ఈ సినిమా చూసే ముందు కొన్ని సినిమాల లిస్ట్ చెప్తా.
- కృష్ణ (రవితేజ)
- గూఢచారి నంబర్ 1(చిరంజీవి)
- కిల్ బిల్ – 2 (ఉమా థర్మన్)
- జఫ్ఫా (బ్రహ్మానందం)
- జగపతి (జగపతి బాబు)
ఈ సినిమా చూసిన వెంటనే ఆ సినిమాలు చూడటం మర్చిపోకండి. ఈ సినిమా చూసాక ఎందుకో మీకే అర్థమవుతుంది.
నిజంగా ప్రభుత్వాలు, కంపెనీలు మనుషుల్ని అవసరం తీరాక ఎలా వదిలించుకుంటాయో, ఎప్పటికప్పుడు తమకు, తమ బ్రాండ్ నేమ్ కి నష్టం రాకుండా చట్టం పేరు చెప్పి ఎలా బయట పడతాయో బాగా చూపించారు.
పాల్ అనే ఒక ఉద్యోగికి స్పృహ రావడంతో కథ మొదలవుతుంది. చుట్టూ చూసుకున్న అతనికి తను ఒక “శవ పేటిక” లోఉన్నట్టు అర్థమవుతుంది.
స్పృహ లోకి వచ్చిన ఇతడికి ఏం జరిగిందో మెల్లిగా గుర్తుకు వస్తూ ఉంటుంది.
ఇతడిని, ఇతడితో పాటే ఇంకా కొందరినీ టెర్రరిస్ట్ లు కిడ్నాప్ చేసి బ్రతికుండగానే ఒక శవ పేటిక లో పెట్టి భూమిలో కప్పెట్టేస్తారు. దాంట్లో ఒక ఫోన్, లైటర్ మాత్రం ఉంచుతారు.
అతను ఆ ఫోన్ నుండి పోలీసులకు, FBI కి, ఇతను పని చేసే కంపెనీ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. కానీ ఎవరూ హెల్ప్ చెయ్యలేరు.
ఈలోగా ఇతనికి కిడ్నాపర్లు నుండి ఫోన్ వస్తుంది. ఇతడిని వదలాలంటే అయిదు మిలియన్ డాలర్ల డబ్బులు అడుగుతారు. అంతే కాకుండా ఇతనిని తనను కాపాడమని డబ్బులు అడుగుతూ వీడియో కూడా చెయ్యమంటారు.
ఇతను ఆ వీడియో చెయ్యడానికి ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తాడు. ప్రభుత్వానికి టెర్రరిస్టు లతో చర్చలు జరిపే పాలసీ లేదనీ, కానీ కాపాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్తారు. ఈలోగా ఇతనికి టెర్రరిస్ట్ నుండి వీడియో చేయమని ఫోన్ వస్తుంది.
ఇతను తప్పక విడియో చేసి పంపిస్తాడు. ఇతని వీడియో యూట్యూబ్ లో వైరల్ అవ్వడం పోలీస్ డిపార్ట్మెంట్ కి నచ్చదు.
ఈలోగా పేలుడు శబ్దం వినిపించి ఇతను ఉన్న శవ పేటిక మెల్లిగా ఇసకతో నిండటం మొదలవుతుంది. ఇంతలో ఇతనికి ఇతని ఉద్యోగ సంస్థ నుండి కాల్ వస్తుంది. ఇతనికి ఆఫీస్ లో ఉన్న ఒక ఎఫైర్ కారణంగా ఇతన్ని కిడ్నాప్ అవ్వడానికి ఒక రోజు ముందే తీసేసామని, అందువల్ల ఇతన్ని కాపాడటానికి కంపనీ కి సంబంధం లేదని, అంతేకాకుండా ఇతనికి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇతనికి గానీ ఇతని కుటుంబానికి గానీ కంపనీ నుండి ఎలాంటి డబ్బులూ రావనీ చెప్పి చేతులు దులిపేసుకుంటుంది.
ఈలోగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కాల్ వస్తుంది. ఇందాకా జరిగిన పేలుడు శబ్దం విమానం నుండి వేసిన బాంబు వల్ల అనీ, అందువల్ల కిడ్నాపర్లు చనిపోయి ఉండచ్చనీ చెప్తాడు. దీంతో ఇతనికి ఇంకా భయం వేస్తుంది. ఎందుకంటే ఇతన్ని ఎక్కడ పాతి పెట్టిందో తెలిసింది వాళ్ళకే. వాళ్ళే ఛస్తే ఇక ఇతని పొజిషన్ చావడమే.
చివరికి ఇతను చావడమో బ్రతకడమో ఏదో ఒకటి జరిగే ఉంటుంది కాబట్టి సస్పెన్స్ తో చూస్తేనే బావుంటుంది.
ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. అది కూడా ఓకే ఒక్క లొకేషన్ అది కూడా శవపేటిక లో మాత్రమే. సినిమా అంతా కూడా అక్కడే జరుగుతుంది. ఈ సినిమాలో బయట ప్రపంచం మనకు అసలు కనబడదు. తెరమీద ఆ ఒక్క పాల్ పాత్ర తప్ప ఇంకేం కనబడవు. మిగతా వారి మాటలు మాత్రం వినబడతాయి.
ఈ సినిమాని ఒక స్టూడియో లో జస్ట్ 17 రోజుల్లో షూట్ చేశారు.
ఈ సినిమా క్లైమాక్స్ లో అతన్ని నిజంగానే ఇసకతో కప్పెట్టేసారు (?) ట. కాకపోతే పక్కన మెడికల్ టీమ్ రెడీ గా ఉంది.
ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో చెయ్యడమే కాకుండా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది.
ఈ సినిమాలో హీరోగా చేసిన Ryan Reynolds సినిమా అయ్యేసరికి “Claustrophobia” తో ఇబ్బంది పడ్డాడట. “closed spaces” అంటే లిఫ్టులు, కిటికీలు లేని గదులు, టన్నెల్స్, అండర్ గ్రౌండ్ రోడ్స్ లాంటి వల్ల పానిక్ అవ్వడం అన్నమాట.
అన్నట్టు ఈ పోస్ట్ మొదట్లో కొన్ని సినిమాల పేర్లు ఎందుకు చెప్పానంటే పైన చెప్పిన వాటిలో కూడా లీడ్ క్యారక్టర్ ని గొయ్యి తవ్వి పాతేస్తారు.
కిల్ బిల్ లో అయితే Uma Thurman ఎలా తప్పించుకుంది అనేది క్లియర్ గా చూపిస్తాడు.
జఫ్ఫా సినిమా అయితే స్టోరీ యే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది.
ఇక ఆఖర్లో చెప్పిన “జగపతి” సినిమాలో అయితే నిజంగానే జగపతి బాబుని పెట్టెలో పెట్టి గొయ్యి తవ్వి పాతేసారు. దాదాపు రెండు నిమిషాల సింగిల్ షాట్. షాట్ అయిన వెంటనే సినిమా క్రూ మొత్తం హడావిడిగా బయటకు తీస్తారు. సినిమా చివర్లో ఎండ్ టైటిల్స్ లో వేస్తారు. ఈ ఒక్క సీన్ చాలు జగపతి బాబు కమిట్మెంట్ గురించి చెప్పడానికి.
PS: సినిమా చూసిన వాళ్ళు క్లైమాక్స్ చెప్పకండి.