Don't Breath

ఊపిరి బిగబెట్టి సినిమా చూడటం అనే అనుభవం ఎప్పుడైనా ఎదురయిందా..!

మనం సినిమా చూస్తూ పొరపాటున ఏదైనా సౌండ్ చేస్తే అక్కడ స్క్రీన్ మీద కనబడే మనిషి చచ్చిపోతాడు అనిపించి నోరు మూసుకుని కదలకుండా సినిమా చూసారా..!

అలాంటి అనుభవం కావాలి అంటే ఈ సినిమా చూడండి.!

రాకీ, అలెక్స్, మనీ అనే ముగ్గురూ ఫ్రెండ్స్ పైగా తోడు దొంగలు. తాళం వేసి ఉన్న ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలు చెయ్యడం వీళ్ల వృత్తి.

వీళ్లలో రాకీ కి తనను ఎప్పుడూ తిట్టిపోసే తల్లి నుండి, తాగుబోతు బాయ్ ప్రెండ్ నుండి తప్పించుకుని తన చెల్లితో సహా కాలిఫోర్నియా లో స్థిరపడాలని అని కోరిక.వీళ్ల దరిద్రం ఇలా ఉండగా వీళ్ళకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే నార్మన్ అనే ఒక సైనికుడి ఇంట్లో దాదాపు మూడు లక్షల డాలర్లు ఉన్నాయి అని. ఆ డబ్బులు అతనికి అతని కూతురు ఏక్సిడెంట్ లో చనిపోవడం వల్ల నష్టపరిహారం కింద వచ్చాయి. ఆ సైనికుడు ఉండేది ఊరి చివర ఉన్న ఒక పాడుబడిపోయిన కాలనీలో ఉన్న అతని ఇంట్లో. ఆ కాలనీ లో ఇతను ఉన్న వీధిలో ఎవరూ ఉండరు. పైగా బ్లైండ్. దాంతో ఇక వీళ్లు వీళ్ల పంట పండింది అని సంబరపడి దొంగతనానికి ప్లాన్ చేసుకుంటారు.

ముగ్గురూ కలిసి రెక్కీ ప్లాన్ చేసుకుని ఒక రాత్రి ఆ ఇంట్లో దొంగతనానికి ముహూర్తం పెట్టుకుని ఆ కాలనీ లోకి వస్తారు. ఆ ఇంటి ముందు అతని కుక్క ఉంటుంది. దానికి కాసిన్ని మత్తు బిస్కెట్స్ పడేసి, ఇంట్లోకి వెళ్ళడానికి మొదట అనుకున్న దారి కుదరక వేరే దారిలో లోపలకు అడుగు పెడతారు.

తర్వాత ఆ నార్మన్ గదిలోకి వెళ్ళి మత్తు ఎక్కే ఒక గ్యాస్ బాంబు పడేసి బయటకు వచ్చి తీరిగ్గా డబ్బుకోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతున్న వాళ్ళకు లాక్ చేసిన ఒక డోర్ కనబడుతుంది. దాన్ని పగలగొట్టడం కోసం చేసిన శబ్దాలకు “నార్మన్” కి మత్తు దిగి మెలుకువ వచ్చి గదిలోనుండి బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చిన అతనికి ఇంట్లోకి ఎవరో బయట వాళ్ళు వచ్చారు అన్న అనుమానం వస్తుంది.

అనుమానం రావడం తోనే అలెర్ట్ అయ్యి ఆ ఇంటికి ఉన్న అన్ని తలుపులూ తాళాలు వేసి వెపన్ తీసుకుని రెడీ గా ఉంటాడు.అంతే ఇక్కడ నుండి వాళ్ళకు ఆ డబ్బు దొరక్కుండా కాపాడుకున్నాడా?

అసలు అతని దగ్గర ఆ డబ్బు ఉందా లేదా.?లోపలకు వెళ్ళిన ఆ ముగ్గురూ ప్రాణాలతో బయటకు వచ్చారా లేదా.? అన్నది సినిమాలో చూడండి.

ఈ సినిమా బడ్జెట్ కేవలం 10మిలియన్స్, మూడు లోకేషన్స్ మాత్రమే. కానీ దాదాపు 150 మిలియన్స్ వసూలు చేసింది. 2016 లో విడుదల అయిన ఈ సినిమా చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ అయింది.అవతార్ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటించిన Stephen Lang ఈ సినిమా లో నార్మన్ గా నటించాడు. గన్ పట్టుకుని వెతుకుతూ ఉంటే ఆరడుగుల చావు ఎదురుగా నిలబడి ఉన్నట్టే ఉంటాడు.!

ఈ సినిమా కోసం కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని మరీ నటించాడట. అవి ఇతని కంటి చూపును తగ్గించి నిజంగానే బ్లైండ్ ఎలా ప్రవర్తిస్తారో అలాగే నటించాడు.

ఈ సినిమాకి The Blind Man, Man In The Dark అని రెండు పేర్లు అనుకున్నారు. కానీ సినిమా మొదలయ్యాక “Don’t Breath” అని ఫిక్స్ అయ్యారు.

పేరుకి తగ్గట్టే ఈ “Don’t Breath” సినిమా మాత్రం చూస్తున్నంత సేపూ ఊపిరి ఆపేస్తుంది.బ్లైండ్ పర్సన్స్ మెయిన్ క్యారక్టర్ గా సినిమాలు రావడం అరుదు. మెయిన్ క్యారక్టర్ అంటే హీరోగా, హీరోయిన్ గా లేక విలన్ గా. ఒకవేళ అలాంటి సినిమాలు వచ్చినా ఎస్పీ పరశురామ్, పెళ్లి పందిరి సినిమాల్లో లాగా సినిమా మధ్యలో కళ్ళు రావడం, లేదా అమావాస్య చంద్రుడు లా పూర్తి లవ్ స్టోరీ రావడం. ఇంకా సినిమాలు ఉన్నాయేమో గుర్తు రావడం లేదు.

ఈమధ్య అనిల్ రావిపూడి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్, మలయాళం లో వచ్చిన (ఒప్పం) కనుపాప (మోహన్ లాల్), అదే సినిమా కన్నడ రీమేక్ (శివరాజ్ కుమార్) “కవచ” మాత్రం ఎక్సెప్షన్.!

ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఆ నార్మన్ పాత్రలో జగపతి బాబు, “కుమనన్ సేతురామన్” (రమణా! లోడెత్తాలిరా! చెక్ పోస్ట్ పడతాది!) ఇద్దరూ కనబడ్డారు.!