స్ ల్యాండా” వదిలేస్తాడు.
అలా నాలుగేళ్ళు గడిచిపోతాయి. కథ 1944 నుండి స్టార్ట్ అవుతుంది.
రెండో కథలో “హిట్లర్ సైన్యానికి” వ్యతిరేకంగా అమెరికాకి చెందిన లెఫ్ట్నెంట్ “అల్డో” ఒక చిన్న సైజ్ సైన్యం కూడగట్టుకుని గెరిల్లా పద్ధతిలో పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఈ గ్రూప్ నే “బాస్టర్డ్స్” అని పిలుస్తారు. ఈ అల్దో జనాన్ని రిక్రూట్ చేసుకునేటప్పుడే తనకు ప్రతీ “బాస్టర్డ్” కనీసం ఒక పదిమంది నాజీ సైనికుల కపాలాలు తేవాలి అని ప్రతిజ్ఞ చేయిస్తాడు. పొరపాటున ఎవరైనా నాజీ సైనికుడిని కానీ ప్రాణాలతో వదలాలి అంటే నుదురు మీద “స్వస్తిక్” (హిట్లర్ జండా గుర్తు) వేసింపంపిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు నాజీలు అని జనానికి చెప్పడం.ఈ అల్దో కి ఇద్దరు అసిస్టెంట్ లు ఉంటారు. వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు అంటే మనిషిని “బ్రతికుండగానే చంపేస్తారు”. అది కూడా మామూలుగా కాదు ఒక బేస్ బాల్ బ్యాట్ తో బుర్ర మీద కొట్టి పైన డిప్ప మొత్తం పీకేసి వాళ్ళ బాస్ కి గిఫ్ట్ గా ఇస్తారు.
అలా పారిపోయిన ఆ అమ్మాయి పారిస్ లో ఒక సినిమా థియేటర్ నడుపుతూ ఉంటుంది. ఈ థియేటర్ కి ఒకసారి ఫ్రెడరిక్ అనే ఒక కుర్ర నాజీ సైనికుడు వచ్చి ఆమెని చూసి ప్రేమలో పడతాడు.
ఈ సైనికుడికి ఒక కథ ఉంటుంది. అదేంటంటే ఇతను ఒక యుద్ధం లో దాదాపు 200 మందిని చంపేస్తాడు. మన మగధీర కన్నా ఒక వందెక్కువన్నమాట. ఎలా చంపేడు అన్నది సినిమాలో చూపించే సినిమాలో చూడండి.
ఇలాంటి వాడి మీద సినిమా తీస్తే జనానికి నాజీ సైన్యం అంటే భయం ఉంటుంది, సైనికులకు మాంఛి స్ఫూర్తిగా ఉంటుంది అని ఆలోచించి హిట్లర్ ప్రచార సహాయకుడు అయిన “జోసెఫ్ గోబెల్స్” ఆలోచించి ఒక సినిమా తీయిస్తాడు. ఫ్రెడరిక్, గోబెల్స్ ని రిక్వెస్ట్ చేసి ఈ సినిమా థియేటర్ లో ప్రివ్యూ వెయ్యమని అడుగుతాడు. గోబెల్స్ మొదట ఒప్పుకోక పోయినా తర్వాత ఓకే అంటాడు.
ఈ ప్రివ్యూ చూడటానికి జర్మనీ ముఖ్య సైనికాధికారులు అందరికీ ఆహ్వానం వెళుతుంది. ముఖ్య అతిథిగా హిట్లర్ కూడా వస్తాడు. ఈ సమాచారం “బాస్టర్డ్” గ్రూప్ కి వెళుతుంది. అక్కడే మొత్తం జర్మనీ ఆర్మీ బ్యాచ్ ని లేపెయ్యడానీకి ప్లాన్ చేసుకుంటారు. అందుకు వీళ్లల్లో ఒక నలుగురు ఆ ప్రివ్యూ కి ముందు జరిగే పార్టీ కి వెళ్లి సమాచారం బయటకు పంపగలిగితే తర్వాత మిగతా వారు వచ్చి థియేటర్ పేల్చేస్తారు.
