Jean Rochefort, Anna Jean Rochefort, Anna Galiena in The Hair dressers husband in The Hair dressers husband

ఎవడైనా రాజు కావాలనుకుంటాడు, కాలం మారిపోయి రాజులు రాజ్యాలు పోయాయి కాబట్టి మంత్రి కావాలనుకుంటాడు. అలా అయ్యాక అన్నీ కుదిరితే విశ్వ సుందరికి, కుదరకపోతే కనీసం ప్రపంచ సుందరికి మొగుడవ్వాలనుకుంటాడు. 

కానీ ఒక కుర్రాడు మాత్రం చిన్నప్పటి నుండే ఒక “Hair Dresser” కి మొగుడు కావాలనుకున్నాడు. అలా ఎందుకనుకున్నాడో, అలా అనుకోవడం సరైనదో కాదో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

స్పాయిలర్స్ ఉంటాయి…

అంటోని అనే కుర్రాడు ఉన్నాడు. చిన్నప్పుడు ఆ కుర్రాడికి ఒకావిడ చాలా అద్భుతంగా హెయిర్ కటింగ్ చేస్తుంది. అద్భుతం అంటే అదేదో గొప్ప హెయిర్ స్టైల్ అని కాదు. ఆ కుర్రాడికి నచ్చేలా అని. చిన్నప్పుడు బార్బర్ షాపులో కటింగ్ చేయించుకున్నాక నవ్వు మొహంతో బయటికొచ్చే పిల్లల్ని  వేళ్ళ మీద లెక్కట్టచ్చు. అలాంటిది తమకి నచ్చేలా కటింగ్ చేసిన వాళ్ళ మీద ఇష్టం పెంచుకోవడంలో తప్పేముంది.

తమకి నచ్చేలా పాఠం చెప్పిన టీచర్, నచ్చేలా మాట్లాడే పక్కింటి అమ్మాయి, అలాగే నచ్చేలా కటింగ్ చేసిన హెయిర్ డ్రెస్సర్. 

ఆ హెయిర్ డ్రెస్సర్ అతడు సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్టు ఒక గులాబీ మొక్కకి అంటు కట్టినట్టు చాలా పద్దతిగా కటింగ్ చేస్తుంది.  

అయితే ఆ కటింగ్ చేసినావిడ వయసు చాలా ఎక్కువ అంటే తనకన్నా కొన్ని దాదాపు ముప్పై ఏళ్ళు పెద్దది. కాబట్టి అప్పుడేమి మాట్లాడడు. కానీ ఆవిడ కటింగ్ చేసిన విధానం మర్చిపోలేక పోతాడు. 

ఆవిడ మీద ఇష్టం పెరుగుతుంది. కొన్నాళ్ళకి ఆవిడ హఠాత్తుగా చనిపోతుంది. దాంతో ఆవిడ మీద ఇష్టం కాస్తా “హెయిర్ డ్రెస్సింగ్” చేసే ఆడవాళ్ళ మీద ఇష్టం గా మారుతుంది. ఎలాగైనా తాను పెళ్ళంటూ చేసుకుంటే ఒక “హెయిర్ డ్రెస్సర్” నే చేసుకోవాలి అని పంతం పడతాడు. 

ఇదో రకం క్రష్, అబ్సెషన్, అచ్చ తెలుగులో చెప్పాలి అంటే “మోహం”.

ఏళ్ళు గడిచిపోతాయ్. అతని పంతం మాత్రం మారదు.

చివరికి ఒకరోజు తమ వీధి చివర ఒక సలూన్ షాప్ లో హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్న ఒకమ్మాయిని (?) చూస్తాడు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఆ అమ్మాయే తన భార్య అని ఫిక్స్ అయిపోతాడు. చిన్నప్పుడు తనకి అద్భుతంగా కటింగ్ చేసినావిడ తర్వాత ఆ గ్రేస్, ఆ కంఫర్ట్ ఈ అమ్మాయిలో కనబడతాయి.

లేట్ చేయకుండా తనకి కటింగ్ అయిన వెంటనే ప్రపోజ్ చేసేస్తాడు. కొన్నాళ్ళు నాన్చి, ఆలోచించి అలోచించి చివరకి ఆ అమ్మాయి కూడా ఒకే అంటుంది.

అతనికి ఆమె కటింగ్ చేస్తూంటే చూడటం ఇష్టం. ఎంతిష్టం అంటే వాళ్ళ పెళ్లి జరిగే రోజున సలూన్ లో వెడ్డింగ్ డ్రెస్ లోనే పార్టీ చేసుకుంటూ ఉంటారు. షాప్ క్లోజ్ అని బోర్డ్ పెట్టక పోవడంతో ఒక కస్టమర్ షేవింగ్ కోసం లోపలకి వచ్చి, పెళ్లి జరుగుతోంది అని తెలిసి వేల్లిపోబోతాడు. కానీ ఆంటోని అతన్ని ఆపి షేవింగ్ చేయించి పంపిస్తాడు.  

మిగతా ప్రపంచంతో సంభంధం లేకుండా ఈ ఇద్దరూ ఇలా బ్రతుకుతూ ఉంటారు. పొద్దున్నే లేచిన వెంటనే ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకున్నామా.? షాపు ఓపెన్ చేశామా.? వచ్చిన కస్టమర్లకి కటింగ్ చేసామా.? డబ్బులు తీసుకున్నామా.? సాయత్రం మళ్ళీ షాపు క్లోజ్ చేసేసామా.? ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకున్నామా.? ప్రేమగా చూసుకున్నామా.?

వాళ్లకి ఆ షాపే సర్వస్వం. అదే మూవీ థియేటర్, డాన్స్ ఫ్లోర్. అక్కడుండే రెడ్ సోఫాయే వాళ్ళకి స్వర్గం. అక్కడే కూర్చుని బుక్స్ చదువుకుంటూ ఉంటారు. పైన వేరే ఫ్లోర్ ఉన్నట్టు మనకి మెట్లు కనిపిస్తాయ్. కానీ సినిమా అంతా కూడా ఆ సలూన్ షాప్ లోనే జరుగుతుంది.

ఇలా జీవితం మూడు ముద్దులు, ఆరు హగ్గులతో సాగిపోతూ ఉంటుంది.

ఇక్కడ దాకా ఒక రకంగా రొమాంటిక్ గా జరిగిన కథ ఇక్కడ నుండి కథ వేరే విధంగా వెళుతుంది.

ఒకరోజు రాత్రి ఆ నగరం లోనూ అతని జీవితం లోనూ పెద్ద తుఫాన్ వస్తుంది.

ఆమె ఒక డ్యాం లో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

ఎందుకో ఎవరికీ అర్థం కాదు. కానీ అతనికి మాత్రమే అర్థమయ్యేలా ఒక లెటర్ లో ఉంటుంది. 

అతను ఆమెని చాలా గాఢంగా ప్రేమిస్తాడు. ఆ విషయం ఆమెకి తెలుసు.

కానీ ఎవరి ప్రేమ అయినా ఎల్లకాలం ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కారణం చేత ఆ ప్రేమ ఆగిపోతుంది. ఆ విషయం ఆమెకి ఇంకా బాగా తెలుసు. ఆ ప్రేమ లేక పోవడాన్ని ఆమె ఊహించుకోలేక పోయింది.

అందుకే ఇద్దరి మధ్యా అలాంటి ప్రేమ ఉన్నప్పుడే ఆమె అతడి నుండి అందనంత దూరం వెళ్ళిపోయింది.

ఒక సారి “నీకు నా మీద ప్రేమ తగ్గితే కనక ఆ విషయం నాకు చెప్పెయ్యి. అంతే కానీ ప్రేమున్నట్టు మాత్రం నటించద్దు” అని చెప్పడాన్ని బట్టి ఆమె అతని ప్రేమ శాశ్వతం కాదని ఊహించుకుంది అని చెప్పచ్చు. 

ఆరంజ్ సినిమాలో రాం చరణ్ పాత్ర గుర్తుందా.? అక్కడ చెప్పింది ఇదే. ప్రేమ శాశ్వతం కాదు అని.

అలాగే ఒక వయసు వచ్చాక ప్రేక్షకులకి మనమంటే బోర్ కొడుతుంది. అంటే ప్రేమ తగ్గుతుంది. దాంతో మెల్లిగా అవకాశాలు తగ్గుతాయ్. దానికన్నా ముందే నేనే ప్రేక్షకులకి దూరం అయిపోతాను, అని అనుకుని ఒక నటుడు మంచి పేరు, ఇమేజ్ ఉండగానే సినిమాలు మానేశారు.

ఇది కూడా ఒక రకంగా లాంటిదే. 

నాకెందుకో ఈ సినిమాలో నటించిన వాళ్ళ గురించి, డైరెక్టర్ గురించి గానీ, టెక్నికల్ విషయాల గురించి గానీ రాయాలనిపించడం లేదు. ఒక సారి పాత్రలతో ప్రయాణం మొదలెట్టాక ఇకవేమీ మెదడు లోకి ఎక్కవు.

కాబట్టి ఈ సినిమా డైరెక్టర్ “Patrice Leconte” గురించి, లీడ్ రోల్స్ లో చేసిన “Jean Rochefort, Anna Galiena” మరోసారెప్పుడైనా చెప్పుకుందాం.

error: Content is protected !!