ఆ పార్టీకి వెళ్ళడానికి వీళ్ళకు ఒక స్టార్ నటి సహాయం చేస్తుంది. ఆమె అసలు వృత్తి నటి కాదు. UK కి చెందిన ఒక లేడీ గూఢచారి. అండర్ కవర్ ఆపరేషను లో ఉండి వీళ్ళకు సహాయం చేస్తుంది. ఆ సమాచారం ఇవ్వడం కోసం ఒక రెస్టారెంట్ కి రమ్మని కబురు పంపుతుంది. అక్కడ ఆమెతో పాటూ “జర్మన్ ఆర్మీ వేషాల్లో” ఉన్న ఇంకో ఇద్దరు UK అండర్ కవర్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు ముగ్గురూ అక్కడ కలిసాక ఒక “నిజమైన జర్మనీ” ఆఫీసర్ కూడా అనుకోకుండా వస్తాడు. అతనికి వీళ్ల వాలకం చూసి అనుమానం వస్తుంది ఈ అనుమానం కూడా చాలా చిన్న విషయానికి వస్తుంది. అది కాస్తా పెద్దది అయ్యి అందరూ కాల్చుకు చచ్చిపోతారు. కానీ ఈ నటి మాత్రం కాలికి బుల్లెట్ తగిలి బ్రతుకుతుంది. పోలీసులకు కబురు వెళుతుంది.
ఈలోగా “బాస్టర్డ్” వచ్చి ఆమెని రహస్య స్థావరానికి తీసుకెళ్ళి వైద్యం చేస్తారు. ఆ మర్నాడు జరిగే పార్టీ కి ఆల్డో అతని ఇద్దరు సహాయకులు డైరెక్టర్, కెమెరామన్, కెమెరా అసిస్టెంట్ లాగా వెళదాం అని ప్లాన్ చేసుకుంటారు.
వీళ్ల ప్లాన్ ఇలా ఉండగా ఇక్కడ థియేటర్ లో జరిగే షో కి హిట్లర్ వస్తాడు కాబట్టి సెక్యూరిటీ చెకింగ్ కోసం ఆర్మీ అధికారి వస్తాడు. అతనెవరో కాదు సినిమా మొదట్లో జ్యూయిష్ కుటుంబాన్ని చంపేసిన “హాన్స్ ల్యాండా”. ఆమె ఇతడిని గుర్తు పడుతుంది. ఇతడికి ఆప్పుడు జరిగింది ఏమీ గుర్తు ఉండదు. ఎందుకంటే కొన్ని వందల కుటుంబాలు లేపేసాడు. ఎన్నని గుర్తు పెట్టుకుంటాడు. ఆమెని సవాలక్ష ప్రశ్నలు వేసి అంతా బానే ఉంది అని నిర్ధారణ చేసుకుని థియేటర్ లో షో కి అనుమతి ఇస్తాడు.
ల్యాండా ని చూడగానే ఆమెకు పాత పగ గుర్తుకువస్తుంది. అతడిని థియేటర్ లోనే లేపెయ్యడానికి ప్లాన్ వేస్తుంది. దాని ప్రకారం ఆమె అసిస్టెంట్ తెర వెనక కొన్ని వందల సినిమా రీళ్లు కుప్పగా పోసి ఉంచుతాడు. ఆ రీళ్లు అయితే కాయితం, చెక్క కన్నా కూడా ఫాస్ట్ గా మండుతాయి. ఒక సారి ఆమె సిగ్నల్ ఇవ్వగానే అగ్గిపుల్ల గీసి పారిపోతాడు. అందరూ తప్పించుకునే లోగా థియేటర్ మొత్తం కాలి అందరూ బూడిద అయిపోతారు. ల్యాండా తో సహా. ఇదీ ఆమె ప్లాన్. అందుకోసం పాత సినిమా రీళ్లన్ని తెర వెనక కుప్పగా పోసి రెడీ గా ఉంచుతుంది.
ఇలా అందరూ ఎవరి ప్లాన్స్ లో వాళ్ళు ఉండగా ఆల్దో ప్లాన్ “హ్యాన్స్ ల్యాండా” కి, థియేటర్ అమ్మాయి ప్లాన్ ఆ సైనికుడు కి తెలిసిపోతాయి.ఇంతకీ ఆ అమ్మాయి ల్యాండా ని, Aldo హిట్లర్ నీ చంపారా లేదా అన్నది మిగతా కథ.
ఈ సినిమాలో పేరుకి హీరో బ్రాడ్ పిట్ అయినా కూడా సినిమా అయ్యాక, చూస్తున్నపుడు కూడా ఎక్కువ స్టాంప్ వేసేది హ్యాన్స్ ల్యాండా గా చేసిన “క్రిస్టోఫర్ వాల్ట్జ్”. అందుకే ఆస్కార్ కూడా వచ్చింది. మళ్లీ ఇదే డైరెక్టర్ తో చేసిన “డి జాంగో” సినిమాకి రెండో ఆస్కార్ వచ్చింది.
ఇక ఆల్డో అసోసియేట్ “బేర్ జ్యూ” గా చేసిన “ఎలి రోత్” అయితే చాలా సింపుల్ గా బేస్ బాల్ బ్యాట్ తీసి బుర్ర బద్దలు కొట్టి చంపేయడం చూస్తుంటే వీడికి కొంచెం పువ్వులు, అమ్మాయిలను చూపించండి రా అనిపించక మానదు.
ఈ బుర్రలు బద్దలు కొట్టే కార్యక్రమం, తర్వాత డిప్పలు వలిచే కార్యక్రమం మన తెలుగు సినిమాల్లో శోభనం సీన్ లా కెమెరా ప్యాన్ అయ్యి పువ్వుల మీద తుమ్మెద వాలినట్టు ఉండదు. బ్యాట్ ఎత్తి చంపేసి, కత్తి తీసి నెత్తి మీద నుండి మెదడు కనబడే దాకా క్లోజప్ లో చూపిస్తాడు.
ఒకవేళ టోరెంటినో గానీ ఉప్పెన సినిమా తీసి ఉంటే కొయ్యడం కూడా క్లియర్ గా చూపించేసే వాడేమో..!
ఈయన సినిమాల్లో దాదాపు బ్లడ్ బాడీ లో నుండి బయటకు రావడం కనబడకుండా మర్డర్ పూర్తి గాదు.టొరంటినో ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దాదాపు పదేళ్ళు కష్టపడ్డాడట.
ఈ సినిమాలో ఇంగ్లీష్ వినబడేది మహా అయితే గంటేమో. మిగతా అంతా కూడా “ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్” భాషలు వినబడతాయి. హ్యాన్స్ ల్యండా ఒక్కడే ఈ నాలుగు భాషల్లో మాట్లాడతాడు.
ఒక చోట అయితే దాదాపు అరగంట పాటు అసలు ఇంగ్లీష్ ముక్క వినబడదు. సబ్ టైటిల్స్ చూస్తూ సినిమా చూడాలి.
ఈ సినిమాలో ఏ ఇద్దరు కలిసినా కూడా ముందు కనీసం అయిదు నిమిషాలు మాట్లాడుకుని తర్వాత చంపడమో లేదా చావడమో చేస్తూ ఉంటారు. దాదాపు సినిమా నిండా డైలాగులే ఉంటాయి. ఈ సినిమా ఒక్క దానికేనా లేక టొరంటినో సినిమాలన్నీ అలాగే ఉంటాయా అనేది ఒకసారి చూడాలి.దీంట్లో తీసుకున్న ప్రదేశాలు, రాసిన సన్నివేశాలు చాలా వరకు జరిగాయి. ఇలా సగం నిజం సగం కల్పిత పాత్రలు, సన్నివేశాల తో తీసిన సినిమా మాంఛి హిట్ అయింది. 7 కోట్లతో తీస్తే దాదాపు 35 కోట్లు తెచ్చింది (డాలర్లు లో చెప్తున్నా).
ఒకవేళ ఈ సినిమా కోసం నెట్ లో వెతికితే “Inglorious Bastards” 2009 అనే వెతకండి. ఎందుకంటే 1978 లో “The Inglorious Bastards” అనే ఇంకో సినిమా వచ్చింది. పాత సినిమాని బట్టే ఆ కొత్త సినిమాకి ఆ పేరు పెట్టారు.